పట్టపగలే 12 లక్షల నగదు చోరీ
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:
పట్టపగలే కారు అద్దాలు పగులగొట్టి *12 లక్షల నగదు చోరీకి పాల్పడిన సంఘటన తిరువళ్లూరులోని అక్షయభవన్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. చెన్నై మొగప్పేర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్ తిరువళ్లూరు సమీపంలోని వేపంబట్టు వద్ద వ్యవసాయం చేస్తున్నాడు. ఇతని భూమిని అమ్మగా వచ్చిన డబ్బును బ్యాంకులో దాచాడు. ఈ నేపథ్యంలో వేపంబట్టు వద్ద *15 లక్షలు విలువ చేసే ప్లాటు అమ్మకానికి రావడంతో బ్యాంకులో దాచిన నగదును శుక్రవారం డ్రా చేశాడు. ఆ నగదును కారులో ఉంచి తన కుమారుడు చంద్రశేఖర్‌తో తిరుపతి-చెన్నై జాతీ య రహదారిలో ఉన్న అక్షయభవన్లో భోజనం కోసం వెళ్లాడు. కారును పార్క్ చేసి లోపలికి వెళ్లి చేతులు కడిగేలోపు హోటల్ ఆవరణలో అక్కడున్న వారు గట్టిగా కేకలు వేశారు.
శ్రీనివాసన్ బయటకు వచ్చి చూడగా కారు అద్దాలను హెల్మెట్‌తో పగలగొట్టి కారులో ఉంచిన రూ.12 లక్షల నగదు చోరీకి పాల్పడ్డారు. దీనిని గమనించిన వారు ద్విచక్రవాహనాన్ని వెంబడించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు టౌన్ పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన వారు ఇద్దరు యువకులని, వారు ద్విచక్ర వాహనంలో వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై తిరువళ్లూరు పోలీసులు బాధితులు శ్రీనివాసన్, చంద్రశేఖర్ నుంచి ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టారు.