Tindal
-
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
మదనపల్లె క్రైం : ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న డబ్బు చెల్లించాలన్న మేస్త్రీ వేధింపులు తాళలేక భవన నిర్మాణ కార్మికురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు.. మొరవ భీమగానిపల్లెకు చెందిన శ్రీనివాసులు, శేషమ్మ(45) దంపతులు స్థానికంగా భవన నిర్మాణాల ఒప్పందపు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం అదే ఊరికి చెందిన మేస్త్రీ పాపిరెడ్డి వద్ద పుంగనూరులో ఓ భవన నిర్మాణం కోసం కొంత నగదు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఆ ఇంటిని సకాలంలో పూర్తి చేయలేకపోయారు. డబ్బు చెల్లించా లని మేస్త్రీ ఒత్తిడి చేశాడు. కర్ణాటకలో కూలి పనులు చేసి డబ్బు చెల్లించాలని శ్రీనివాసులు ఆరు నెలల క్రితం వెళ్లాడు. అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి వెళుతున్నాడు. దీంతో ఆగ్రహించిన మేస్త్రీ బాకీ తీర్చకుండా బయటకు వెళ్లరాదని పేర్కొంటూ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. తన భర్తతో సంబంధం లేకుండా తాను డబ్బు చెల్లిస్తానని శేషమ్మ మేస్త్రీ కాళ్లు పట్టుకుని వేడుకుంది. అయినా అతను ప్రతి రోజూ డబ్బు కోసం వేధిస్తుండడంతో మంగళవారం రాత్రి ఆమె పురుగుల మందుతాగింది. స్థానికులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం శేషమ్మ మృతిచెందింది. మృతురాలికి మేఘశ్రీ, నాగలక్ష్మి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూలీల అమ్మానాన్నల నిర్బంధం
బాకీ డబ్బుల కోసం ఓ మేస్త్రీ దారుణం పాన్‌గల్: బాకీ డబ్బులు చెల్లించడం లేదని కూలీల తల్లిదండ్రులను ఓ మేస్త్రీ నిర్బంధించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలం పుల్గరచర్ల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కూలీ పనుల నిమిత్తం కొత్తకోట మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుంపుమేస్త్రీ మొగులయ్య వద్ద పుల్గరచర్ల గ్రామానికి చెందిన బాలస్వామి, దేవమ్మలు అడ్వాన్సుగా రూ.70 వేలు తీసుకున్నారు. కర్ణాటక రాష్ర్టంలోని యాదగిరిలో అతని వద్ద 8 నెలలు పాటు పనిచేశారు. పనులు చేసే క్రమంలో బాలస్వామి ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది. దీంతో అనారోగ్యంతో భార్యాభర్తలు కలసి ఈనెల 8వ తేదీన పనుల దగ్గర నుంచి సొంత గ్రామానికి వచ్చే క్రమంలో గుంపుమేస్త్రీ తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఇద్దరూ కలసి రామకృష్ణాపురం వెళ్లారు. డబ్బులు చెల్లించి వెళ్లాలని బెదిరించడమే కాకుండా మేస్త్రీ వారిపై దాడిచేశాడు. ఈ విషయాన్ని బాధితులు గ్రామంలోని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వీరితో పాటు తల్లిదండ్రులు మణ్ణెమ్మ, మశన్న 10వ తేదీన రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లారు. తల్లిదండ్రులను మేస్త్రీ నిర్బంధించి..డబ్బులు చెల్లించి వీరిని తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ విషయంపై సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. మా తల్లిదండ్రులను విడిపించాలి మొగులయ్యపై చర్యలు తీసుకొని, మా తల్లిదండ్రులను విడిపించాలని అధికారులను కూలీలు అభ్యర్థిస్తున్నారు. పనులు చేసే క్రమంలో బొటనవేలు తెగిపోయి గాయమైనా ఎలాంటి చికిత్స చేయించలేదని, సొంత డబ్బులు రూ.4 వేలు ఖర్చుపెట్టినట్లు బాలస్వామి పేర్కొన్నారు. -
కూలీ కోసం తీసుకొచ్చి చితకబాదారు..
గదిలో నిర్బంధించి యువకులపై దాడి చేసిన మేస్త్రీ ఎల్కతుర్తి: బతుకుదెరువు నిమిత్తం పొట్ట చేతపట్టుకుని వచ్చిన కూలీలను ఓ మేస్త్రీ గదిలో నిర్బంధించి గురువారం రాత్రి దాడి చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలానికి చెందిన సిద్దు పెంచలయ్య, సిద్దు విజయ్(16), తుపాకుల వెంకటేష్, పోలి కుమార్‌లను వారం రోజుల క్రితం కోరుట్లకు చెందిన గురువయ్య అనే మధ్యవర్తి పని కల్పిస్తానని కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరకు తీసుకొచ్చి బండారు శ్రీను అనే మేస్త్రీకి అప్పగించాడు. యజమాని రోజూ కారం, పచ్చడితో భోజనాలు పెడుతున్నాడు. ఎంత పనిచేసినా సరిగా చేయడంలేదని దూషిస్తున్నాడు. దీంతో కూలీలు అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బుల వరకు పనిచేసి, గురువారం మధ్యాహ్నం స్వగ్రామాలకు బయల్దేరి వరంగల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మేస్త్రీ శ్రీనివాస్ ఆటోలో వరంగల్ స్టేషన్‌కు వెళ్లి వారిని మభ్యపెట్టి దామెరకు తీసుకొచ్చాడు. రాత్రి బాగా మద్యం తాగి వచ్చి కూలీలను గదిలో నిర్బంధించి విచక్ష ణారహితంగా కర్రతో చితకబాదాడు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించాడు. రాత్రంతా వారిని గదిలోనే నిర్బంధించి శుక్రవారం కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాడు. ఉదయం గదిలో నుంచి అరుపులు వినిపిస్తుండడంతో చుట్టుపక్కలవారు తాళం పగులగొట్టి వారిని బయటకు తీశారు. వారి శరీరాల నిండా కమిలిన గాయాలున్నారుు. గ్రామస్తుల సహకారంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.