ఐపీఎల్ క్యూ
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీలను వీక్షించేందుకు ఉవ్విళ్లూరుతున్న అభిమానులు సోమవారం చెన్నై చేపాక్ స్టేడియం వద్ద భారీసంఖ్యలో క్యూ కట్టారు. ఐపీఎల్-8వ క్రికెట్ పోటీలు ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమై 24వ తేదీతో ముగుస్తాయి. 8 జట్లు తలపడే ఈ క్రికెట్ పోటీలు దేశంలోని 12 మైదానాల్లో సాగుతాయి. ఇందులో భాగంగా 9వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్-డిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య 7వ లీగ్ పోటీలకు చేపాక్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. అలాగే మరో మ్యాచ్‌లో సన్‌రైజస్-హైదరాబాద్ జట్లు 11వ తేదీన తలపడనున్నాయి.
ఈ క్రికెట్ పోటీలను ప్రత్యక్షంగా తిలకించేవారి కోసం ఉదయం 9.30గంటలకు చేపాక్‌లోని
ఏమ్ఏ చిదంబరం స్టేడియంలో టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించారు. స్టేడియం వద్ద తొక్కిసలాట లేకుండా స్టేడియం నిర్వాహకులు తాత్కాలిక క్యూలైన్లను నిర్మించారు. ఉదయం 6 గంటల నుండే క్రీడాభిమానులతో భారీ క్యూ ఏర్పడింది. ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలో నిల్చుని టిక్కెట్లను దక్కించుకున్న అభిమానులు ఆనందంతో తమ టిక్కెట్లను ప్రదర్శిస్తూ కేరింతలు కొట్టారు. కనిషట టిక్కెట్టు ధర రూ.750 కాగా ఎక్కువ మంది ఇవే టిక్కెట్లను కొనుగోలు చేశారు.
అలాగే ధనికులు, కార్పొరేట్ దిగ్గజాల కోసం గరిష్టధర రూ.15వేలుగా నిర్ణయించారు. వీటితో పాటూ రూ.1,500, రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.6 వేల విలువైన టిక్కెట్లను అమ్మారు. ఆన్లైన్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు కొద్దిరోజుల ముందుగానే మొదలైనాయి. రాజకీయ కారణాల వల్ల గత ఏడాది చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ పోటీలు మరో రాష్ట్రానికి బదిలీ అయిపోగా, క్రీడాభిమానులు నిరాశకు గురైనారు. ఈ నేపథ్యంలో ఏడాది విరామం తరువాత దక్కిన అవకాశం కావడంతో వయసుతో నిమిత్తం లేకుండా క్రీడాభిమానులంతా 9వ తేదీ కోసం ఉరకలు వేస్తున్నారు.