ఆక్వాపార్క్‌ను తరలించాల్సిందే | must shift aqua park | Sakshi
Sakshi News home page

ఆక్వాపార్క్‌ను తరలించాల్సిందే

Published Thu, Oct 20 2016 2:08 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఆక్వాపార్క్‌ను తరలించాల్సిందే - Sakshi

ఆక్వాపార్క్‌ను తరలించాల్సిందే

సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను ఎట్టిపరిస్థితుల్లో తుందుర్రు నుంచి తరలించాల్సిందేనని వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి, ఆక్వా పార్క్‌ యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చారు. బుధవారం సాయంత్రం తుందుర్రులో ఆక్వా పార్క్‌ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ‘ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3 వేల టన్నుల రొయ్యలు, 
చేపలను శుద్ధి చేస్తే ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది. కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం ఈ పరిశ్రమ ఆరెంజ్‌ కేటగిరీలో ఉంది. అంటే.. కాలుష్యం వెదజల్లే కేటగిరీలో ఉంది. ఇది కాలుష్య కారకమని చంద్రబాబుకు తెలియదా. కాలుష్యం ఉందని తెలుసు కాబట్టే పైపులైన్‌ వేస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇదే ఫ్యాక్టరీని ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరానికి మారిస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ మనుషులు ఉండరు కాబట్టి సమస్య ఉండదు. సముద్ర తీరంలో ఇదే ఫ్యాక్టరీ యజమానులకు 350 ఎకరాల భూములన్నాయి. అక్కడకు తరలిస్తే సముద్ర తీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల పైప్‌లైన్‌ వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ‘ఫ్యాక్టరీ వల్ల కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే విపరీతమైన దుర్గం ధం వస్తుంది. కాలువలు కలుషితమై వ్యవసా యం దెబ్బతింటుంది. పొలాలపై ఆధారపడిన కూలీలు బతికే పరిస్థితి ఉండదు’ అన్నారు. ‘పరి శ్రమలు రాకూడదని ఎవరూ అనుకోరు. కానీ.. ఇక్కడ కడితే వీళ్ల పొట్టమీద కొట్టినట్టు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా నా సిన్సియర్‌ రిక్వెస్ట్‌ ఒక్కటే. ఫ్యాక్టరీ పెట్టిన తరువాత ఏ ఇబ్బంది ఉండకూడదనే విషయాన్ని చూసుకోవాలి. ఫ్యాక్టరీని సముద్ర తీరానికి తరలిస్తే యాజమాన్యానికి పూర్తి మద్దతు ఇస్తాం. మహా అయితే పునాది పనులకు పెట్టిన రూ.ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి పట్టుదలను పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
కాదంటే.. బంగాళాఖాతంలో 
కలిసిపోవాల్సిందే
ఫ్యాక్టరీ స్థలం మొత్తాన్ని పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్ధవాతావరణం సృష్టించారని వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించి.. ఉద్యమకారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రజల అభీష్టం మేరకు ఆక్వా పార్క్‌ను తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌ చేశారు. కాదు.. కూడదు అని చంద్రబాబు మాటను నమ్ముకుంటే ఆయనతోపాటు యాజమాన్యం కూడా బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందేనని హెచ్చరించారు. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించకుంటే ప్రజల కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తామని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
అండగా నిలుస్తాం
తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. తుందుర్రు గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే మీకు వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం అక్కడి నుంచి బేతపూడి బయలుదేరి వెళ్లారు. బేతపూడిలో ఆక్వాపార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడారు. అసలు ఫ్యాక్టరీని ఎందుకు వద్దంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా, చేపల చెరువుల కోసం అంటూ.. దొంగ లెక్కలు చెబుతూ ఆక్వా పార్క్‌ నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. తుందుర్రు ఎంపీటీసీ భర్త జవ్వాది సత్యనారామణ మాట్లాడుతూ తమను గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేశారని, టీడీపీ తరఫున గెలిచినా తాము ప్రజల పక్షాన ఉద్యమిస్తున్నామని స్పష్టం చేశారు. కె.బేతపూడికి చెందిన సత్యవాణి మాట్లాడుతూ చేపలు, రొయ్యల శుద్ధి కోసం వరి పండే పొలాలను నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. వరి ఇక్కడ పండకపోతే సింగపూర్‌ నుంచి తీసుకువస్తారా చంద్రబాబుగారూ అని నిలదీశారు. కన్నతల్లిని చంపి, పెంపుడు తల్లిని తీసుకువస్తామంటే తాము సహించేది లేదని అక్కడి వారంతా స్పష్టం చేశారు.  దీనిపై స్పందించిన జగన్‌మోహనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఇంకా ఉండేది రెండేళ్లే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తుందుర్రు ప్రజలు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్‌ సీపీ అండగా నిలబడుతుందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, భీమవరం, నరసాపురం సమన్వయకర్తలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు ఇక్కడి ప్రజలకు పూర్తిగా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
 
సత్యవతికి పరామర్శ
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తణుకు సబ్‌జైలుకు చేరుకున్నారు. 38 రోజులుగా జైలులో రిమాండ్‌లో ఉన్న ఆరేటి సత్యవతిని పరామర్శించారు. తుందుర్రు ఉద్యమం, అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను సత్యవతి నుంచి తెలుసుకున్నారు. తన భర్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, అయినా పోలీసులు తనను తణుకులోను, తన కుమారుడిని నరసాపురం సబ్‌జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపో యారు. తనకు బెయిల్‌ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. అనంతరం బయటకు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పోలీసు రాజ్యం నడుపుతున్న చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరి గారు. అనంతరం అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా సాయంత్రం 5.30 గంటల సమయంలో తుందుర్రు చేరుకున్నారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకూ వైఎస్‌ జగన్‌ రాక కోసం వేలాది ప్రజలు ఎదురుచూశారు. తుందుర్రు గ్రామ సరిహద్దు నుంచి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కె.బేతపూడి వరకూ జనసంద్రం కదలివచ్చిందా అన్నట్టుగా తీసుకువెళ్లారు. తుందుర్రు ఎస్సీ పేటలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, అంబేద్కర్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement