Terror training
-
పాక్‌లో 22 ఉగ్ర శిబిరాలు
వాషింగ్టన్/ ఇస్లామాబాద్/జాబా: పాకిస్తాన్లో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయని, వాటిలో తొమ్మిది శిబిరాలు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవేనని సీనియర్ భారతీయ అధికారి ఒకరు చెప్పారు. ఈ శిబిరాలపై పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాషింగ్టన్లో ఉంటున్న ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. సరిహద్దు ఆవల నుంచి భారత దేశంలో మళ్లీ ఏమైనా ఉగ్రవాద సంబంధిత దాడులు జరిగితే ప్రభుత్వం బాలాకోట్ తరహా దాడులు చేస్తుందని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రం పాకిస్తాన్. తీవ్రవాదులపై, తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి అన్నారు. తన గడ్డపై 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడుస్తున్నా వాటిపై ఏ చర్యా తీసుకోని పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో తీవ్రవాదులు లేరని బుకాయిస్తోందని, రెండు దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చట్టాలకు అనుగుణంగానే.. బాలాకోట్‌పై భారత్ దాడి ఉగ్రవాద వ్యతిరేక చర్య అని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌లో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా పాక్ ఇలాగే చేస్తుందని, ఇందులో విశేషమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను గృహ నిర్బంధంలో ఉంచడమంటే వారికి విలాసాలు సమకూర్చడమేనని, పరిస్థితి సద్దుమణగగానే వారిని విడిచిపెడుతుందన్నారు. భారత్‌పై ఉగ్ర దాడికి పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని బాలాకోట్ దాడి ద్వారా భారత్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో ట్రంప్ సర్కారు భారత్‌కు మద్దతిస్తోందన్నారు. పాక్ అభివృద్ధికి ఐఎంఎఫ్ 21 సార్లు ఆర్థిక సాయం చేస్తే ఆ దేశం ఇతర అవసరాలకు మళ్లించిందని పేర్కొన్నారు. చెట్లు కూల్చారని కేసు భారత వైమానిక దళానికి చెందిన గుర్తుతెలియని పైలట్లపై పాక్ కేసు వేసింది. బాలాకోట్‌లోని 19 చెట్లపై బాంబులు వేసి కూల్చివేసినందుకు శుక్రవారం ఈ కేసు వేసింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ అటవీ శాఖ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిసింది. కాగా, బాలాకోట్‌లోని ఐఏఎఫ్ దాడి జరిపిన మదరసా, ఇతర భవనాల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పాకిస్తాన్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు రాయిటర్స్‌కు చెందిన ప్రతినిధులు మూడుసార్లు ప్రయత్నించినా పాక్ బలగాలు అడ్డుకున్నాయి. అప్పటి నుంచి కూడా ఆ మదరసా ఉన్న ప్రాంతానికి వెళ్లే దారులను మూసివేశారు. -
హైదరాబాద్‌పై ఆల్ కాయిదా నీడలు
అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రశిక్షణకు సిద్ధమైన ఇద్దరు యువకులు సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నగరానికి చెందిన మౌతసిమ్ బిల్హా సూత్ర ధారి సాక్షి, హైదరాబాద్: ఆల్కాయిదా ఉగ్రవాదం హైదరాబాద్‌లో చాపకింద నీరులా ప్రవహిస్తుంది. నగరానికి చెందిన వ్యక్తులే ఉగ్రవాద శిక్షణ కోసం కొంతమంది యువకులను ఇతర దేశాలకు పంపిస్తున్నారు.‘ఉగ్ర’శిక్షణకు అఫ్ఘనిస్థాన్ వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువకులను బుధవారం సికింద్రాబాద్‌లో పోలీసులు అదపులోకి తీసుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉత్తర మండల డీసీపీ జయలక్ష్మీ మీడియాకు వివరించారు. నగరానికి చెందిన మౌతసిమ్ బిల్హా ఇస్లామిక్ రాజ్యం స్థాపించేందుకు జిహాద్ చేయాలంటూ చురుకైన యువకులను అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ కోసం పంపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇతడికి మహారాష్ట్ర ఒమర్‌ఖేడ్ జిల్లా షాకాలనీకి చెందిన షా ముదసిర్ అలియాస్ తల్హా (25), హంగోలి జిల్లా అఖడబాలాపూర్‌కు చెందిన షోయబ్ అహ్మద్‌ఖాన్ (24)లు పరిచయం అయ్యారు. షా ముదిసర్ మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో బి.ఎ. చదివాడు. సిమీ(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా) అనుబంధ షాహిన్ ఫోర్స్‌లో ఇతడు కీలక సభ్యుడు. 2001లో సిమీపై నిషేధం విధించడంతో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మైనారిటీ స్టూడెంట్ (ఏఐఎంఎస్)లో సభ్యుడిగా చేరాడు. ఆ తరువాత సోదరుడి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేశాడు. ఫేస్బుక్ వేదికగా వీరిద్దరిని అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రశిక్షణకు వెళ్లేందుకు మౌతసిమ్ బిల్హా ఒప్పించాడు. ఈ మేరకు ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి తనను కలవాలని వారిని కోరాడు. దీంతో వారిద్దరు గత నెల 3న బిల్హా ఇంటికి వద్దకు వచ్చి కలిశారు. ఈ సందర్భంగా ముగ్గురు రెండు గంటల పాటు తమ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్చించుకున్నారు.అప్పటికే ఫేస్బుక్లో బాంబులు ఎలా తయారు చేయాలో కూడా బిల్హా వీరికి సూచనలు ఇచ్చాడు. అఫ్ఘనిస్థాన్ వెళ్లేందుకు సిద్ధమైతే అక్టోబర్ 10న మళ్లీ తన వద్దకు రావాలని వారికి సూచించాడు. దీంతో షా ముదసిర్, షోయబ్‌లు మహారాష్ట్ర నుంచి తిరిగి బుధవారం రైలులో సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని గోపాలపురం పోలీసులు అదపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఆల్కాయిదా ఉగ్రవాద శిక్షణ విషయం వెలుగు చూసింది. బిల్హా కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన షా ముదిసర్, షోయబ్‌ల నుంచి సెల్ఫోన్లు, పాస్‌పోర్టు, ఏటీఎం, జిహాద్ సాహిత్యం, మిలిటెంట్ శిక్షణ కార్యక్రమానికి చెం దిన పత్రాలు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై దేశద్రోహం, పేలుళ్లకు కుట్ర తదితర కేసులను నమోదు చేశారు.