‘మదర్’కు పునీత పట్టం ఆనందదాయకం
విజయవాడ (మొగల్రాజపురం) :
మదర్ థెరిస్సాకు పునీత పట్టం (సెయింట్ హుడ్) అందజేయడం చాలా సంతోషించదగిన విషయమని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం ఉదయం సిద్ధార్థ కళాశాల సమీపంలోని మదర్ థెరిస్సా విగ్రహానికి ఆయన పూలమాలవేసి అంజలిఘటించారు. మదర్‌థెరిస్సాకు వాటికన్ సిటీలో లక్షలాది మంది మధ్య పోప్ ఫ్రాన్సస్ సెయింట్ హుడ్ (పునీత పట్టం) అందజేస్తున్న సందర్భంగా నగరంలోని సీఆర్ఐ, విజయవాడ కేథటిక్ డయోసిస్, మిషనరీ ఆఫ్ చారిటీ సిస్టర్స్ సంయుక్త ఆధ్వర్యంలో పటమట సైంట్ పాల్స్ కథెడ్రల్ చర్చి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు మీదుగా సిద్ధార్థ కళాశాల సమీపంలో ఉన్న మదర్‌థెరిస్సా విగ్రహం వరకు సాగింది. అక్కడ జరిగిన కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు రోగులు, దీనులు, అనాథలను అక్కున చేర్చుకొన్న మహిమాన్వితురాలు మదర్ థెరిస్సా అని కొనియాడారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా అందరితో అమ్మ అని అప్యాయంగా పిలిపించుకున్న మహోన్నత వ్యక్తి మదర్థెరిస్సాని పేర్కొన్నారు. లయోలా కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ ఫాదర్ రవిశేఖర్ మాట్లాడుతూ 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెనలో మృతి చెందిన వారి శరీరాలకు మదర్‌థెరిస్సా స్వయంగా దహన సంస్కారాలను నిర్వహించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు.
కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్, మూడో డివిజన్ కార్పొరేటర్ బొప్పన భవకుమార్, ఆంధ్రా లయోలా కళాశాల డైరెక్టర్ రెక్స్ ఎంజిలో, గుణదల మాత పుణ్యక్షేత్రం ఫాదర్స్ మువ్వల ప్రసాద్, జోబిబాబు, మరియదాస్, సిస్టర్ రోజా, డయోసిస్ గురువులు, సిస్టర్స్, మదర్‌థెరిస్సా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జయహో.. మదర్ థెరిస్సా
జయహో మదర్‌థెరిస్సా అనే నినాదంతో సిద్ధార్థ కళాశాల సమీపంలోని మదర్‌థెరిస్సా విగ్రహం పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. వాటికన్ సిటీలో విశ్వమాత మదర్‌థెరిస్సాకు పునీత పట్టం అందజేస్తున్న సందర్భంగా నగరంలో ‘అమ్మ’ అభిమానులు ఆమె ఫొటోలు చేతపట్టుకుని లబ్బీపేట, పెజ్జోనిపేట, పటమట ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీ ద్వారా కొందరు, పాదయాత్రగా ఇంకొందరు సిద్ధార్థ కళాశాల సమీపంలో ఉన్న మదర్‌థెరిస్సా విగ్రహం వద్దకు చేరుకున్నారు. అమ్మపై అభిమానాన్ని చాటుకున్నారు. తెల్ల జెండాలతో అధిక సంఖ్యలో సిస్టర్స్ పాదయాత్రలో పాల్గొన్నారు.