నాదల్ ‘నవ’ చరిత్ర
► తొమ్మిదోసారి బార్సిలోనా ఓపెన్ టైటిల్ సొంతం
► మూడు టోర్నీలను 9సార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు
► అత్యధిక క్లే కోర్టు టైటిల్స్ రికార్డు సమం
బార్సిలోనా (స్పెయిన్): కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ ఫామ్ కోల్పోయినట్లుగా కనిపించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మళ్లీ గాడిలో పడ్డాడు. వరుసగా రెండో వారం మరో సింగిల్స్ టైటిల్‌ను గెలిచాడు. ఆదివారం రాత్రి ముగిసిన బార్సిలోనా ఓపెన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ నాదల్ విజేతగా నిలిచాడు.డిఫెండింగ్ చాంపియన్ కీ నిషికోరి (జపాన్)తో జరిగిన ఫైనల్లో నాదల్ 6-4, 7-5తో విజయం సాధించాడు. క్లే కోర్టులపై నాదల్‌కిది 49వ టైటిల్ కావడం విశేషం. ఈ క్రమంలో నాదల్ బార్సిలోనా ఓపెన్ టైటిల్‌ను రికార్డుస్థాయిలో తొమ్మిదిసార్లు సాధించి కొత్త చరిత్ర లిఖించాడు. గతంలో నాదల్ 2005 నుంచి 2009 వరకు... 2011 నుంచి 2013 వరకు ఈ టోర్నీ టైటిల్స్‌ను సాధించాడు.
► తాజా విజయంతో నాదల్ మూడు వేర్వేరు టోర్నమెంట్లలో తొమ్మిదిసార్లు చొప్పున విజేతగా నిలిచిన ఏకైక ప్లేయర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. గతంలో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొమ్మిదిసార్లు (2005 నుంచి 2008 వరకు; 2010 నుంచి 2014 వరకు)... మోంటెకార్లో టోర్నీలో తొమ్మిదిసార్లు (2005 నుంచి 2012 వరకు; 2016లో) చాంపియన్‌గా నిలిచాడు.
► గతంలో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (హాలె ఓపెన్), అర్జెంటీనా మాజీ స్టార్ గిలెర్మో విలాస్ (బ్యూనస్ ఎయిర్స్ ఓపెన్) ఒక టోర్నీని అత్యధికంగా ఎనిమిదిసార్లు చొప్పున సాధించారు.
► ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 69వ సింగిల్స్ టైటిల్. ఈ గెలుపుతో నాదల్ క్లే కోర్టులపై అత్యధికంగా 49 టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పిన గిలెర్మో విలాస్ సరసన చేరాడు. మరో టైటిల్ సాధిస్తే నాదల్ క్లే కోర్టులపై అత్యధిక టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త రికార్డు సాధిస్తాడు.
► రెండు గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. నాలుగో గేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లోనూ నాదల్ తన జోరు కొనసాగిస్తూ 4-1తో ఆధిక్యాన్ని సంపాదించాడు.
అయితే నిషికోరి వెంటనే తేరుకొని నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు స్కోరును 4-4తో సమం చేశాడు. ఆ తర్వాత పన్నెండో గేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన నాదల్కు 4,60,000 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 45 లక్షలు) లభించింది.