సచిన్ రికార్డు ఈజీగా బద్దలుకొడతా..
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ లో సంచలనం అలిస్టర్ కుక్. అతి తక్కువ వయసులో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్ కుక్. ప్రపంచానికే క్రికెట్ నేర్పించిన దేశమైనప్పటికీ ఇప్పటివరకూ ఏ ఒక్క ఇంగ్లీష్ ఆటగాడికి టెస్టుల్లో పదివేల పరుగుల ఫీట్ సాధ్యపడలేదు. దశాబ్దాలుగా తమ జట్టు ఆటగాళ్లకు సాధ్యంకాని అరుదైన ఫీట్ అందుకోవడానికి ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ కేవలం 36 పరుగుల దూరంలో ఉన్నాడు. అతడు పగ్గాలు అందుకున్న తర్వాత జట్టులో ఎన్నో మార్పులు, మళ్లీ వారిలో జోష్ పెంచాడు. పదివేల పరుగుల క్లబ్ లో చేరిన 12వ ఆటగాడిగా, తొలి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ గానూ డబుల్ రికార్డులు సొంతం చేసుకోనున్నాడు.
క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొడితే వచ్చే మజానే వేరు అని డాషింగ్ బాట్స్ మెన్ అంటున్నాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ వయసు ప్రస్తుతం 31 ఏళ్ల 4 నెలలు. దీంతో క్రికెట్ దేవుడు సచిన్ రికార్డుపై కన్నేసినట్లు చెప్పకనే చెబుతున్నాడు. కుక్ 126 టెస్టుల్లో 9,964 పరుగులు చేశాడు. ఇంగ్లండ్, శ్రీలంక సిరీస్ ఈ నెలలో జరుగుతున్నందున మరికొన్ని రన్స్ జోడించి సచిన్ రికార్డును తిరగరాయడం తనకు అసాధ్యమేం కాదని పేర్కొన్నాడు.