'లింగ' వివాదానికి ఇంతటితో తెర దించండి
హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రంలో ఒక సన్నివేశం, అందులోని సంభాషణలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన విమర్శలపై దర్శక, నిర్మాతలు, రచయిత స్పందించి నివారణ చర్యలు చేపట్టారు. ఆ సన్నివేశాలను, సంభాషణలనూ చిత్రం నుంచి తొలగించారు. నిర్మాత 'రాక్‌లైన్' వెంకటేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా అన్నివర్గాల ప్రేక్షకులు సినిమాకు ముఖ్యులేనని, సినిమా ద్వారా సమాజంలోని ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదనీ, అయితే పొరపాటున ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే అందుకు మన్నించాలని 'లింగ' చిత్రానికి తెలుగులో సంభాషణలు అందించిన రచయిత శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన చేశారు. పెద్ద మనసుతో 'లింగ' చిత్రంపై వివాదానికి ఇంతటితో తెర దించాల్సిందిగా అన్ని వర్గాలనూ శశాంక్ ఈ సందర్భంగా అభ్యర్తించారు.