శ్రమ దోపిడీపై పోరాడుదాం..
- టఫ్ కో కన్వీనర్ విమలక్క
జవహర్నగర్ : కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) కో కన్వీనర్ విమలక్క అన్నారు. బాలాజీనగర్లో శుక్రవారం రాత్రి ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర రాష్ర్ట, ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు.
అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకువచ్చేవరకు రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శ్రమదోపిడీకి గురవుతున్న కష్టజీవుల్ని ఐక్యం చేసి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాలతో పాలకులు ముందుకు వెళ్తున్నారని, ఫలితంగా ఉద్యోగ కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్రాజ్ మాట్లాడుతూ.. కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కరువైందన్నారు.
ఆకాశాన్నంటిన ధరలతో పేద ప్రజలు బతికేందుకు కష్టమైపోయిందన్నారు. కార్మికుల హక్కులకోసం ఏఐఎఫ్టీయూ పనిచేస్తోందని, పోరాటాలతోనే హక్కులను సాధించుకుంటామన్నారు. అనంతరం అరుణోదయ కళాకారుల బృందం ఆట పాటలతో హుషారెత్తించారు. కార్యక్రమంలో జవహర్నగర్ సర్పంచ్ గడ్డమీది మల్లేష్, టఫ్ రాష్ట్ర నాయకుడు హనుమాన్లు, ఏఐఎఫ్టీయూ జంటనగరాల ప్రధాన కార్యదర్శి శివబాబు, రాష్ట్ర నాయకుడు నాగేశ్వరావు, అసంఘటిత భవన నిర్మాణరంగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.మల్లేష్ , ఏఐఎఫ్టీయూ జవహర్నగర్ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు బిర్రు యాకస్వామి, డాక్టర్ రవి, చెన్నాపురం యాదయ్య, సత్యనారాయణ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.