అమెరికా సైన్యానికి అతడు టార్గెట్!
వాషింగ్టన్: తాలిబాన్ నూతన చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన ముల్లా హైబతుల్లా అకుంద్జాదాకు శాంతి చర్చలలో పాల్గొనడానికి అవకాశం ఉందని అమెరికా తెలిపింది. ఇటీవల పాకిస్తాన్లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మృతి చెందిన ముల్లా మన్సూర్ స్థానంలో హైబతుల్లా అకుంద్‌జాదా తాలిబాన్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
శాంతి చర్చలలో పాల్గొనడానికి కల్పించినటువంటి అవకాశాన్ని హైబతుల్లా అకుంద్‌జాదా వినియోగించుకుంటాడని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ డిప్యూటీ స్పోక్ పర్సన్ మార్క్ టోనర్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. హైబతుల్లా ఇప్పటి వరకు ఎలాంటి ఉగ్రవాద జాబితాలో లేడని.. అయితే శాంతి చర్చలలో పాల్గొనకుండా తాలిబాన్ ల హింసాత్మక పంథాను కొనసాగిస్తే మాత్రం ఆఫ్గనిస్తాన్‌లోని అమెరికా సైన్యానికి అతడు టార్గెట్ అవుతాడని ఈ సందర్భంగా టోనర్ వెల్లడించారు. పరస్పరం చర్చల ద్వారా సమస్యకు ఒక పరిష్కారం కనుగొనే అవకాశాన్ని అతనికి కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని హైబతుల్లా వినియోగించుకోవాలని టోనర్ సూచించాడు. ఆఫ్గన్ ప్రభుత్వం గతంలో తాలిబాన్లను శాంతి చర్చలకు పిలిచినా.. వారు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.