Tigers conservation
-
పులుల ప్రోగ్రెస్ రిపోర్ట్!
జీవవైవిధ్యాన్ని పరిరక్షించటంలో, పర్యావరణాన్ని కాపాడటంలో, ప్రకృతి సమతుల్యత కొనసాగటంలో పులుల ప్రాధాన్యం తెలిసినవారికి దేశంలో పులుల సంఖ్య పెరిగిందన్న వార్త ఉపశమనం ఇస్తుంది. ప్రధాని ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,167 పులులున్నాయి. అయిదేళ్లక్రితం 2,226గా ఉన్న సంఖ్య ఇంతగా పెరిగిందంటే పులుల సంరక్షణకు తీసుకుంటున్న పటిష్ఠ చర్యలే కారణమనడంలో సందేహం లేదు. ఒక్క పులులన్న మాటేమిటి... వన్యమృగాల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల వల్ల సింహాలు, చిరుతపులుల సంఖ్య కూడా గణనీయంగా హెచ్చింది. ఆసియా జాతి సింహాల సంఖ్య 523 నుంచి 674కు, చిరుతల పులుల సంఖ్య దాదాపు 8,000 నుంచి 12,852కు పెరిగాయి. పులుల సంఖ్య పెంచటంతోపాటు దేశంలో కనుమరుగైన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తెప్పించి ఇక్కడి అడవుల్లో వదిలిపెట్టారు. ప్రపంచంలో ఉన్న పులుల్లో 70 శాతం మన దేశంలోనే ఉన్నాయంటే అది ప్రాజెక్టు టైగర్ పథకం చలవే. సరిగ్గా యాభైయ్యేళ్ల క్రితం భారత్‌లో పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్న సంకల్పంతో డాక్టర్ కరణ్‌సింగ్ నేతృత్వంలో పద్మజానాయుడు, కైలాస్ సంకాల వంటివారితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. తర్వాతే ప్రాజెక్ట్ టైగర్ కింద పులుల తొలి సంరక్షణ కేంద్రం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మొదలైంది. పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 55కు చేరుకుంది. ప్రాజెక్టు టైగర్ ప్రారంభించేనాటికి పులులు, సింహాల వేట సంపన్నవర్గాలకు వినోదంగా ఉండేది. వారిని అడవుల జోలికి రాకుండా చేయటానికి కఠిన చర్యలు తీసుకోవటం ప్రారంభించాక క్రమేపీ ఆ ధోరణి తగ్గింది. అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను అతిగా వినియోగించుకోవటం వల్ల వన్యప్రాణుల్లోని ఎన్నో జాతులకు ప్రాణం మీదికొస్తోంది. ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకు 27 రకాల జాతులు అంతరిస్తున్నాయి. పులుల సంఖ్య పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నా దేశంలో ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే జీవ వైవిధ్యతకు పెట్టింది పేరైన పడమటి కనుమల ప్రాంతంలో పులుల సంఖ్య తగ్గిందని గణాంకాలు సూచిస్తున్నాయి. 1,600 కిలోమీటర్ల పొడవునా 1,40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో పడమటి కనుమలు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పులుల సంరక్షణ కేంద్రాలు 12 ఉండగా, ఇతరేతర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 68 వరకూ ఉన్నాయి. అయితే అయిదేళ్లక్రితం ఈ ప్రాంతంలో 981గా ఉన్న పులుల సంఖ్య ఇప్పుడు 824 మాత్రమే. పడమటి కనుమలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి చాన్నాళ్లయింది. అక్కడి మూడోవంతు ప్రాంతం జీవావరణపరంగా సున్నితమైనదని 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రకటించింది కూడా. కానీ తదుపరి చర్యలు అందుకు తగ్గట్టుగా లేవు. ఇలా ప్రకటించటాన్ని కర్ణాటక, కేరళ, గోవా తప్పుబట్టాయి. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత తీరిందన్నట్టు చేతులు దులుపుకొంది. ఫలితంగా అడవులు తరిగి, పర్యావరణం దెబ్బతిని, వన్య ప్రాణులకు ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని పర్యవసానంగానే దేశమంతా పులుల సంఖ్య పెరిగితే అక్కడ తగ్గింది. దీన్ని తగ్గటంగా పరిగణించనవసరం లేదు...పులుల సంఖ్య స్థిరంగా ఉండిపోయినట్టు భావించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నవారు లేకపోలేదు. కానీ అడవులు అంతరిస్తూ వాటి స్థానంలో రోడ్లు విస్తరిస్తుంటే...పర్యాటకం పేరిట మనుషుల తాకిడి పెరుగుతుంటే, ఖనిజాల కోసం అడవులు నరకడానికి పూనుకుంటే వన్యప్రాణులు ప్రశాంతంగా మనుగడ సాగించలేవు. పులులు, అవి వేటాడే జంతువులు సంచరించే ప్రాంతాలు కుంచించుకుపోతే పులులపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. వేట కోసం వెదుక్కుంటూ జనావాసాలపై కూడా పడతాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అడవుల వినాశనానికి కారణమవుతున్న ప్రభు త్వాలు ఆ తర్వాత జరిగే పర్యవసానాలు ఎదుర్కొనటానికి మరిన్ని అవకతవకలకు పాల్పడుతున్నాయి. ఏనుగులు, పులులు, చిరుతల బారినపడి గత పదినెలల్లో 41మంది పౌరులు మరణించారని మొన్న ఫిబ్రవరిలో కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది. స్వేచ్ఛగా సంచరించటానికి, ఆహారం వెదుక్కొనటానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు పులుల్లో ఒకరకమైన అభద్రతాభావం ఏర్పడి వాటి పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుందని నాలుగేళ్లక్రితం సీసీఎంబీ నివేదిక హెచ్చరించింది. వన్యమృగాల సంరక్షణ పేరుతో ఆదివాసీలను అడవులకు దూరం చేద్దామని ప్రయత్నించే ప్రభు త్వాలు తీరా ఆ అడవులను ఖనిజాల వెలికితీత కోసం బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికి, విశాల మైన రోడ్లు నిర్మించటానికి వెనకాడటం లేదు. దాంతో భారీ యంత్రాలు అక్కడికి తరలివస్తున్నాయి. వన్యప్రాణులను హడలెత్తిస్తున్నాయి. నిజానికి శతాబ్దాలుగా ఆదివాసీలు వన్యప్రాణులతో సురక్షితంగా సహజీవనం సాగిస్తున్నారు. వాటి కదలికలకు అనువుగా జీవనం సాగించటం, వాటికి హాని కలగనిరీతిలో అవసరమైన ఆత్మరక్షణ చర్యలు తీసుకోవటం పరంపరాగతంగా వారికి అలవడిన విద్య. ఏదేమైనా అడవుల సంరక్షణకూ, వన్యమృగాలను కాపాడటానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోనట్టయితే జీవవైవిధ్యం నాశనమవుతుంది. మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు వెలువడిన నివేదికలోని గణాంకాలు ఆశావహంగానే ఉన్నా చేయాల్సింది ఇంకెంతో ఉన్నదని నివేదిక తెలియజేస్తోంది. ఆ దిశగా అడుగులేయటమే ప్రభుత్వాల కర్తవ్యం. -
పులులకు ‘ఎండదెబ్బ’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న పులుల మరణాలు కలవర పరుస్తున్నాయి. ఈ ఏడాది రెండు నెలల్లోనే 34 పులులు మరణించాయి. ముఖ్యంగా ఎండాకాలం వాటి పాలిట మృత్యువుగా మారుతోంది. గత పదేళ్ల గణాకాలు కూడా అదే చెబుతున్నాయి. మార్చి నుంచి మే చివరి వరకు పులుల మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. దాంతో ఈ వేసవిలో పులుల సంరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. 2012–2022 మధ్య పదేళ్లలో దేశవ్యాప్తంగా 1,062 పులులు మరణించినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 270, మహారాష్ట్రలో 184, కర్ణాటకలో 150 పులులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో తొమ్మిది పులులు మృత్యువాత పడ్డాయి. 2020లో 106, 2021లో 127, 2022లో 121 పులులు మరణించాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లోనే 34 ప్రాణాలు కోల్పోవడం విషాదం. వీటిలో మధ్యప్రదేశ్‌లో 9, మహారాష్ట్రలో 8 మరణాలు సంభవించాయి. గడిచిన పదేళ్ల రికార్డులు చూస్తే మార్చిలో 123, ఏప్రిల్‌లో 112, మేలో 113 మరణాలు నమోదయ్యాయి. అంటే పదేళ్లలో వేసవిలో ఏకంగా 348 పులులు చనిపోయాయి! తస్మాత్ జాగ్రత్త ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటొచ్చన్న అంచనాల నేపథ్యంలో పులుల సంరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాత్రిళ్లు అభయారణ్యాల్లో సఫారీలను ఆపేయండి. అక్రమ నిర్మాణాలపై నిఘా పెంచండి’’ అని పేర్కొంది. వేసవిలో పులుల మరణాలకు ఇవీ కారణాలు... ► ఎండాకాలంలో నీరు, ఆహారం కోసం తమ ఆవాసాలను దాటి దూరంగా రావడం ► అభయారణ్యాలనుంచి బయటకు వచ్చేయడం ► ఆహారం కోసం పులుల మధ్య పోరాటాలు ► అడవుల్లో పచ్చదనం తగ్గడం, బఫర్ జోన్లు లేకపోవడం ► అటవీ భూముల నరికివేత, సమీప ప్రజల్లో అడవి జంతువులపై అసహనం, భయంతో కొట్టి చంపడం -
