Teacher associations
-
జిల్లాలో రెండేళ్లు ఉంటే చాలు
సాక్షి, అమరావతి: అంతర్ జిల్లా టీచర్ల బదిలీల నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి.. ఆ జిల్లాలో ప్రస్తుత కేడర్‌లో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉండాలన్న నిబంధనుంది. అయితే టీచర్ సంఘాల అభ్యర్థన మేరకు కేడర్‌తో సంబంధం లేకుండా ఆయా జిల్లాల్లో నియామకమై 2021 జూన్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉంటే చాలని నిబంధనను సవరించారు. దీనిని అనుసరించి టీచర్లు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.వెంకటేశ్వరరావులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సర్కారు వేధింపు.. టీచర్లపై కక్ష సాధింపు!
విజయనగరం అర్బన్: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న అనుమానంతో ఉద్యోగులపై ప్రభుత్వం వేధింపుల పర్వానికి తెరలేపింది. రెండేళ్ల క్రితం చేపట్టిన నిరసనలకు సంబంధించిన కేసు సమసిపోయిందనుకున్న తరుణంలో 15 మంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు శుక్రవారం రాత్రి పోలీస్ యంత్రాంగం కోర్టు సమన్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగం నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా అనుమానం ఉన్న వర్గాలపై వివిధ రూపాల్లో కొద్దిరోజులుగా వేధింపులు మొదలయ్యాయి. పోస్టల్ ఓటింగ్ భారీగా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసుంటారని జిల్లావ్యాప్తంగా ప్రచారం సాగింది. ఇంటెలిజెన్స్ విభాగం కూడా ప్రభుత్వానికి అదే నివేదిక ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా కొందరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉన్నందున పాత కేసులను తిరగదోడితే వారు జాగ్రత్త పడే అవకాశం ఉందని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2017నాటి కేసులో సమన్లు వెబ్ బదిలీ విధానాన్ని మానుకుని పాత విధానాన్నే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఫ్యాప్టో, జాక్టో రాష్ట్ర కమిటీల రాష్ట్రవ్యాప్త పిలుపుతో 2017 జూన్ 21న జిల్లాలోని ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉపాధ్యాయుల తాకిడికి కలెక్టరేట్ ప్రధాన గేటు విరిగిపోయింది. కానీ రెండురోజుల తరువాత జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు 15 మంది నాయకులపై కేసు పెట్టారు. కేసులను వెనక్కి తీసుకోవడానికి కలెక్టర్ వివేక్‌యాదవ్ చూపిన చొరవ ఫలించింది. ఆయన ఆదేశాల మేరకు గేట్లను ఉపాధ్యాయులే మరమ్మతు చేయించారు. దీంతో కేసు ముగిసిందని ఉపాధ్యాయులు భావించారు. కానీ.. వారందరికీ రెండేళ్ల తరువాత శుక్రవారం సమన్లు రావడం చర్చనీయాంశమైంది. కలెక్టర్, ఎస్పీలను కలిసిన ప్రతినిధులు కోర్టు సమన్లు అందుకున్న 15 మంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, జిల్లా ఎస్పీ దామోదర్‌ను శనివారం కలిశారు. అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు గేటు మరమ్మతు చేయించేశామనీ, ఇప్పుడు మళ్లీ సమన్లు ఎందుకొచ్చాయో తెలియడం లేదని చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కె.శేషగిరి, టి.సన్యాసిరావు, డి.ఈశ్వరరావు, కె.శ్రీనివాసన్ తదితరులు ఉన్నారు. కేవలం కక్ష సాధింపుతోనే పాత కేసులు తిరిగి తెరిచారని ఉపాధ్యాయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉగ్రవాదులం కాదు..ఉపాధ్యాయులం
సాక్షి, అమరావతి: తాము విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులమే కానీ విధ్వంసం సృష్టించే ఉగ్రవాదులం కాదంటూ టీడీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందజేయాలన్న డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు బుధవారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావుతోపాటు అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయులు నగరంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ధర్నా చౌక్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రసంగించారు. డిమాండ్ల సాధన కోసం శాంతియుత ర్యాలీ, ధర్నాకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఏ తప్పు చేశామని అర్ధరాత్రి అరెస్ట్‌లు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలల్లోకి పోలీసులు ప్రవేశించి ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం తమ మనోభావాలను దెబ్బతీసిందని, వెంటనే క్షమాపణ చెప్పి రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నిర్బంధించిన వారందరినీ విడుదల చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసే హక్కు తమకుందని, దాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని