teri movie
-
డైహార్ట్ ఫ్యాన్‌కు క్షమాపణ చెప్పిన కీర్తీసురేష్
అభిమానులు లేనిదే ఏ స్టార్ లేరులే అన్నారో గీత రచయిత. ఇది మాత్రం నగ్న సత్యం. అందుకే నటీనటులు అభిమానులే తమ దేవుళ్లు అంటారు. ఇక అభిమానుల విషయానికొస్తే ఏ నటుడుగానీ, నటి గానీ వారికి నచ్చితే నెత్తినేసుకుని మోసేస్తారు. వారికి గుళ్లు, గోపురాలు కట్టి ఆరాధిస్తారు. సిరాతో కాకుండా రక్తంతో లేఖలు రాసే పిచ్చి అభిమానులు ఉంటారు. మరి కీర్తీసురేష్‌కు ఇలాంటి ఒక వీరాభిమానే ఉన్నాడు. బాలనటిగా నట జీవితాన్ని ప్రారంభించిన ఈమె, ఆ తరువాత కథానాయకిగా పరిచయం ఆపై తమిళం, తెలుగు, హిందీ అంటూ ప్రముఖ కథానాయకి స్థాయికి ఎదిగిన నటి కీర్తీసురేష్. అతి తక్కువ కాలంలోనే మహానటి చిత్రంలోని నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న అరుదైన నటి కీర్తీసురేష్. అదేవిధంగా కథానాయకి ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించి మెప్పించే స్థాయికి ఎదిగారు. కోలీవుడ్‌లో పలు చిత్రాలతో బిజీగా వున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో విజయ్, సమంత, ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన అట్లీ దర్శకత్వం వహించిన తెరి చిత్ర హిందీ రీమేక్‌లో కీర్తీసురేష్ నటిస్తున్నారు. తమిళంలో సమంత నటించిన పాత్రను హిందీలో పోషిస్తున్నారు. ఈమె కథానాయకిగా నటించిన సైరన్, రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి క్రేజీ నటి ఒక అభిమానికి క్షమాపణ చెప్పడం విశేషం. కృష్ణ అనే ఈమె వీరాభిమాని వరుసగా 233 లేఖలు రాసి ఆమెకు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అప్పటికి అతని లేఖలకు స్పందించని కీర్తీసురేష్ 234వ లేఖకు బదులిచ్చారు. ఆమె ట్విట్టర్ ద్వారా అతని లేఖలకు స్పందిస్తూ 234 తనకు ఫాంటసీ నంబర్ అని పేర్కొన్నారు. ఆలస్యంగా స్పందించినందుకు క్షమించు లాట్సాప్ లవ్ అని పేర్కొంది. ఆమె ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్అవుతోంది. -
సీనియర్ దర్శకుడు మహేంద్రన్‌కు అస్వస్థత
సాక్షి, చెన్నై: సీనియర్ దర్శకుడు మహేంద్రన్ అస్వస్థతకు గురయారు. ఆయన్ని వైద్య చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఉరుదిపూక్కల్, ముల్లుం మలరుం వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మహేంద్రన్. రజనీకాంత్, కమలహాసన్‌లతో పలు చిత్రాలను చేసిన మహేంద్రన్ ఈ మధ్య నటుడు విజయ్ నటించిన తెరి చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ప్రతినాయకుడిగా పాత్రను రక్తిగట్టించిన మహేంద్రన్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన నిమిర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. ఈ నెల 26న మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో మహేంద్రన్ అకస్మాత్తు ఆనారోగ్యానికి గురికావడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
కటౌట్లకు కూల్‌డ్రింకులతో అభిషేకం!
తమిళనాడులో సినిమా అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. గురువారం విజయ్ హీరోగా విడుదలైన 'తేరి' సినిమా విడుదల సందర్భంగా ఈ అభిమానం కొత్త పుంతలు తొక్కింది. ప్రతిసారీ హీరోల కటౌట్లకు పాలతో అభిషేకాలు చేసే అభిమానులు.. ఈసారి వెరైటీగా ఫాంటా, కోకా కోలా లాంటి కూల్‌డ్రింకులతో అభిషేకం చేశారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రదర్శించిన మొదటి ఆటకు టికెట్లను రూ. 700 వరకు బ్లాక్‌లో అమ్మారట. సినిమాకు వచ్చినవాళ్లందరికీ ఉచితంగా స్టీలు గ్లాసు, ఒక లడ్డూ, మంచ్ చాక్లెట్ ఇచ్చారు. ఈసారి తమిళనాడులో పాలాభిషేకాలు చేయొద్దని చెప్పడంతో.. ఫాంటా, కోకా కోలా లాంటి కూల్డ్రింకులతోనే అభిషేకాలు చేసేశారట. ఓ అభిమాని పొరపాటున పాలు అనుకుని పెరుగు ప్యాకెట్ తెచ్చాడు. అతడిని మాత్రం ఆ పెరుగుతో అభిషేకం చేయనివ్వలేదు. మరో వీరాభిమాని ఏకంగా కటౌట్మీద బీరు పోయాలని ప్రయత్నించినా, పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఇక థియేటర్ లోపల అయితే అభిమానులు తమ సీట్లలో కూర్చోవడం మానేసి, తెరముందు డాన్సులు వేస్తుండటంతో వాళ్లను కూర్చోబెట్టడం పోలీసులకు తలకు మించిన భారం అయ్యింది. ఇంటర్వెల్ సమయంలో కూడా సినిమా గురించి ట్వీట్లు, మెసేజిలు పంపుతూ బిజీబిజీగా కనిపించారు.