పెద్దపులే.. వారి పెద్దమ్మ
అది దట్టమైన నల్లమల అడవి.. అందులో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు ఏవో పాదముద్రలు చూసి ఆగిపోయారు. అవేమిటని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి అడుగులుగా (పగ్ మార్క్) నిర్ధారించారు. అంటే దగ్గర్లోనే పులి ఉన్నట్లు గ్రహించారు. ఇంకా ముందుకెళ్తే ప్రమాదమని భావించి అక్కడే ఆగిపోయారు. ఆ అడుగుల ముద్ర చుట్టూ చిన్నచిన్న రాళ్లు పెట్టి వాటిపైన ఒక పారదర్శక అద్దం పెట్టారు. దానిపై స్కెచ్‌తో ఆ అడుగుల్ని గీశారు. అలాగే, ప్లాస్టర్ ఆప్ పారిస్‌తో కూడా ఆ పాదముద్రను సేకరించి వెనుదిరిగారు. – (నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి బి. ఫణికుమార్) ఆ ఐదుగురు ఎవరో కాదు.. పులుల రక్షకులు. నల్లమలలో జీవించే చెంచులు వారు. వన్యప్రాణుల మధ్యే వారి జీవనం. వాటితో తరతరాల అనుబంధం వారిది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని రోళ్లపెంట బేస్ క్యాంపు వద్ద వాళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేర్లు.. దంసం గురవయ్య, దాసరి నాగన్న, దంసం మొగిన్న, దార బయన్న, అంజి నాయక్. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య ఏటా పెరుగుతుండడంలో అటవీ శాఖతోపాటు నల్లమల చెంచుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఈ ప్రాంతంలో వాటి ఆవాసాలు సురక్షితంగా ఉండడానికి ఈ చెంచులే ప్రధాన కారణం. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల రక్షణ బాధ్యత వారిదే. ఏడేళ్ల క్రితం అక్కడ కేవలం 37 మాత్రమే పులులు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 73కి పెరిగింది. అటవీ శాఖ తాజా పులుల గణనలో ఈ విషయం తేలింది. 63 బేస్‌క్యాంపుల బాధ్యత వీరికే.. అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగే చెంచులకు అక్కడి దారులు, నీటి చెలమలు, పులులు, మిగిలిన వన్యప్రాణులు, వాటి జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు. పులుల్ని వారు పెద్దమ్మగా భావిస్తారు. అందుకే వాటిని సంరక్షిస్తారు. ఆంధ్రా ప్రాంతంలో ద్రవిడుల కంటే ముందు నుంచి చెంచులు నివసిస్తున్నారనే వాదన ఉంది. అనాదిగా నల్లమలలో వన్యప్రాణులతో కలిసి వారు జీవిస్తున్నారు. అడవి ఉంటేనే తమ మనుగడ ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షిస్తారు. వీరికి అడవి ఆనుపానులు తెలుసు కనుకే వారి ద్వారానే అటవీ శాఖ పులుల సంరక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా.. ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల అటవీ డివిజన్లలో మొత్తం 63 బేస్ క్యాంపుల బాధ్యతను వారికే అప్పగించింది. అక్కడి నుంచే పులులు, ఇతర వన్యప్రాణులు, అటవీ సంరక్షణను చేపడుతున్నారు. ప్రతి బేస్ క్యాంపులో ఐదుగురు చెంచులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వీరిని పంచ పాండవులుగా పిలుస్తారు. అనేక తరాలుగా పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణలో చెంచులు భాగమయ్యారు. ఫ్రంట్లైన్లో ఉండి దట్టమైన అడవుల్లో పులులు, ఇతర జంతువులను ట్రాక్ చేయడంతోపాటు వాటి రక్షణ, అడవిలో పెట్రోలింగ్, సమాచారం సేకరించడానికి పనిచేస్తున్నారు. బేస్ క్యాంపులు వచ్చాక.. అంతకుముందు కూడా అటవీ శాఖాధికారులు వీళ్ల ద్వారానే నల్లమలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. చెంచులు ఏం చేస్తారంటే.. ► చెంచులకు అటవీ శాఖ శిక్షణనిచ్చింది. మొబైల్లో జీపీఎస్ ద్వారా అడవిలో తిరగడం, చెట్లకు