కూలీల అమ్మానాన్నల నిర్బంధం
బాకీ డబ్బుల కోసం ఓ మేస్త్రీ దారుణం
పాన్‌గల్: బాకీ డబ్బులు చెల్లించడం లేదని కూలీల తల్లిదండ్రులను ఓ మేస్త్రీ నిర్బంధించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలం పుల్గరచర్ల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కూలీ పనుల నిమిత్తం కొత్తకోట మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గుంపుమేస్త్రీ మొగులయ్య వద్ద పుల్గరచర్ల గ్రామానికి చెందిన బాలస్వామి, దేవమ్మలు అడ్వాన్సుగా రూ.70 వేలు తీసుకున్నారు. కర్ణాటక రాష్ర్టంలోని యాదగిరిలో అతని వద్ద 8 నెలలు పాటు పనిచేశారు. పనులు చేసే క్రమంలో బాలస్వామి ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది.
దీంతో అనారోగ్యంతో భార్యాభర్తలు కలసి ఈనెల 8వ తేదీన పనుల దగ్గర నుంచి సొంత గ్రామానికి వచ్చే క్రమంలో గుంపుమేస్త్రీ తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఇద్దరూ కలసి రామకృష్ణాపురం వెళ్లారు. డబ్బులు చెల్లించి వెళ్లాలని బెదిరించడమే కాకుండా మేస్త్రీ వారిపై దాడిచేశాడు. ఈ విషయాన్ని బాధితులు గ్రామంలోని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వీరితో పాటు తల్లిదండ్రులు మణ్ణెమ్మ, మశన్న 10వ తేదీన రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లారు. తల్లిదండ్రులను మేస్త్రీ నిర్బంధించి..డబ్బులు చెల్లించి వీరిని తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ విషయంపై సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
మా తల్లిదండ్రులను విడిపించాలి
మొగులయ్యపై చర్యలు తీసుకొని, మా తల్లిదండ్రులను విడిపించాలని అధికారులను కూలీలు అభ్యర్థిస్తున్నారు. పనులు చేసే క్రమంలో బొటనవేలు తెగిపోయి గాయమైనా ఎలాంటి చికిత్స చేయించలేదని, సొంత డబ్బులు రూ.4 వేలు ఖర్చుపెట్టినట్లు బాలస్వామి పేర్కొన్నారు.