తేల్చిచెప్పారు. టీడీపీకి ఒక న్యాయం.. మాకో న్యాయమా? అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ధర్మపోరాట దీక్షల పేరుతో రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి ధర్నాలు చేస్తే తప్పు కానప్పుడు తాము శాంతియుతంగా నిరసన తెలపడం తప్పెలా అవుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకో న్యాయం, తమకో న్యాయమా అని ప్రశ్నించారు. గతంలో ఉపాధ్యాయులతో పెట్టుకున్నందుకు టీడీపీని అధికారానికి దూరంగా ఉంచామని, మరోసారి అందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. టీచర్లతో పెట్టుకుంటే అధికారానికి దూరం కావాల్సిందేనని సీఎం చంద్రబాబే గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరాడుతాం ఉపాధ్యాయుల పోరాటాన్ని అణచి వేయాలనే ప్రభుత్వం ప్రయత్నించడం తగదని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ... ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ బాబురావు ఉపాధ్యాయులను ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానించడానికి ధర్నా చౌక్‌కు వచ్చారు. ఫ్యాప్టో తరపున ప్రతినిధులు తమతో వస్తే విద్యాశాఖ కమిషనర్‌తో డిమాండ్లు చెప్పుకోవచ్చన్నారు. సంఘం తరపున 12 మంది సభ్యులు సచివాలయానికి వెళ్లారు. 13న ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు ప్రభుత్వ టీచర్లు, విద్యారంగ సమస్యలపై ఈ నెల 13న ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్ ఎమ్మెల్సీలతో ప్రభుత్వం చర్చించనుంది. విజయవాడలో ధర్నా అనంతరం నేతలు, టీచర్ ఎమ్మెల్సీలతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి) ఆదిత్యనాథ్ దాస్ వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని తన చాంబర్లో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు, ఫ్యాప్టో నేతలు బాబురెడ్డి, హృదయరాజు, నాగేశ్వరరావు, పాండురంగ వరప్రసాద్, పి.కృష్ణయ్య, జీవీ నారాయణరెడ్డి, రవిచంద్రకుమార్, సుధీర్, కరీముల్లా రావు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్, పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్, పదోన్నతుల కల్పన వంటి ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ నెల 13న సీఎంఓలో చర్చలకు రావాలని ఆదిత్యనాథ్ దాస్ సూచించారు. నియోజకవర్గానికి ఒక డిప్యూటీ డీఈఓ పోస్టును ఏర్పాటు చేయడంపైనా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించి త్వరలోనే జీఓ జారీ చేస్తామని తెలిపారు. 1,200 మంది అరెస్టు టీచర్లు చేపట్టకుండా మంగళవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలను ప్రభుత్వం అరెస్టు చేయించింది. అరెస్టయిన వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని నేతలు కోరారు. ఆదిత్యనాథ్ దాస్ డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది టీచర్లను అరెస్టు చేశారని, అనధికారికంగా 5,000 మందిని అదుపులోకి తీసుకున్నారని నేతలు తెలిపారు. -
టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జీవో 16 జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖ కూడా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. గురువారం ఉదయం షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈసారి బదిలీ ప్రక్రియను ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఆఫ్‌లైన్ పద్ధతిలో చేపట్టాలని డిమాండ్ చేసినా.. విద్యాశాఖ మాత్రం ఆన్లైన్ వైపే మొగ్గుచూపింది. ఈ నెల 7 నుంచి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చారు. ఉపాధ్యాయులు వేకెన్సీ పొజిషన్‌ను చూసుకుంటూ బదిలీలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన టీచర్లకు బదిలీ తప్పనిసరి కానుంది. తాజా మార్గదర్శకాల్లో గత నిబంధనలను అనుసరించినప్పటికీ కొన్ని మార్పులు చేశారు. ఆ వివరాలివీ.. - ఉద్యోగి స్పౌజ్‌కు హృద్రోగాలు లేదా కిడ్నీ లేదా కేన్సర్ వంటి వ్యాధులుంటే వారిని ప్రిఫరెన్షియల్ కోటాలో చేర్చుతారు. గతంలో పిల్లలకు మాత్రమే ఇలాంటి వ్యాధులుంటే ఈ కోటా వర్తించేది. పిల్లల కేటగిరీలో డయాబెటిక్, గుండె సంబంధిత వ్యాధులు, బ్లడ్ కేన్సర్, మానసిక వైకల్యం కేటగిరీ వారికి ప్రాధాన్యం ఇస్తారు. - స్పౌజ్ కేటగిరీలో ఇచ్చే ప్రాధాన్య పాయింట్లు దుర్వినియోగం కాకుండా భార్యాభర్తల్లో ఒకరు ఉన్న చోటికి మరొకరిని పంపేలా వారు పని చేసే స్కూల్‌ను జీపీఎస్ ద్వారా లింకు చేసి, అక్కడికే మరొకరిని పంపిస్తారు. స్పౌజ్ పాయింట్లు భార్య, భర్త ఇరువురిలో ఒకరు మాత్రమే వినియోగించుకోవాలి. - భార్య/భర్త ఇరువురిలో ఒకరు స్పౌజ్ పాయింట్లు వినియోగించుకున్నట్లయితే.. మరొకరు పనిచేసే చోటు నుంచి 50 