కెమేరా ట్రాప్‌లు అమర్చడం, పులుల అడుగులు గుర్తించి ఆ ముద్రలను సేకరించడం వీరి ప్రధాన విధులు. ► ప్రతిరోజు తమ బేస్ క్యాంపు పరిధిలో 5 నుంచి 7 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ చేస్తారు. ► ఎం–స్ట్రైప్ అప్లికేషన్ ద్వారా జంతువుల ఫొటోలు తీస్తారు. వాటిని ప్రతి 10 రోజులకు అటవీ శాఖాధికారులకు ఇస్తారు. ► బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పులులు, ఇతర జంతువులకు ఏమైనా ఉచ్చులు వేశారా? స్మగ్లింగ్ వంటి సమాచారాన్ని సేకరించి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైర్లెస్ సెట్లో అధికారులకు సమాచారమిస్తారు. ► అడవిలో జరిగే ప్రతి కదలిక తెలిసేలా ఈ చెంచుల ఫ్రంట్‌లైన్ టీమ్ పనిచేస్తుంది. ► మొత్తం 300 మంది ఈ టీముల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రతి క్యాంపులో మరో ముగ్గురు చెంచుల్ని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల ఏరివేతకు నియమించారు. ► ఈ పని ద్వారా అడవులు, పులుల సంరక్షణతోపాటు వారికి అటవీశాఖ ఉపాధి కల్పిస్తోంది. ► ఇక వీరి సేవలను గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీఎస్ఏ) గతంలోనే బెస్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చింది. ► ఆ తర్వాత దేశంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో స్థానిక గిరిజన జాతుల్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు. పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 73 పులులు ఉన్నాయి. ఇది ఏడేళ్లలో ఊహించని పెరుగుదల. తమ శాఖ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టులో విస్తీర్ణపరంగా దేశంలోనే ఇది అతిపెద్దది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుదలను బట్టి ఈ అభయారణ్యం ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. – శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ కన్జర్వేటర్–డైరెక్టర్, టైగర్ ప్రాజెక్టు చెంచులది కీలకపాత్ర పులుల సంరక్షణలో చెంచులు కీలకంగా ఉన్నారు. బేస్ క్యాంపుల్లో వాళ్లు ఐదుగురు చొప్పున ఉంటారు. వారు పెట్రోలింగ్ చేస్తూ పులుల్ని ట్రాక్ చేస్తారు. పులుల గురించి అన్నీ తెలిసిన వారికే వాటి సంరక్షణలో భాగస్వాముల్ని చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం. – సందీప్‌రెడ్డి, సబ్ డీఎఫ్ఓ, ఆత్మకూరు ఫారెస్టు డివిజన్ పులి కనపడితే నిశ్శబ్దంగా ఉండిపోతాం ప్రతిరోజు 5–7 కిలోమీటర్ల మేర అడవిలో తిరుగుతాం. పులి, ఇతర జంతువుల్ని గమనిస్తూ ఉంటాం. అడుగుల్ని బట్టి అవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకుంటాం. ఒకవేళ పులి ఎదురైతే నిశ్శబ్దంగా ఉండిపోతాం. దీంతో అది మా వైపు చూసినా వెళ్లిపోతోంది. హడావుడి చేస్తే దాడిచేస్తుంది. – దార బయన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ మంచినీటి కోసం సాసర్ పిట్లు కడతాం మా క్యాంపు చుట్టూ నాలుగైదు రూట్లలో తిరుగుతాం. ఒక్కో రోజు ఒక్కో రూట్లో వెళ్తాం. ఎండాకాలం జంతువులు నీటి కోసం అలమటిస్తాయి. వాటికోసం అడవిలో ఆఫీసర్లు చెప్పినట్లు సాసర్ పిట్లు కట్టి అందులో నీళ్లు నింపుతాం. పులులు, ఇతర జంతువులు వచ్చి ఆ నీటిని తాగుతాయి. – దంసం మొగిన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ పులుల క్రాసింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉంటాం పులులు క్రాసింగ్ అయ్యే టైమ్‌లో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అవి కలిసే (మేటింగ్) సమయం. ఆ సమయంలో ఎవరైనా కనపడితే విరుచుకుపడిపోతాయి. వేటాడే సమయంలోనూ పులికి కనపడకూడదు. తనను అడ్డుకుంటున్నారని భావించి దాడిచేస్తుంది. మిగిలిన సమయాల్లో మనుషుల్ని చూసినా వెళ్లిపోతుంది. – అంజి నాయక్, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ -
