నరకాసుర ‘కోట’...!
అంతేలేని టీడీపీ ముఖ్యనేత తనయుడి ఆగడాలు
ప్రతి పనికీ ఓ రేటు..కాదంటే తప్పదు కాలయాపన
తన అక్రమాలను వెలికితీస్తున్నవారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు
స్థానిక ఎమ్మెల్యే హక్కులను సైతం కాలరాస్తున్న సంఘటనలు
ఫిర్యాదు చేసినా చర్యలకు భయపడుతున్న ఉన్నతాధికారులు
నరసరావుపేట...ఒకప్పుడు బాంబుల మోతలు...ఫ్యాక్షన్ హత్యలు...ఎన్నికల వేళ రిగ్గింగ్లు. నిత్యం ఉద్రిక్త పరిస్థితులకు ఆలవాలం. పదేళ్లుగా చూస్తే...కక్షలు, కార్పణ్యాలకు దూరంగా, ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాజీవితాలు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరికిస్తే...అటు ఇటుగా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నరసరావుపేట కాస్తా నరకాసుర కోటగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎలా మారింది? కారకులెవరు? పాలకులు లేరా? అధికార యంత్రాంగం ఉందా? ఉంటే ఏం చేస్తోంది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..!
సాక్షి, గుంటూరు : పొలానికి కంచె కాపు కాయాలి..పోలీసు సమాజాన్ని రక్షించాలి...ప్రభుత్వంలో ఉన్న నేతలు ప్రజలను పాలించాలి.. ఈ క్రియలు వేరే కర్తలు చేస్తే జరిగేదేమిటో తెలియంది కాదు. కచ్చితంగా నరసరావుపేటలో ఇదే జరుగుతోందని ప్రజానీకం ఆందోళన చెందుతోంది. అధికార టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత తనయుడు గుప్పెట బిగించారు. అధికారాన్నీ, అధికార యంత్రాంగాన్నీ రైటు, లెఫ్ట్గా మార్చుకున్నారు. పలుకుబడిని, పరపతిని ఎరగా వేస్తున్నారు. మాట వినకపోతే దండోపాయాన్నీ ప్రయోగిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూ దందా నెరుపుతున్నారు.
పరిస్థితి దయనీయం...
ప్రభుత్వం వచ్చిన కొత్తలో నరసరావుపేట నియోజకవర్గంలో ఏ గ్రామం చూసినా దాడుల భయంతో వణికి పోతూ కనిపించింది. అప్పటి ఎస్పీ సీరియస్గా వ్యవహరించడంతో కొంత మేరశాంతి భద్రతలు అదుపులోకి తేగలిగారు. ప్రస్తుత పరిస్థితి మాత్రం మరింత దయనీయంగా మారిందనే సమాచారం. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నప్పటికీ ఆయన హక్కులను కాలరాసేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. కారణం టీడీపీ ముఖ్యనేత తనయుడికి అధికారులు సైతం భయపడతారని అందరికీ తెలిసిందే.
అధికారం దాసోహం...
నరసరావుపేట నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు భూములు కొనుగోలు చేసుకుని ల్యాండ్ కన్వర్షన్ కోసం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా టీడీపీ ముఖ్యనేత తనయుడి ఆమోద ముద్ర కావాలంటూ స్వయానా రెవెన్యూ అధికారులే ఆయన వద్దకు పంపారంటే అధికారం ఎంతగా దాసోహమైందో ఇట్టే అర్థమవుతోంది. చివరకు ఎకరాకు రూ.50 వేల వంతు న చెల్లిస్తేగానీ ఆయన ఆమోద ముద్ర వేయలేదు.
మరో విషయంలో కోటప్పకొండ వద్ద వేసిన వెంచర్కు సంబంధించి ఓ రియల్టర్ అక్షరాల రూ. 50 లక్షలు ముట్టజెప్పితేగానీ ఆమోద ముద్ర పడలేదట. మార్కెట్ యార్డు షాపులను టెండర్ల ద్వారా కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ముఖ్యనేత తనయుడి ఆదేశాలతో టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో సిద్ధంగా ఉండి టెండరు వేసేందుకు వచ్చినవారిపై దాడిచేసి టెండరు ఫారాలు చించి వేస్తున్నా పోలీసులు సినిమా చూసినట్లు చూశారు.
విషయం తెలుసుకున్న విపక్ష ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అక్కడకు చేరుకుని అధికార టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. విషయాన్ని రూరల్ ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయింది. ఇవేకాకుండా నరసరావుపేటలో ఓ అపార్టుమెంటు కట్టాలన్నా, రోడ్లు, డ్రెయిన్ల పనులు చేయాలన్నా, కాంట్రాక్టర్లు టీడీపీ ముఖ్యనేత తనయుడు నిర్ణయించిన పర్సంటేజీలు చెల్లించాల్సిందే. మున్సిపాలిటిలో రూ. 5 కోట్లు నిధులు ఉన్నప్పటికీ పర్సంటేజీలు కుదరకపోవడంతో కొన్నాళ్లుగా 34 అంశాలను రద్దు చేస్తూ వస్తున్నారు. అయితే తన అక్ర మాలను బహిర్గతం చేస్తున్న వారిపై ఆయన అన అనుచరులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ తన దందా కొనసాగించడం కొసమెరుపు.!