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న స్థానాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ దూరం ఉన్న స్థానానికి ఆప్షన్ ఇచ్చుకుంటే జనరల్ పద్ధతిలో బదిలీ చేస్తారు. - టీచర్‌కు ఎనిమిదేళ్లు, హెడ్ మాస్టర్‌కు 5 ఏళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. - ఆన్లైన్లో ‘నాట్ విల్లింగ్’కు అవకాశం ఉండదు. పని చేస్తున్న ప్రదేశంలో రెండేళ్ల సర్వీసు ఉన్న వారు (బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత కలిగినవారు) తమకు కచ్చితంగా ట్రాన్స్ఫర్ కావాలనుకునే ఒకటీ రెండు స్కూళ్లకు (ప్లేస్‌లు) మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వాటిల్లో వస్తే అలాట్ అవుతుంది. లేదంటే పాత స్కూల్లోనే ఉంటారని అధికారులు వెల్లడించారు. ఒకట్రెండు రెండు కూడా వద్దనుకుంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దు. - 5, 8 ఏళ్ల సర్వీసుతో తప్పనిసరి బదిలీ అయ్యే వారు, రెండేళ్ల సర్వీసుతో బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగిన వారు, మిగతా టీచర్లతో కూడిన జాబితాలను డీఈవోలు ప్రకటించారు. -
‘స్పాట్’ బహిష్కరణ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం పట్టుబట్టిన ఉపాధ్యాయ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి డిమాండ్లను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని కడియం హామీ ఇచ్చారు. వాటిపై అధ్యయనం కోసం నెల రోజులు సమయం కోరారు. దీనికి అంగీకరించిన ఉపాధ్యాయ సంఘాలు పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్ బహిష్కరణ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. సుదీర్ఘంగా చర్చలు.. ఉపాధ్యాయులు లేవనెత్తిన 34 డిమాండ్లపై జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నేతలతో శనివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.45 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉపాధ్యాయ సంఘాల నేతల మధ్య పలు అంశాలపై అంగీకారం కుదిరింది. ఉపాధ్యాయుల డిమాండ్లను అధ్యయనం చేసి, పరిష్కరించేందుకు నెల రోజులు సమయం కావాలని కడియం కోరగా.. ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించాయి. నెల రోజులలోపు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని.. న్యాయ, సాధారణ పరిపాలన శాఖల అధికారులను కూడా దానికి పిలుస్తామని కడియం హామీ ఇచ్చారు. సీఎం దృష్టికి తీసుకెళ్తా.. టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ పారితోషికం పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక కోర్టుల పరిధిలో ఉన్న ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యకు వేగంగా పరిష్కారం లభించేలా చర్యలు చేపట్టాలని, ప్రత్యేకంగా ఒక అడ్వొకేట్‌ను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరగా.. దానికి కడియం అంగీకరించారు. ఉద్యోగుల వైద్య పథకం కింద ఉచితంగా వైద్యం అందించే వెల్నెస్ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసేలా విద్యాశాఖ తరఫున ముఖ్యమంత్రిని కోరుతానని హామీ ఇచ్చారు. ఇక సీపీఎస్ రద్దు అన్నది విధానపర నిర్ణయమని, అలాంటి సమస్యలపై ముఖ్యమంత్రి పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. డిమాం డ్ల పరిష్కారం కోసమంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా పరీక్షలు, మూల్యంకనాన్ని బహిష్కరి స్తామనే పద్ధతి మంచిది కాదని సూచించారు. మొత్తంగా తమ డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో ఉపాధ్యాయ సంఘాలు స్పాట్ వ్యాల్యుయేషన్ బహిష్కరణ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించాయి. -
ప్రమోషన్లు మాకంటే మాకు
► విద్యాశాఖలో పదోన్నతుల లొల్లి ► పర్యవేక్షణాధికారుల పోస్టుల కోసం వెల్లువెత్తుతున్న డిమాండ్లు సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ప్రమోషన్ల లొల్లి మొదలైంది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో), మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్(ఎంఈవో) వంటి పర్యవేక్షణాధి కారుల పోస్టులతోపాటు డైట్, బీఎడ్ కాలేజీ లెక్చరర్ల వంటి కొలువుల్లో పదోన్నతులను తమకంటే తమకే కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 1998 నుంచి 2005 వరకు ఇచ్చిన పదోన్నతులను రద్దు చేసి, సీనియారిటీ ఆధారంగా పర్యవేక్షణ అధికారి పోస్టులను తమకు కేటాయించాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్ చేస్తుండగా, ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి, సమాన సీనియారిటీ ప్రాతిపదికన ఆ పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ టీచర్లు కోరుతున్నారు. మరోవైపు గిరిజన ప్రాంత టీచర్లు కూడా తమను ఏకీకృత సర్వీసు రూల్స్ పరిధిలోకి తెచ్చి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఏపీపీఎస్సీ ద్వారా 1997లో జోనల్ కేడర్‌లో స్కూల్ అసిస్టెంట్లుగా నియమితులైన టీచర్లు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. పర్యవేక్షణ అధికారి పోస్టు జోనల్ కేడర్ కావడం, తాము జోనల్ కేడర్లోనే నియమితులైనందున సీనియారిటీ ఆధారంగా తమకే ఆ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటున్నారు. దీంతో విద్యాశాఖ రంగంలోకి దిగి వారంతా నిజంగా జోనల్ కేడర్లోనే నియమితులయ్యా రా? అన్న అంశంపై స్పష్టత కోసం ఇటీవల ఏపీపీఎస్సీకి లేఖ రాసి వివరాలు తెప్పించుకుంది. ఏపీపీఎస్సీ కూడా వారంతా జోనల్ కేడర్లోనే నియమితులైనట్లు చెప్పడంతో ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. అసలైన అర్హులెవరు: అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో పదోన్నతులకు అసలు అర్హులెవరు అన్న అంశం తెరపైకి వచ్చింది. దీనిపై విద్యాశాఖ వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతోంది. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపకల్పనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినందున తమకే ఎక్కువ ప్రమోషన్లు లభిస్తాయని పంచాయతీరాజ్ టీచర్లు ఆనం దంలో మునిగిపోయారు. ఈలోగా రాష్ట్రపతి ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ఎలా ఆమోదం తెలుపుతారని ప్రభుత్వ టీచర్ల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఆ కేసు విచారణకు తీసుకుంది. అయితే కొద్దిరోజుల్లోనే ఆ వివాదం పరిష్కారం అవుతుందని, ఆలోగా సర్వీస్ రూల్స్‌ను సిద్ధంగా ఉంచేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పర్యవేక్షణ అధికారి పోస్టులు తమకంటే తమకు ఇవ్వా లని ఉద్యోగులు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. ఇక 1976లోనే తమ పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేసినందున పర్యవేక్షణ అధికారితోపాటు లెక్చరర్ పోస్టులకు తాము అర్హు లమేనంటూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఇకపై పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
జోగిపేట : పాఠశాలల్లో విద్యార్థుల చదువు సామర్థ్యాలు.. మౌలిక వసతులపైనా దృష్టి సారించిన తెలంగాణ సర్కార్ ఇకపై వారంలో ఒక రోజు జిల్లాలోని ఏదో ఒక పాఠశాలలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల రెండు వారం నుంచే అధికారుల పర్యటనలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఏ పాఠశాలను తనిఖీ చేస్తామనే విషయం రాష్ట్ర ఉన్నత అధికారులకు తప్ప డీఇఓలకు సైతం తెలియనివ్వమని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ పాఠశాలలో తనిఖీ ఉంటుందోనని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, ఇన్చార్జ్ ఎంఈఓలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పాఠశాలలు.... జిల్లాలో 2,900 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 3.40 లక్షల మంది విద్యార్థులున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 12,300 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జిల్లాలో జిల్లా పరిషత్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. మండల, పట్టణ కేంద్రాల కంటే ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని మారు మూల ప్రాంతాల్లోని పాఠశాలలకు టీచర్లు వారంలో రెండు రోజులకు మించి పాఠశాలలకు వెళ్లని వారు కూడా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఉపాధ్యాయులు లేక ఆయా పాఠశాలల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన సంఘటనలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పుల్కల్ మండలంలోని ఒక పాఠశాలలో ప్రైవేట్‌గా ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసుకుని రెగ్యులర్ ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొడుతున్న సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. జిల్లాలో గల ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలో సుమారుగా వంద వర కు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నట్లు సమాచారం. మారు మూల ప్రాంతాల పాఠశాలలకు అధికారులు వెళ్లకపోవడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు సక్రమంగా నడవడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక తనిఖీల నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నట్లు ప్రకటించాయి. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహించ డం సహించరాని నేరమేనన్నారు.