సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జీవో 16 జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖ కూడా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. గురువారం ఉదయం షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈసారి బదిలీ ప్రక్రియను ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఆఫ్‌లైన్ పద్ధతిలో చేపట్టాలని డిమాండ్ చేసినా.. విద్యాశాఖ మాత్రం ఆన్‌లైన్ వైపే మొగ్గుచూపింది. ఈ నెల 7 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఉపాధ్యాయులు వేకెన్సీ పొజిషన్‌ను చూసుకుంటూ బదిలీలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన టీచర్లకు బదిలీ తప్పనిసరి కానుంది. తాజా మార్గదర్శకాల్లో గత నిబంధనలను అనుసరించినప్పటికీ కొన్ని మార్పులు చేశారు. ఆ వివరాలివీ..
- ఉద్యోగి స్పౌజ్‌కు హృద్రోగాలు లేదా కిడ్నీ లేదా కేన్సర్ వంటి వ్యాధులుంటే వారిని ప్రిఫరెన్షియల్ కోటాలో చేర్చుతారు. గతంలో పిల్లలకు మాత్రమే ఇలాంటి వ్యాధులుంటే ఈ కోటా వర్తించేది. పిల్లల కేటగిరీలో డయాబెటిక్, గుండె సంబంధిత వ్యాధులు, బ్లడ్ కేన్సర్, మానసిక వైకల్యం కేటగిరీ వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- స్పౌజ్ కేటగిరీలో ఇచ్చే ప్రాధాన్య పాయింట్లు దుర్వినియోగం కాకుండా భార్యాభర్తల్లో ఒకరు ఉన్న చోటికి మరొకరిని పంపేలా వారు పని చేసే స్కూల్‌ను జీపీఎస్ ద్వారా లింకు చేసి, అక్కడికే మరొకరిని పంపిస్తారు. స్పౌజ్ పాయింట్లు భార్య, భర్త ఇరువురిలో ఒకరు మాత్రమే వినియోగించుకోవాలి.
- భార్య/భర్త ఇరువురిలో ఒకరు స్పౌజ్ పాయింట్లు వినియోగించుకున్నట్లయితే.. మరొకరు పనిచేసే చోటు నుంచి 50 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న స్థానాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ దూరం ఉన్న స్థానానికి ఆప్షన్ ఇచ్చుకుంటే జనరల్ పద్ధతిలో బదిలీ చేస్తారు.
- టీచర్‌కు ఎనిమిదేళ్లు, హెడ్ మాస్టర్‌కు 5 ఏళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ చేస్తారు.
- ఆన్‌లైన్‌లో ‘నాట్ విల్లింగ్’కు అవకాశం ఉండదు. పని చేస్తున్న ప్రదేశంలో రెండేళ్ల సర్వీసు ఉన్న వారు (బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత కలిగినవారు) తమకు కచ్చితంగా ట్రాన్స్‌ఫర్ కావాలనుకునే ఒకటీ రెండు స్కూళ్లకు (ప్లేస్‌లు) మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వాటిల్లో వస్తే అలాట్ అవుతుంది. లేదంటే పాత స్కూల్లోనే ఉంటారని అధికారులు వెల్లడించారు. ఒకట్రెండు రెండు కూడా వద్దనుకుంటే బదిలీకే దరఖాస్తు చేసుకోవద్దు.
- 5, 8 ఏళ్ల సర్వీసుతో తప్పనిసరి బదిలీ అయ్యే వారు, రెండేళ్ల సర్వీసుతో బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగిన వారు, మిగతా టీచర్లతో కూడిన జాబితాలను డీఈవోలు ప్రకటించారు.
టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు
Published Thu, Jun 7 2018 12:50 AM | Last Updated on Thu, Jun 7 2018 12:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment