కటౌట్లకు కూల్‌డ్రింకులతో అభిషేకం!
తమిళనాడులో సినిమా అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. గురువారం విజయ్ హీరోగా విడుదలైన 'తేరి' సినిమా విడుదల సందర్భంగా ఈ అభిమానం కొత్త పుంతలు తొక్కింది. ప్రతిసారీ హీరోల కటౌట్లకు పాలతో అభిషేకాలు చేసే అభిమానులు.. ఈసారి వెరైటీగా ఫాంటా, కోకా కోలా లాంటి కూల్‌డ్రింకులతో అభిషేకం చేశారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రదర్శించిన మొదటి ఆటకు టికెట్లను రూ. 700 వరకు బ్లాక్‌లో అమ్మారట. సినిమాకు వచ్చినవాళ్లందరికీ ఉచితంగా స్టీలు గ్లాసు, ఒక లడ్డూ, మంచ్ చాక్లెట్ ఇచ్చారు.
ఈసారి తమిళనాడులో పాలాభిషేకాలు చేయొద్దని చెప్పడంతో.. ఫాంటా, కోకా కోలా లాంటి కూల్‌డ్రింకులతోనే అభిషేకాలు చేసేశారట. ఓ అభిమాని పొరపాటున పాలు అనుకుని పెరుగు ప్యాకెట్ తెచ్చాడు. అతడిని మాత్రం ఆ పెరుగుతో అభిషేకం చేయనివ్వలేదు. మరో వీరాభిమాని ఏకంగా కటౌట్‌మీద బీరు పోయాలని ప్రయత్నించినా, పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
ఇక థియేటర్ లోపల అయితే అభిమానులు తమ సీట్లలో కూర్చోవడం మానేసి, తెరముందు డాన్సులు వేస్తుండటంతో వాళ్లను కూర్చోబెట్టడం పోలీసులకు తలకు మించిన భారం అయ్యింది. ఇంటర్వెల్ సమయంలో కూడా సినిమా గురించి ట్వీట్లు, మెసేజిలు పంపుతూ బిజీబిజీగా కనిపించారు.