ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్న కడియం
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం పట్టుబట్టిన ఉపాధ్యాయ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి డిమాండ్లను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని కడియం హామీ ఇచ్చారు. వాటిపై అధ్యయనం కోసం నెల రోజులు సమయం కోరారు. దీనికి అంగీకరించిన ఉపాధ్యాయ సంఘాలు పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్ బహిష్కరణ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి.
సుదీర్ఘంగా చర్చలు..
ఉపాధ్యాయులు లేవనెత్తిన 34 డిమాండ్లపై జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నేతలతో శనివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.45 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉపాధ్యాయ సంఘాల నేతల మధ్య పలు అంశాలపై అంగీకారం కుదిరింది. ఉపాధ్యాయుల డిమాండ్లను అధ్యయనం చేసి, పరిష్కరించేందుకు నెల రోజులు సమయం కావాలని కడియం కోరగా.. ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించాయి. నెల రోజులలోపు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని.. న్యాయ, సాధారణ పరిపాలన శాఖల అధికారులను కూడా దానికి పిలుస్తామని కడియం హామీ ఇచ్చారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా..
టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ పారితోషికం పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక కోర్టుల పరిధిలో ఉన్న ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యకు వేగంగా పరిష్కారం లభించేలా చర్యలు చేపట్టాలని, ప్రత్యేకంగా ఒక అడ్వొకేట్‌ను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరగా.. దానికి కడియం అంగీకరించారు. ఉద్యోగుల వైద్య పథకం కింద ఉచితంగా వైద్యం అందించే వెల్‌నెస్ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసేలా విద్యాశాఖ తరఫున ముఖ్యమంత్రిని కోరుతానని హామీ ఇచ్చారు. ఇక సీపీఎస్ రద్దు అన్నది విధానపర నిర్ణయమని, అలాంటి సమస్యలపై ముఖ్యమంత్రి పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. డిమాం డ్ల పరిష్కారం కోసమంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా పరీక్షలు, మూల్యంకనాన్ని బహిష్కరి స్తామనే పద్ధతి మంచిది కాదని సూచించారు. మొత్తంగా తమ డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో ఉపాధ్యాయ సంఘాలు స్పాట్ వ్యాల్యుయేషన్ బహిష్కరణ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment