స్పాట్లో గందరగోళం
► ప్రారంభమైన పదో తరగతిస్పాట్ వాల్యూయేషన్
► డీఏ తక్కువ వుందని గానికిపైగా స్పెషల్ అసిస్టెంట్లు డుమ్మా
► గైర్హాజరైన వారిలో సోషియల్, తెలుగు అసిస్టెంట్లు అధికం
► డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ శనివారం మాంటిస్సోరి పాఠశాలల్లో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య ప్రారంభమైంది. ఉదయం నుంచి 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అసిస్టెంటు ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు రిపోర్టు చేయడానికే సమయం సరిపోయింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి కొన్ని పేపర్ల స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. మొదటి రోజు ఒక్క అసిస్టెంటు ఎగ్జామినర్ 20 పేపర్లను మాత్రమే వాల్యూయేషన్ చేశారు. పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విధులకు హాజరు కావాల్సి ఉన్నా సహేతుకం లేని కారణాలు చెప్పి డుమ్మా కొట్టారు. పెళ్లిళ్లు, అనార్యోగం, తీవ్ర ఎండలు పేరునా ఎక్కువ మంది గైర్హాజరయ్యారు.
అనారోగ్యం పేరు చెప్పిన వారిలో ఆరోగ్యంగా ఉన్న వారే అధికమని, అయినా ఆ సాకుతో విధులకు గైర్హాజరవ్వడం విస్మయం కలిగిస్తోంది. ఎక్కుగా తెలుగు, సోషల్ అసిస్టెంటు ఎగ్జామినర్లు విధులకు గైర్హాజరయ్యారు. ముందస్తుగా అధికారులు తెలుగుకు సంబంధించి మొత్తం 166 ఏఈలకు అదనంగా 30 శాతం కలుపుకొని 238 మందికి వాల్యూయేషన్ విధులు కేటాయించారు. అయితే అందులో 150 మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే 400 మంది సోషల్ అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గాను 300 మంది మాత్రమే రిపోర్టు చేశారు. ఇందులోనూ 30 శాతం అదనంగా ఉన్నా 100 మంది విధులకు గైర్జాజరవ్వడంతో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యం బారిన ఉన్న వారికి మాత్రమే విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఒక్కో అసిస్టెంటు ఎగ్జామినర్ కేవలం 20 పేపర్లను మాత్రమే దిద్దారు. ఆదివారం ఉదయం నుంచి మాత్రం పూర్తిస్థాయిలో వాల్యూయేషన్ ప్రారంభమవుతుంది. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ 40 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది.
అధికారులు బిజీబిజీ
క్యాంపు ఆఫీసర్ హోదాలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు డీసీఈబీ కార్యదర్శి ఓంకార్‌యాదవ్, ఆదోని, కర్నూలు డీవైఈఓలు శివరాముడు, తహెరాసుల్తానా ఇతర అధికారులు కూడా తమతమ పనుల్లో బిజీగా గడిపారు.
డీఏ తక్కువని విధులకు డుమ్మా
మరోవైపు అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లకు సాయంగా పనిచేయాల్సిన స్పెషల్ అసిస్టెంట్లు కూడా భారీ స్థాయిలో విధులకు డుమ్మా కొట్టారు. మొదట సమ్మతించి తీరా డీఏ తక్కువగా ఉందని గైర్హాజరైనట్లు గుసగుసలు వినిపించాయి. మొత్తం 328 మంది స్పెషల్ అసిసెంట్లకు సగం మంది కూడా హాజరు కాలేదు. స్పెషల్ అసిస్టెంట్లుగా ఎస్జీటీ, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్లను నియమిస్తారు. అయితే అప్పటికప్పుడు కొందరు టీచర్లు తమకు విధులకు అవకాశం కల్పించాలని అధికారులకు విన్నించారు. అందుకు సమ్మతించిన అధికారులు దాదాపు 50 మందికిపైగా స్పెషల్ అసిస్టెంట్లు విధులు కేటాయించారు. అయినా ఇంకా 75 మంది ఉపాధ్యాయుల సేవలు అవసరం ఉందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ఎగ్జామ్స్ ఓంకార్ యాదవ్ తెలిపారు. వీరిని కూడా ఆదివారం ఉదయంలోపు నియమించి స్పాట్‌కు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన వివరించారు.