21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సంజూ శాంసన్
టీమిండియా క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు సంబంధించి 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 7 ఏళ్ల వయసు నుంచి తన ఆరాధ్య కథానాయకుడు రజనీకాంత్‌ను కలవాలనుకున్న సంజూ కల ఎట్టకేలకు మార్చి 12, 2023న నెరవేరింది. సూపర్‌స్టార్, తలైవా రజనీకాంత్‌ను అతని స్వగృహంలోనే కలుస్తానని సంజూ చిన్నతనంలో తల్లిదండ్రులతో శపథం చేశాడట.
At the age of 7 already being a Super Rajni fan,,I told my parents ..See one day I will go and meet Rajni sir in his house…
After 21 years,that day has come when The Thalaivar invited me..☺️🙏🏽 pic.twitter.com/FzuWWqJkif
— Sanju Samson (@IamSanjuSamson) March 12, 2023
21 ఏళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు సంజూ శపథం నెరవేరింది. నిన్న సంజూ శాంసన్‌ను రజనీకాంత్ తన స్వగృహానికి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా రజనీకాంత్ సంజూ మెడలో శాలువ వేసి సత్కరించాడు. ఈ విషయాన్ని సంజూ ట్విటర్ వేదికగా షేర్ చేసి, తన అవధుల్లేని ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
కాగా, కేరళకు చెందిన 28 ఏళ్ల సంజూ శాంసన్‌కు చిన్నతనం నుంచి రజనీకాంత్ అంటే పిచ్చ అభిమానం ఉండేది. గతంలో చాలా సందర్భాల్లో సంజూ స్వయంగా ఈ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో పుస్తక పఠనం, మెడిటేషన్‌తో పాటు తనకెంతో ఇష్టమైన రజనీకాంత్ సినిమాలు, మళయాలం సినిమాలతో కాలం వెల్లబుచ్చానని సంజూ ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ ఇటీవలికాలంలో టీమిండియాలోకి తరుచూ వస్తూ పోతున్న విషయం తెలిసిందే. రకరకాల కారణాల చేత సంజూకు టీమిండియాలో పర్మనెంట్ పొజిషన్ దక్కడం లేదు. అయితే సంజూ ఐపీఎల్లో మాత్రం అదరగొడుతున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంజూ.. గత సీజన్లో అ జట్టును రన్నరప్‌గా నిలబెట్టాడు. అంతర్జాతీయ స్టార్లతో నిండిన రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ను సంజూ విజయవంతంగా నడిపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.