రజనీకాంత్ పోస్టర్
అభిమానులు తమ అభిమాన కథానాయకుడిపై చూపించే మితిమీరిన మమకారం ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తుంది. ఇటీవల రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు కనబర్చిన మమకారం ఆ పనే చేసింది. ఆ రోజు రజనీ పేరు మీద తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానాలు, పూజలు, సేవా కార్యక్రమాలు చేశారు. చెన్నయ్‌లో అయితే మరింత సందడిగా జరిగాయి. రజనీ నిలువెత్తు కటౌట్లు పెట్టి, క్షీరాభిషేకాలు కూడా చేశారు. అంతా బాగానే ఉంది. కానీ, ఒకే ఒక్క పోస్టర్ మాత్రం వివాదానికి దారి తీసింది. రజనీకాంత్ ఓటు వేయడానికి క్యూలో నిలబడిన పోస్టర్ అది.
అందులో వివాదం ఏముంది? అనుకోవచ్చు. కానీ, రజనీ వెనకాల వినాయకుడు, విష్ణుమూర్తి నిలబడినట్లుగా ముద్రించారు. దాంతో పాటు ‘తలైవా (నాయకుడా)! నువ్వు కనుక రాజకీయాల్లోకి వస్తే దేవుళ్లు కూడా ఓటేస్తారు’ అని రాశారు. ఇది విశ్వ హిందూ పరిషత్‌వారికి ఆగ్రహాన్ని కలిగించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని వారు మండిపడుతున్నారు. ఇలా చేయడం తగదంటూ ఫిర్యాదు చేశారట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారట. ఇదిలా ఉంటే... రజనీకి ఈ పోస్టర్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా, అభిమానుల అత్యుత్సాహం ఇంత పని చేసింది.