ఓవర్లో ఆరు సార్లయినా డైవ్‌ చేస్తా! | Virat Kohli reaches 10,000 ODI runs | Sakshi
Sakshi News home page

ఓవర్లో ఆరు సార్లయినా డైవ్‌ చేస్తా!

Published Fri, Oct 26 2018 2:44 AM | Last Updated on Fri, Oct 26 2018 8:46 AM

Virat Kohli reaches 10,000 ODI runs - Sakshi

వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని దాటడం సంతోషంగా ఉందని, అయితే ఇప్పటికీ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమిస్తానని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. పదేళ్లు దాటినా పరుగులు సాధించడంలో ఉదాసీనత ఉండరాదని అతను అన్నాడు. బుధవారం వైజాగ్‌ వన్డేలో పది వేల పరుగులు పూర్తి చేసుకొని సచిన్‌ టెండూల్కర్‌ కంటే వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అనంతరం తన మనోభావాలను బీసీసీఐ వెబ్‌సైట్‌తో పంచుకున్నాడు. కోహ్లి స్పందన అతని మాటల్లోనే...

‘పది వేల పరుగులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. నేను ఎంతో అదృష్టవంతుడినని చెప్పగలను. నా వన్డే కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకుంటానని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. సాధారణంగా అయితే నా దృష్టిలో ఇలాంటి వ్యక్తిగత మైలురాళ్లకు చోటు లేదు. అయితే పదేళ్లుగా ఆడుతూ ఇక్కడి దాకా చేరుకున్నామనే విషయం మనకు తెలుస్తుంది. అందుకే ఇది అంత ప్రత్యేకమని చెప్పగలను. నేను ఈ ఆటను అమితంగా ప్రేమించడమే నా ఆనందానికి మరో కారణం. అలాంటి క్రికెట్‌ను ఇంకా ఇంకా ఆడాలని భావిస్తున్నా కాబట్టి ఇదో విశేషంగా భావిస్తున్నా. ఇంత సుదీర్ఘంగా ఆడగలగడం సంతృప్తిగా ఉంది. మరిన్ని సంవత్సరాలు దీనికి జత కావాలి. ఇంతటి ఘనతను సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

భారత్‌ తరఫున ఆడితే చాలనుకున్నాను. ఇంతటి చిరస్మరణీయ రోజు వస్తుందనే ఆలోచన కూడా నాకు రాలేదు. మనం ఏం చేసినా దానిపైనే శ్రద్ధ పెట్టి సరైన దారిలో శ్రమించాలని మాత్రం తెలుసు. ఇలాంటి రికార్డులు కొంత కాలం తర్వాత చూస్తే ప్రాధాన్యత లేనివిగా కనిపిస్తాయి. పరుగులు చేయడమే నాకు తెలిసిన విద్య. సుదీర్ఘ కాలంగా దానిని పూర్తి చేసే క్రమంలోనే ఇలాంటి ఘనత దక్కింది. ప్రతీ మ్యాచ్‌లో జట్టు కోసం, జట్టు అవసరాలకు అనుగుణంగా భారీ స్కోరు కోసం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే నాకు తెలుసు.భవిష్యత్తుల్లో కూడా ప్రతీ మ్యాచ్, ప్రతీ పరిస్థితుల్లో అలాంటి పరుగులు చేయాలనుకుంటున్నా. శారీర కంగా, మానసికంగా కూడా నా శక్తియుక్తులు జట్టు కోసం పరుగులు సాధించేందుకు వెచ్చించాను.

పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటూ బ్యాట్‌తో నా పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. నా ఒక్కడి గురించి ఆలోచించి ఉంటే ఇలాంటి రికార్డులు రాకపోయేవేమో. బయటి నుంచి చూసేవారికి ఇదంతా మామూలుగానే కనిపించవచ్చు. కానీ కఠిన పరిస్థితులు ఎదురైన సమయంలో జట్టు కోసం తీవ్రంగా శ్రమించడం, మరో 10–12 ఓవర్లు అదనంగా ఆడితే వచ్చే పరుగులతో భారీ స్కోరుకు సహకరించడం ఎంతో ముఖ్యం. దేశం తరఫున ఆడే అవకాశం రావడం గొప్ప గౌరవం. అయితే పదేళ్ల తర్వాత కూడా దానిని నాకు లభించిన ప్రత్యేక హక్కుగా భావించడం లేదు. ఇప్పటికీ ప్రతీ పరుగు కోసం నేను కూడా తీవ్రంగా శ్రమించాల్సిందే. ఎందుకంటే భారత జట్టులో ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు.

మనకు ఆ అవకాశం ఉన్నప్పుడు పరుగులు చేసే విషయంలో అదే ఆకలి, తపన ఉండాలి. ఏ విషయంలోనూ ఉదాసీనత కనబర్చకుండా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాలి.  పరుగు పూర్తి చేసే క్రమంలో ఒకే ఓవర్లో ఆరు సార్లు డైవ్‌ చేయాల్సి వచ్చినా నేను వెనుకాడను. ఎందుకంటే నేను దేశం తరఫున ఆడేందుకు ఎంపికయ్యాను. అది నా బాధ్యతతో పాటు ఉద్యోగ ధర్మం కూడా. ఇలా నేను ఎవరికి మేలు చేయడం కోసమో ఆడటం లేదు. పైగా ఎవరి కోసమో నేను నిరూపించాల్సిన పని లేదు.నా శ్రమంతా ఆ అదనపు పరుగు కోసమే. నేను శారీరకంగా లేదంటే మానసికంగా అలసిపోయానని చెప్పి ఆ పరుగు తీయకుండా ఉండలేను. జట్టుకు ఉపయోగపడేందుకు ఏం చేయాల్సి వచ్చినా ఎప్పుడైనా చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను’   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement