వెన్నుపోటు బాబుకు వెన్నతో పెట్టిన విద్య
తిరుపతి మంగళం: నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని, మహానుభావుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచే అందలం ఎక్కాడని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవకోనలోని అంబేద్కర్ విగ్రహాం వద్ద బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రాన్ని విడ గొట్టిందే కాంగ్రెస్ పార్టీనేనని చంద్రబాబు చెప్పడం బాధాకరమన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టమని ముందుగా సోనియాగాంధీ దగ్గరకు వెళ్లి చెప్పింది చంద్రబాబేనని ఆరోపించారు. అవసరం కోసం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు.
వెంకటరమణ కుటుంబంపై అభిమానం ఉంటే సుగుణమ్మకు ఎమ్మెల్సీ, టీటీడీ చైర్మన్ వంటి పదవులు ఇవ్వవచ్చు కదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల పక్షాన గళం విప్పడానికి తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడి కిరణ్‌బేడిని బలిపశువును చేసినట్లు, తిరుపతిలో సుగుణమ్మను బలిపశువు చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి, డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.