Texas Open tournament
-
‘టెక్సాస్’ రన్నరప్ దీపిక
హోస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్టు టీనేజ్ సంచలనం, 18 ఏళ్ల నూర్ ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక 7-11, 11-5, 7-11, 8-11 తేడాతో ఓటమిపాలైంది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ, టాప్ సీడ్ లో వీ వర్న్తో సహా ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణుల్ని ఇంటిబాట పట్టించిన షెర్బిని.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. దీపిక పోరాడినా షెర్బిని దూకుడు ముందు నిలవలేకపోయింది. అయితే 12వ ర్యాంకర్ దీపిక టైటిల్ సాధించలేకపోయినా.. ఫైనల్‌కు చేరడం ద్వారా భారీగా పాయింట్లు సాధించి తిరిగి టాప్-10లో స్థానం సంపాదించుకునే అవకాశాలను సుగమం చేసుకుంది. -
‘టెక్సాస్’ ఫైనల్లో దీపిక
హౌస్టన్ (అమెరికా): భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ దీపిక 11-7, 11-13, 13-11, 10-12, 11-4 తేడాతో 8వ ర్యాంకర్ మెడలిన్ పెర్రీ (ఐర్లాండ్)పై సంచలన విజయం సాధించింది. దీంతో 22 ఏళ్ల దీపిక తన కెరీర్లోనే అతిపెద్ద టోర్నీ (రూ.30 లక్షల ప్రైజ్‌మనీ)లో టైటిల్ పోరుకు చేరుకుంది. అంతేగాక పెర్రీతో ముఖాముఖి రికార్డునూ 2-2తో సమం చేసింది. ఇక ఫైనల్లో నయా సంచలనం నౌర్ ఎల్ షెర్బిని (ఈజిప్టు)తో దీపిక తలపడనుంది. క్వాలిఫయర్‌గా టోర్నీ బరిలోకి దిగి సంచలన విజయాలు సాధించిన షెర్బిని సెమీప్లో ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. -
సెమీస్‌లో దీపిక
టెక్సాస్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ హౌస్టన్ (అమెరికా): భారత నెంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం నికోలెట్ ఫెర్నాండెజ్ (గయానా)తో హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 11-4, 11-6, 10-12, 10-12, 11-5 తేడాతో గెలుపొందింది. ప్రపంచ 12వ ర్యాంకర్ దీపిక ఇక సెమీస్‌లో ఎనిమిదో ర్యాంకర్ మెడలిన్ పెర్రీ (ఐర్లాండ్)తో తలపడనుంది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మెడలిన్ పెర్రీ 11-7, 9-11, 11-6, 11-8 తేడాతో ఎమ్మా బెడ్డోస్ (ఇంగ్లండ్)పై గెలుపొందగా, ఈజిప్టు అన్‌సీడెడ్ క్రీడాకారిణి నౌర్ ఎల్ షెర్బిని చేతిలో టాప్‌సీడ్ లో వీ వర్న్ (మలేసియా) 3-11, 8-11, 12-10, 6-11 తేడాతో కంగుతింది.