తలనొప్పి వస్తోందంటే.. వేడినూనె పోశాడు
తమిళనాడులోని మదురైలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తున్న బాలకార్మికుడిపై యజమాని క్రూరంగా ప్రవర్తించాడు. ఆరోగ్యం బాగోలేదన్న బాలుడిని ఆదుకోవాల్సిందిపోయి.. సలసల మరిగే వేడినూనె కుమ్మరించాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మదురైలోని ఒక స్వీటుషాపులో బాలుడు (15) పనిచేస్తున్నాడు. తనకు తలనొప్పిగా ఉందని యజమానికి చెప్పాడు. పని చేయడానికి సాకులు చెపుతున్నాడంటూ యజమాని ఆగ్రహానికి గురయ్యాడు. వేడి వేడి నూనెను బాలుడిపై పోసేశాడు. దీంతో చేతులు, తొడలు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
మైనర్ బాలుడిని పనిలో పెట్టుకోవడమేకాకుండా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన సదరు యజమానిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై హక్కుల సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులను అదుపులోకి తీసుకుని బాధిత బాలుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.