ఇకపై పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
జోగిపేట : పాఠశాలల్లో విద్యార్థుల చదువు సామర్థ్యాలు.. మౌలిక వసతులపైనా దృష్టి సారించిన తెలంగాణ సర్కార్ ఇకపై వారంలో ఒక రోజు జిల్లాలోని ఏదో ఒక పాఠశాలలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల రెండు వారం నుంచే అధికారుల పర్యటనలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఏ పాఠశాలను తనిఖీ చేస్తామనే విషయం రాష్ట్ర ఉన్నత అధికారులకు తప్ప డీఇఓలకు సైతం తెలియనివ్వమని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
ఈ నిర్ణయంతో జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ పాఠశాలలో తనిఖీ ఉంటుందోనని ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, ఇన్‌చార్జ్ ఎంఈఓలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో పాఠశాలలు....
జిల్లాలో 2,900 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 3.40 లక్షల మంది విద్యార్థులున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 12,300 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జిల్లాలో జిల్లా పరిషత్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. మండల, పట్టణ కేంద్రాల కంటే ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని మారు మూల ప్రాంతాల్లోని పాఠశాలలకు టీచర్లు వారంలో రెండు రోజులకు మించి పాఠశాలలకు వెళ్లని వారు కూడా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించినట్లుగా చెబుతున్నారు.
ఉపాధ్యాయులు లేక ఆయా పాఠశాలల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన సంఘటనలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పుల్కల్ మండలంలోని ఒక పాఠశాలలో ప్రైవేట్‌గా ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసుకుని రెగ్యులర్ ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొడుతున్న సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. జిల్లాలో గల ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
జిల్లాలో సుమారుగా వంద వర కు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నట్లు సమాచారం. మారు మూల ప్రాంతాల పాఠశాలలకు అధికారులు వెళ్లకపోవడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు సక్రమంగా నడవడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక తనిఖీల నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నట్లు ప్రకటించాయి. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహించ డం సహించరాని నేరమేనన్నారు.