thundurru
-
మెగా ఆక్వాఫుడ్ 'కేంద్ర' పరిధిలోనిది కాదు
-
రాహుల్ దృష్టికి ఫుడ్‌పార్క్ పంచాయితీ
భీమవరం : ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జనావాసాల మధ్య భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్ వ్యవహారాన్ని పార్లమెంట్లో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారని పోరాట కమిటీ నాయకులు తెలిపారు. బుధవారం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ అమర్జహాబేగ్ నేతృత్వంలో ఫుడ్‌పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు జవ్వాది సత్యనారాయణ, సముద్రాల వేంకటేశ్వరరావు(అబ్బులు), కొయ్యే మహేష్ బృందం రాహుల్‌ను కలసి ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఏర్పడే ఇబ్బందులను వివరించారు. దీనిలో భాగంగా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి యుపీఏ ప్రభుత్వ హయాంలోనే అనుమతులిచ్చారని ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం నిలిపివేయకుంటే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వరి పంట, మత్స్యసంపద దెబ్బతిని ఉపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 40 గ్రామాలకు చెందిన రెండు లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడతామని వివరించారు. మూడేళ్లుగా పోరాటం చేస్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఫ్యాక్టరీ యాజమాన్యానికి అండగా నిలుస్తూ పేదలను జైళ్లలో పెడుతున్నారని రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన రాహుల్‌గాంధీ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల్లో ఫుడ్‌పార్క్‌ల ఏర్పాటుకు రూ.2 వేల కోట్లు మంజూరు చేసిన విషయం వాస్తవమేనన్నారు. అయితే పారిశ్రామికాభివృద్ధి పేరుతో జనావాసాల మధ్య పరిశ్రమలు నిర్మించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. తుందుర్రు ఫుడ్‌పార్క్ సమస్యపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దీనికి ముందు పోరాట కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్విజయ్షింగ్, టి.సుబ్బిరావిురెడ్డి, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కేవీపీ రామచంద్రరావు తదితరులను కలసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లారు. -
ఆక్వాపార్క్‌ను తరలించాల్సిందే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను ఎట్టిపరిస్థితుల్లో తుందుర్రు నుంచి తరలించాల్సిందేనని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి, ఆక్వా పార్క్ యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చారు. బుధవారం సాయంత్రం తుందుర్రులో ఆక్వా పార్క్ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ‘ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3 వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేస్తే ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది. కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ పరిశ్రమ ఆరెంజ్ కేటగిరీలో ఉంది. అంటే.. కాలుష్యం వెదజల్లే కేటగిరీలో ఉంది. ఇది కాలుష్య కారకమని చంద్రబాబుకు తెలియదా. కాలుష్యం ఉందని తెలుసు కాబట్టే పైపులైన్ వేస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇదే ఫ్యాక్టరీని ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరానికి మారిస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ మనుషులు ఉండరు కాబట్టి సమస్య ఉండదు. సముద్ర తీరంలో ఇదే ఫ్యాక్టరీ యజమానులకు 350 ఎకరాల భూములన్నాయి. అక్కడకు తరలిస్తే సముద్ర తీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల పైప్‌లైన్ వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ‘ఫ్యాక్టరీ వల్ల కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే విపరీతమైన దుర్గం ధం వస్తుంది. కాలువలు కలుషితమై వ్యవసా యం దెబ్బతింటుంది. పొలాలపై ఆధారపడిన కూలీలు బతికే పరిస్థితి ఉండదు’ అన్నారు. ‘పరి శ్రమలు రాకూడదని ఎవరూ అనుకోరు. కానీ.. ఇక్కడ కడితే వీళ్ల పొట్టమీద కొట్టినట్టు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒక్కటే. ఫ్యాక్టరీ పెట్టిన తరువాత ఏ ఇబ్బంది ఉండకూడదనే విషయాన్ని చూసుకోవాలి. ఫ్యాక్టరీని సముద్ర తీరానికి తరలిస్తే యాజమాన్యానికి పూర్తి మద్దతు ఇస్తాం. మహా అయితే పునాది పనులకు పెట్టిన రూ.ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి పట్టుదలను పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కాదంటే.. బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే ఫ్యాక్టరీ స్థలం మొత్తాన్ని పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్ధవాతావరణం సృష్టించారని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్ విధించి.. ఉద్యమకారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రజల అభీష్టం మేరకు ఆక్వా పార్క్‌ను తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. కాదు.. కూడదు అని చంద్రబాబు మాటను నమ్ముకుంటే ఆయనతోపాటు యాజమాన్యం కూడా బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందేనని హెచ్చరించారు. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించకుంటే ప్రజల కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తామని జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అండగా నిలుస్తాం తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. తుందుర్రు గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే మీకు వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం అక్కడి నుంచి బేతపూడి బయలుదేరి వెళ్లారు. బేతపూడిలో ఆక్వాపార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడారు. అసలు ఫ్యాక్టరీని ఎందుకు వద్దంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా, చేపల చెరువుల కోసం అంటూ.. దొంగ లెక్కలు చెబుతూ ఆక్వా పార్క్ నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. తుందుర్రు ఎంపీటీసీ భర్త జవ్వాది సత్యనారామణ మాట్లాడుతూ తమను గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేశారని, టీడీపీ తరఫున గెలిచినా తాము ప్రజల పక్షాన ఉద్యమిస్తున్నామని స్పష్టం చేశారు. కె.బేతపూడికి చెందిన సత్యవాణి మాట్లాడుతూ చేపలు, రొయ్యల శుద్ధి కోసం వరి పండే పొలాలను నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. వరి ఇక్కడ పండకపోతే సింగపూర్ నుంచి తీసుకువస్తారా చంద్రబాబుగారూ అని నిలదీశారు. కన్నతల్లిని చంపి, పెంపుడు తల్లిని తీసుకువస్తామంటే తాము సహించేది లేదని అక్కడి వారంతా స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఇంకా ఉండేది రెండేళ్లే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తుందుర్రు ప్రజలు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అండగా నిలబడుతుందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, భీమవరం, నరసాపురం సమన్వయకర్తలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు ఇక్కడి ప్రజలకు పూర్తిగా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. సత్యవతికి పరామర్శ వైఎస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తణుకు సబ్‌జైలుకు చేరుకున్నారు. 38 రోజులుగా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆరేటి సత్యవతిని పరామర్శించారు. తుందుర్రు ఉద్యమం, అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను సత్యవతి నుంచి తెలుసుకున్నారు. తన భర్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, అయినా పోలీసులు తనను తణుకులోను, తన కుమారుడిని నరసాపురం సబ్‌జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపో యారు. తనకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. అనంతరం బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పోలీసు రాజ్యం నడుపుతున్న చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరి గారు. అనంతరం అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా సాయంత్రం 5.30 గంటల సమయంలో తుందుర్రు చేరుకున్నారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకూ వైఎస్ జగన్ రాక కోసం వేలాది ప్రజలు ఎదురుచూశారు. తుందుర్రు గ్రామ సరిహద్దు నుంచి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కె.బేతపూడి వరకూ జనసంద్రం కదలివచ్చిందా అన్నట్టుగా తీసుకువెళ్లారు. తుందుర్రు ఎస్సీ పేటలో వైఎస్ రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. -
తుందుర్రు కన్నెర్ర
ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ.. పాశవిక చర్యలతో జన సంక్షేమాన్ని బలిపీఠం ఎక్కించిన సర్కారు తీరుపై తుందుర్రు ప్రజలు కన్నెర్రచేశారు. రెండున్నరేళ్లుగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తున్న వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తమకు బాసటగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. కాలుష్య కోరలు చాచిన విష రక్కసి ఫుడ్‌పార్క్ అని, దీనిని సాగర తీరానికి తరలించాలని, లేకుంటే సర్కారునే బంగాళాఖాతంలో కలిపేస్తామని వై.ఎస్.జగన్ అల్టిమేటం ఇచ్చారు. తమ పక్షాన నిలిచిన జననేతకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నన్నెందుకు అరెస్ట్ చేశారో తెలీదు తణుకు : ‘మా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నా పెద్ద కొడుకుగా మీకు తెలియజేయాలనుకున్నా. ఈ పరిస్థితుల్లో నా దగ్గరకు మీరే వస్తారని అనుకోలేదు. నన్ను ఎందుకు అరెస్టు చేశారో తెలీదు. కాలుష్యకారకంగా మారుతుందని గోదావరి మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామనే నెపంతో నన్ను, నా కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. నా కొడుకును నరసాపురం సబ్‌జైలులో ఉంచితే.. నన్ను తణుకు సబ్‌జైలులో పెట్టారు. 36 రోజులుగా జైలులోనే ఉన్నా. నాభర్తకు క్యాన్సర్. ఇంటి వద్ద ఆయనకు కనీసం అన్నం పెట్టే దిక్కులేదు.’ అంటూ తుందుర్రు ఆక్వాఫుడ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్రమంగా అరెస్టయి తణుకు సబ్‌జైలులో ఉన్న ఆరేటి సత్యవతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం తణుకు సబ్‌జైలులో సత్యవతిని జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. ఆమె తన గోడును జననేత వద్ద వెళ్లబోసుకున్నారు. తమ గ్రామంలో ఎవ్వరినీ రోడ్లపై తిరగనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, 144 సెక్షన్ విధించారని సత్యవతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు పండక ఇబ్బందులు పడుతున్నామని, ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల కాలుష్యం ఎక్కువవుతుందని పేర్కొన్నారు. తాము రెండున్నరేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. సర్కారు పట్టించుకోవడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తక్షణమే ఫుడ్‌పార్క్‌ను ఇక్కడి నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆమె జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో చలించిన జగన్మోహన్రెడ్డి తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. పార్క్ బాధిత గ్రామాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణమే ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరానికి తరలించేలా ప్రభుత్వంపైనా, యాజమాన్యంపైనా ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి వెంట ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ మంత్రి కె.పార్థసారథి, కేంద్ర పాలక మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, సీఈసీ సభ్యులు చీర్ల రాధయ్య, చిర్ల జగ్గిరెడ్డి తదితరులు ఉన్నారు. నా తల్లిని అన్యాయంగా జైల్లో పెట్టారు జగన్‌ను కలిసిన సత్యవతి కుమార్తె కళ్యాణి తణుకు : కాలుష్యం వెదజల్లే కర్మాగారాన్ని వ్యతిరేకించినందుకే తన తల్లి ఆరేటి సత్యవతిపై హత్యాయత్నం కేసు మోపి జైల్లో పెట్టించారని ఆమె కుమార్తె ఆరేటి కళ్యాణి ఆరోపించారు. సత్యవతిని పరామర్శించేందుకు బుధవారం తణుకు సబ్‌జైలుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు ఆమె ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్‌తోపాటు సబ్‌జైలులో ఉన్న తన తల్లిని పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం కళ్యాణి విలేకరులతో మాట్లాడుతూ ఒక పక్క నాన్నకు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, తన సోదరులు, తల్లిని జైల్లో నిర్భంధించి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. 36 రోజులుగా వారు జైల్లోనే మగ్గుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కూడా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురించాయని ఆమె పేర్కొన్నారు.