వెన్న.. నీళ్లు..
బ్యూటిప్స్
చలికాలం చర్మం పొడిబారడం సమస్యను దరిచేరకుండా ఉండటానికి తీసుకోవాల్సిన తప్పనిసరి జాగ్రత్తలు...
క్లెన్సింగ్: చర్మం పొడిబారినట్టుగా, కళతప్పి ఉంటే పాలలో దూది ఉండను ముంచి, ముఖమంతా రాసి, తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు ఈ విధంగా చేయవచ్చు. దీని వల్ల చర్మం పొడిబారదు. మృతకణాలు, మలినాలు తొలగిపోతాయి. కాంతి పెరుగుతుంది.
{స్కబ్బింగ్: యాపిల్ గుజ్జు రెండు టేబుల్ స్పూన్లు, అరటిపండు గుజ్జు రెండు టేబుల్‌స్పూన్లు, టేబుల్‌స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి. తర్వాత వేళ్లతో రెండు నిమిషాలు వలయాకారంగా రుద్దుతూ, శుభ్రపరచుకోవాలి మెత్తటి కాటన్ టవల్‌తో ముఖమంతా అద్దాలి. చలికాలం రోజూ ఈ విధంగా చేయవచ్చు. దీని వల్ల చర్మం పొడిబారడం సమస్య ఉండదు.
టోనింగ్: చర్మం సాగడం, ముడతలు పడినట్టు అనిపించడం ఈ కాలం సహజం. అందుకని ఈ కాలం టోనింగ్ తప్పనిసరి. టోనింగ్ వల్ల స్వేదరంధ్రాలు తెరుచుకొని సహజనూనెలు వెలువడుతాయి.
మాయిశ్చరైజింగ్: చర్మం పొడిబారి, తెల్లని పొడ తేలుతున్నట్టుగా ఉంటుంది కొంతమందికి. ఈ సమస్యకు విరుగుడుగా బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేడి చేసి రోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. రోజు విడిచి రోజు కోల్డ్ క్రీమ్‌లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి రాసుకున్నా పొడి సమస్య బాధించదు.
వెన్న: టీ స్పూన్ వెన్నలో చిటికెడు పసుపు వేసి కలిపి, ముఖానికి చేతులకు పట్టించి పది నిమిషాలుండాలి. తర్వాత వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే చర్మం మృదుత్వం కోల్పోదు.
చర్మానికి దాహం: తగినన్ని నీళ్లు అందకపోతే మొక్కల మాదిరిగానే చర్మమూ వడలిపోతుంది. ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం రోజూ 10 గ్లాసులకు తగ్గకుండా మంచినీళ్లు తాగడం. మజ్జిగ, పండ్లరసాల రూపంలోనూ తగినన్ని నీళ్లను ఒంట్లోకి చేర్చవచ్చు. దీని వల్ల సహజకాంతి పెరుగుతుంది.
సన్‌స్క్రీన్: చలికాలం ఎందుకు సన్‌స్క్రీన్ అనుకుంటారు చాలా మంది. కానీ, ఈ కాలమే తప్పక వాడాలి. చలికి ఎండలో ఎక్కువ సమయం గడుపుతారు. అదీ కాకుండా చర్మం పొడిబారి ఉంటుంది. ఇలాంటప్పుడు అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మానికి తాకితే సమస్య ఇంకా పెరుగుతుంది. అందుకని, సన్‌స్క్రీన్ లోషన్‌ని తప్పక వాడాలి. సన్‌స్క్రీన్ ప్రొటెక్షన్ కోల్డ్ క్రీములు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.