లక్ష్యం100%
మార్చి 25వ తేదీనుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సిలబస్ కూడా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో సవాలక్ష సమస్యలు ఎదుర్కొని విద్యార్థులు తుది సమరానికి సన్నద్ధమవుతున్నారు. అధికార యంత్రాంగం కూడా ఉత్తీర్ణత పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గత సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగు.. తెలంగాణ స్థాయిలో రెండోస్థానంలో జిల్లా నిలిచింది. ఈసారి జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేష్ ‘సాక్షి’కి వివరించారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం
పదవ తరగతి పరీక్షలు దగ్గరపడ్డాయి. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత, మారిన సిలబస్, పరీక్షా విధానంలో మార్పు తదితర సమస్యలు అధిగమించి ఈ విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మారిన సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిది ద్దేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
సాక్షి: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఈఓ: అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే దాదాపుగా సిలబస్ పూర్తయ్యింది. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు బోధించడంతో పాటు, అయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులకు అనుమానాలను నివృత్తి చేస్తున్నారు.
సాక్షి: పాఠ్యపుస్తకాలు, మారిన పరీక్షా విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారా..?
డీఈఓ: పాఠ్యపుస్తకాలు మారడం, సీసీఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం కొంత సవాలే. అయినా ఎలాంటి ఇబ్బందులే తలెత్తకుండా ఉపాధ్యాయులకు కొత్త విధానంపై శిక్షణ ఇచ్చాం.
సాక్షి: అంతర్గత మూల్యాంకనానికి ప్రతి సబ్జెక్టుకు 20మార్కులు ఇచ్చారు. విద్యార్థిని పరిశీలించి మార్కులు ఇవ్వాల్సి వస్తుంది, ఉపాధ్యాయులు లేని చోట ఏవిధంగా మార్కులు వేస్తున్నారు ?
డీఈఓ: అంతర్గత మూల్యాంకనంపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. సబ్జెక్టు ఉపాధ్యాయులు లేనిచోట గతంలోనే అడ్జస్టు చేశాం. ఇంకా అలాంటి సమస్య ఉంటే పరిష్కార మా ర్గాలను ప్రధానోపాధ్యాయులకు వివరించాం.
సాక్షి: కొత్త విధానంపై విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?
డీఈఓ: సీసీఈ విధానంపై విద్యార్థులకు భయం పోగొట్టేందుకు, కొత్త విధానానికి పూర్తిగా అలవాటు కావడానికి ఎఫ్1,2,3 పరీక్షలతో పాటు జనవరి 29 నుంచి ప్రతిరోజు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాం.
సాక్షి: కొత్త విధానంపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్గిందా ?
డీఈఓ: పరీక్షా విధానంపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్గింది. హన్వాడ, గద్వాల, తదితర ప్రాంతాలలో కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్షంగా పరిశీలించాను, అదేవిధంగా నిర్వహించిన పరీక్షల్లోనూ విద్యార్థులకు చాలా బాగా రాశారు.
సాక్షి: ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో సిలబస్ పూర్తి కాలేదు. అలాంటి చోట ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
డీఈఓ: సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలు ఇప్పటికే నా దృష్టికి వచ్చాయి. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి విద్యార్థులకు నష్టం కల్గకుండా చర్యలు తీసుకున్నాను.
సాక్షి: గతేడాది మాదిరిగా ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారా..?
డీఈఓ: వందేమాతరం ఫౌండేషన్ వారితో చర్చిస్తున్నాం. త్వరలో విద్యార్థులకు ప్రేరణ తరగతులు కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం.
సాక్షి: గతేడాది పది ఫలితాల్లో జిల్లా తెలంగాణలో రెండోస్థానం, ఆంధ్రప్రదేశ్‌లో 4వస్థానం వచ్చింది. ఈ ఏడాది ఏ స్థానంలో నిలుస్తారని భావిస్తున్నారు ?
డీఈఓ: పది ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లాను నిలిపే విధంగా కృషి చేస్తున్నాం. ఆ దిశగా ఉపాధ్యాయులు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
సాక్షి: డీప్యూటీ ఈఓ, హెచ్‌ఎం, ఉపాధ్యాయులుకిచ్చే సూచనలు ?
డీఈఓ: పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రధానంగా ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుడు, సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలి. డిప్యూటీఈఓ, ఎంఈఓలు ప్రతిరోజు పాఠశాలలను పర్యవేక్షించాలి.
సాక్షి: విద్యార్థుల కిచ్చే సూచనలు ?
డీఈఓ: విద్యార్థులు భయం వీడి ఆత్మస్థైర్యంతో చదువుకోవాలి. బిట్లవారీగా చదవకుండా మొత్తం పాఠ్యాంశం అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశం పూర్తిగా అవగాహన ఉంటే ఎలాం టి ప్రశ్నలు వచ్చినా సులభంగా రాయగల్గుతారు.