చేపల పట్టుబడిపై వివాదం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలోని చెరువులో అక్రమంగా చేపలు పట్టడంపై ఆదివారం పెద్ద ఎత్తున వివా దం చెలరేగింది. వివరాలిలా ఉన్నాయి.. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఆదివారం ఉదయం తిరుమలాపురం గ్రామం లోని తామర చెరువులో వలలు వేసి చేపలు పట్టడం ప్రారంభించారు. చెరువును లీజుకు తీసుకున్న హక్కుదారుడు ఊటకూరి శ్రీనివాస్ వీరిని నిలదీశారు. అక్రమంగా చేపలు పట్టడం సరికాదంటూ సూచించారు. అయితే మరలా మధ్యాహ్న సమయంలో కూడా ఏజెన్సీ ప్రాంత వ్యక్తులు చేపలు పట్టేందుకు ఉపక్రమించగా గ్రామస్తులతో కలిసి శ్రీనివాస్ వారిని ప్రశ్నిం చారు. ఈ నేపథ్యంలో చెలరేగిన వివాదంలో ప్రశ్నించిన వారిపై చేపలు పట్టే వ్యక్తులు దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేపలు పట్టిన మడకం కృష్ణను గ్రామస్తులు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎం.కేశవరావు తెలిపారు.