రాళ్లబండికి ఘన నివాళి
హైదరాబాద్: తెలుగుభాషకు, సాహిత్యానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ చేసిన సేవలు ఎనలేనివని మంత్రి చందూలాల్ అన్నారు. ఆదివారంరాత్రి గుండెపోటుతో మృతి చెందిన కవితాప్రసాద్ మృతదేహాన్ని సోమవారం మోతీనగర్‌లోని టింబు ఎన్క్లేవ్ అపార్టుమెంట్స్ ఆవరణలో ఉంచారు. అక్కడికి వెళ్లిన చందూలాల్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
నివాళులర్పించినవారిలో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటి స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెయిండ్ పీటర్లతోపాటు పి.వి.రాజేశ్వరరావు, దైవజ్ఞశర్మ, సినీనటుడు ఉత్తేజ్ తదితరులు ఉన్నారు. సుమారు ఒకటిన్నర గంట ప్రాంతంలో ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగింది. బల్కంపేట ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
సీపీఐ సంతాపం: కవితాప్రసాద్ అకాల మరణంపట్ల సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. కవితాప్రసాద్ మరణం తెలుగు సాహితీ, సాంస్కృతిక రంగాలకు తీరనిలోటని పేర్కొన్నారు.