Tiger Census 2021: నేటి నుంచి పులుల గణన
పెద్దదోర్నాల: ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా అటవీ శాఖాధికారులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు పులుల గణన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పులి సంరక్షణ కేంద్రాలు 50 ఉండగా, వాటిలో నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అతి పెద్ద అభయారణ్యంగా గుర్తింపు పొందింది. గతేడాది నిర్వహించిన గణనలో ఇక్కడ 63 పులులు ఉన్నట్లు తేలింది. ఈ సారి ఆ సంఖ్య పెరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో నల్లమల విస్తరించింది. ఈ అటవీ ప్రాంతంలోని సిబ్బందికి ఇప్పటికే పులుల గణనపై శిక్షణ తరగతులు నిర్వహించి సంసిద్ధం చేశారు. ఈ సారి పులుల గణనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో వాటి పాదముద్రల ఆధారంగా గణన జరిగేది. అరణ్యంలోని పలు ప్రాంతాల్లో అవి సంచరిస్తుండటంతో ఖచ్చితమైన సంఖ్య తేలేది కాదు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వెలువడే ఆల్ఫ్రారెడ్ బీమ్ పరిధిలోకి జంతువు రాగానే కెమెరా చిత్రీకరిస్తుంది. దీంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎకోలాజికల్ యాప్‌ను ఉపయోగించి వన్యప్రాణుల వివరాలు సేకరిస్తున్నారు. నూతన శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు పులుల పాదముద్రలు, మలము, చెట్ల మొదళ్లపై పులుల గోళ్ల రక్కులకు సంబంధించిన ఆనవాళ్లను సైతం పరిగణనలోకి తీసుకుని పులుల గణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. -
పులుల రక్షణకు ‘టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులులు, వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’ను ఏర్పాటు చేయనుంది. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల్లో ఉన్న పులులు, వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు 112 మంది సిబ్బందితో దీనిని ఏర్పాటు చేయనుంది. రెండు చోట్లా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి అధికారులు దీనికి నేతృత్వం వహిస్తారు. ఇందులో ముగ్గురు రేంజ్ ఆఫీసర్లు, 81 మంది గార్డులు, 26 మంది ఫారెస్ట్ వాచర్లు ఉంటారు. దీని నిర్వహణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున భరిస్తాయి. సమీకృత ప్రణాళిక.. అటవీ సంపద రక్షణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమీకృత ప్రణాళికను అటవీశాఖ సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సంబంధిత శాఖల సమన్వయంతో అడవుల రక్షణ కోసం ఈ ప్రణాళికను అమలుచేయనుంది. అడవుల్లో చెట్ల నరికివేత నియంత్రణ, వేటను పూర్తిగా అరికట్టడం, అటవీ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ రక్షణ కమిటీలో ఈ మేరకు నిర్ణయించారు. అడవుల్లో జంతువుల వేటకు విద్యుత్ కంచెను వాడితే, కరెంట్ చౌర్యం, అక్రమ వినియోగం కింద కేసులు పెట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. అటవీ నేరాల్లో విచారణ వేగవంతం చేయడం, నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వపరంగా అటవీ శాఖకు న్యాయ సహకారం అందనుంది. ఇందుకోసం జిల్లాకు ఒక లీగల్ అడ్వయిజర్‌ను నియమించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. టాస్క్‌ఫోర్స్ దాడులు, అటవీ భూముల ఆక్రమణల తొలగింపునకు అవసరమైన చోట అటవీశాఖ పోలీసుల సహకారం తీసుకోనుంది. అటవీ సమీప గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి అటవీ రక్షక దళాలను ఏర్పాటు చేయాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు దీనిపై అవగాహన కల్పించేలా అటవీశాఖ చర్యలు చేపట్టనుంది. -
వాహ్.. ‘రాహ్‌గిరి’