కూలిన గోల్కొండ మోతీ దర్వాజా తలుపు
హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోట తలుపు విరిగిపడింది. 450 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ కోట ద్వారాల్లో ఒకటైన మోతీ దర్వాజా తలుపు బుధవారం ఉదయం అకస్మాత్తుగా నేలకూలింది. అయితే, ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. గోల్కొండ కోటకు ఉన్న దర్వాజాలలో ఒకటైన మోతీ దర్వాజా కుడి తలుపు రెక్క బుధవారం ఉదయం దర్వాజాకు అటువైపున కూలింది. పెద్ద శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల్లో ఉండేవారు దర్వాజా వద్దకు పరుగెత్తుకొచ్చారు.
సుమారు 20 అడుగుల ఎత్తు ఉన్న భారీ తలుపు రెక్క ఎడమవైపు తలుపు రెక్కపై కూలింది. స్థానికులు చూస్తుండగానే మరోసారి పెద్ద శబ్దం చేస్తూ తలుపురెక్క కింది భాగం చెక్కలు ఊడి దర్వాజా మరింత కిందికి ఒరిగింది. ఈ సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులతో పాటు టోలీచౌకి ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యే సమయం కావడంతో పెరుగుతున్న ట్రాఫిక్‌ను బంజారా దర్వాజా, ఫతే దర్వాజా వైపు మళ్లించారు. బస్సులను ఎండీలైన్స్ నుంచి వెనక్కి పంపారు. గోల్కొండ కోట సీనియర్ పరిరక్షణాధికారి ఎం.సాంబశివకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విరిగిన తలుపు రెక్కను మరమ్మతుల నిమిత్తం కోట లోపలికి త రలించారు.