టచ్ స్క్రీన్ సెల్ కోసం ఉసురు తీశాడు !
కోలారు : బంగారుపేట పట్టణంలో ఈనెల 11న సంచలనం సృష్టించిన మంజుల అనే వివాహిత హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. కేవలం టచ్ స్క్రీన్ సెల్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం ఓ బాలుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిర్ధారించిన పోలీసులు ఈమేరకు బాలుడిని అరెస్ట్ చేశారు. కేజీఎఫ్ ఎస్పీ భగవాన్‌దాస్ మంగళవారం వివరాలు వెల్లడించారు. బంగారుపేట పట్టణంలోని విజయనగర కాలనీలో నివాసం ఉంటున్న బాలుడు అదే ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. హతురాలు మంజుల ఇంటి ఎదుట గతంలో బాలుడి కుటుంబం నివాసం ఉండేది.
పూర్వ పరిచయంతో బాలుడు ఈనెల 11న మంజుల ఇంటికి వెళ్లాడు. మంచినీరు ఇవ్వాలని కోరడంతో ఆమె లోపలకు వెళ్లింది. అదే సమయంలో లోపలకు చొరబడిన బాలుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న కర్ర తీసుకొని మంజుల ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. బాలుడు ఆమె నోటిని అదిమిపెట్టి బ్లేడ్‌తో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. రక్తంతో తడిసిన చేతులతో వెళ్తున్న బాలుడిని చూసిన స్థానికులు ఏమైందని ప్రశ్నించగా బైక్నుంచి పడ్డానని అబద్దం చెప్పాడు.
అనంతరం బాలుడు హొసకోటకు వెళ్లిపోయాడు. ఐదు రోజుల తర్వాత సేలంకు చేరుకుని మిత్రుల వద్ద ఉన్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడి కోసం గాలించి పక్కా సమాచారంతో సేలంకు వెళ్లి మంగళవారం అరెస్ట్ చేశారు. టచ్‌స్క్రీన్ సెల్‌ఫోన్ కోసం అవసరమైన డబ్బు కోసం హత్యోదంతానికి పాల్పడినట్లు బాలుడు విచారణలో అంగీకరించాడని ఎస్పీ తెలిపారు.