టెం‘డర్’
అటవీ డివిజన్ల సంఖ్య : 6
యూనిట్ల సంఖ్య : 8
ఇప్పటి వరకు ఆహ్వానించిన టెండర్లు : 2
అమ్ముడుపోయిన యూనిట్లు : 31
మిగిలిన యూనిట్లు : 57
•తునికాకు సేకరణ టెండర్లకు ముందుకురాని గుత్తేదార్లు
•ఏటా మిగిలిపోతున్న యూనిట్లు
•కూలీలకు ఉపాధి దెబ్బ..
బెల్లంపల్లి : తునికాకు సేకరణకు సంబంధించిన టెండరు యూనిట్ల అమ్మకాలు నిరాశజనకంగా సాగుతున్నాయి. గుత్తేదార్లు యూనిట్ల కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. గతేడాది మాదిరిగానే ఈసారీ అంతంత మాత్రం గానే యూనిట్ల్లు అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తునికాకు యూనిట్లను గుత్తేదార్లకు విక్రయించి ఏటా ఆకు సేకరణ చేయిస్తోంది. ఇందు కు సంబంధించి ప్రత్యేకంగా టెండర్లను నిర్వహిస్తుంటుం ది. అటవీ శాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ చేపడుతారు.తునికాకు సేకరణతో వేసవిలో గ్రామీణులకు కొంత ఉపాధి లభిస్తుంది. గడిచిన మూడేళ్ల నుంచి తునికాకు టెండర్ యూనిట్ల అమ్మకాలు ఆశాజనకంగా జరగడం లేదు. పలుమార్లు టెండర్లను ఆహ్వానిస్తే.. గుత్తేదార్లు ముందుకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఏడాది గత నెల 20న, ఈ నెల 3వ తేదీన హైదరాబాద్‌లో రెండు దఫాలుగా టెండర్లు ఆహ్వానించారు. తొలిసారి నిర్వహించిన టెండర్లలో 25 యూనిట్లు అమ్ముడుపోగా మలి విడతగా నిర్వహించిన టెండర్లలో 6 యూనిట్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 57 యూనిట్లు అమ్ముడుపోవాల్సి ఉంది. ఆరు అటవీ డివిజన్లలో కేవలం నాలుగు డివిజన్లలో మాత్రమే యూనిట్ల అమ్మకాలు జరగగా, రెండు డివిజన్లలో బోణీ కాలేదు. ఈ నెల 12వ తేదీన మరోమారు టెండర్లు నిర్వహించడానికి అటవీ శాఖ సన్నద్ధమవుతోంది.
గతేడాది నిర్వహించిన టెండర్లలో 88 యూనిట్లకు గాను మొత్తం 40 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మరో 48 టెండర్ యూనిట్లు అమ్మకపోవడంతో ఆశించిన మేర ఆకు సేకరణ జరగలేదు. పూర్తిస్థాయిలో యూనిట్ల టెండర్లు విక్రయం లేక ఏటా ఆకు సేకరణ లక్ష్యం క్రమేపీ తగ్గుతోంది.
అమ్ముడుపోయిన యూనిట్లివే..
జిల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిర్మల్, జన్నారం అటవీ శాఖ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 88 యూనిట్లు ఉన్నాయి. వీటిలో మంచిర్యాల అటవి డివిజన్ పరిధిలో 24 యూనిట్లలో 8, బెల్లంపల్లిలో 19 యూ నిట్‌లలో 10, కాగజ్‌నగర్‌లో 13 యూనిట్లలో 6, ఆదిలాబాద్‌లో 26 యూనిట్లలో 7 చొప్పున యూనిట్లు విక్రయించారు. జన్నారం అటవీ డివిజన్లో 1 యూనిట్ ఉండగా, నిర్మల్ డివిజన్లో 5 యూనిట్లలో ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు.
చాక్‌తరస్ మరింత ఆలస్యం..
టెండర్ యూనిట్లను కాంట్రాక్టర్లు కొనుగోలు చేయకుంటే చాక్‌త రస్ (కొమ్మకొట్టే పనులు) ఆలస్యమవుతాయి. సాధారణంగా మార్చి మొదటి వారంలోనే పల్లెలు, అటవీ ప్రాంతాల్లో కొమ్మకొట్టే పనులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించి న ప్రకారం యూనిట్లు అమ్ముడుపోని పక్షంలో చాక్‌తరస్ పనులు జాప్యమయ్యేం దుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరో పక్క కూలీలకూ సరిగా పని ఉండ దు. ఆకు సేకరణతో ఏటా గ్రామీణులు కనీసం 45 రోజులపాటు ఉపాధి పొం దాల్సి ఉండగా యూనిట్ల కొనుగోలు అంతంత మాత్రంగానే జరగడం, కొమ్మకొట్టే పనులు ఆలస్యం కావడంతో పక్షం రోజులు మాత్రమే తునికాకు సేకరిస్తున్నారు. కొన్ని యూనిట్లలో వారం రోజుల్లోనే ఆకు సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. చేతినిండా పనిలేక వేసవిలో గ్రామీణులు వలస బాట పడుతున్నారు.
50 ఆకుల కట్ట ధర రూ.1.18 పైసలు..
తునికాకు కట్ట ధరను ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది 50 ఆకుల కట్టకు ప్రభుత్వం రూ.1.15 పైసలు చెల్లించగా ఈసారి 3 పైసలు పెంచింది. పెంచిన కట్ట ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని గ్రామీణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతుండగా రోజంతా కష్టపడి సేకరించిన ఆకు కట్టకు కేవలం రూ.1.18 పైసలు చెల్లించడం ఏ తీరుగా చూసినా సబబుగా లేదని పల్లె ప్రజలు వాపోతున్నారు.