Toy currency
-
పాపం.. టాయ్ కరెన్సీ ‘ఇచ్చి’ అనూహ్యంగా అరెస్టయిన సినీ నిర్మాత
Tollywood Movie Producer AS Kishore Arrested In Toy Currency Case Hyderabad సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన టాయ్ కరెన్సీ కేసులో చోటా నిర్మాత ఏఎస్ కిషోర్ బుక్కయ్యాడు. ప్రధాన నిందితురాలు సమీనా కోరిన మీదట ఈ నోట్లను ‘చూపించడానికి’ ఇచ్చినందుకు నిందితుడిగా మారాడు. ఇతడితో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన మరో ఇద్దరినీ నిందితులుగా చేర్చామని వెస్ట్‌జోన్ జేసీపీ ఏఆర్ శ్రీనివాస్ శనివారం ప్రకటించారు. అప్పులు చేసి వ్యాపారం... టోలిచౌకిలోని సెవెన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన సమీనా అలియాస్ రూహి 2019లో ఓ వ్యాపారం ప్రారంభించారు. దీనికోసం బంధువులు, స్నేహితులతో పాటు పరిచయస్తుల వద్దా కలిపి మొత్తం రూ.2 కోట్ల వరకు అప్పులు చేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. ఇటీవల అప్పులు ఇచ్చిన వారి నుంచి తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి పెరింగింది. దీని నుంచి బయటపడటానికి ఆమె తన వద్ద భారీగా డబ్బు ఉన్నట్లు ‘చూపించాలని’ పథకం వేశారు. అంత మొత్తం ఒక్క రోజుకు కూడా ఎవ్వరూ ఇవ్వరని తెలిసిన సమీనా టాయ్ కరెన్సీ వినియోగించాలని భావించింది. (చదవండి: అభ్యర్థి ఎంపికే కొంపముంచింది!) పరిచయస్తుల ద్వారా నిర్మాత నుంచి... ఈ విషయాన్ని సమీనా తనకు పరిచయస్తులైన రియల్టర్ డి.ధనావత్ రాజు, క్యాట్రింగ్ వ్యాపారి జి.సుదర్శన్లకు చెప్పింది. దీంతో వాళ్లు తమకు పరిచయస్తుడైన ఏఎస్ కిషోర్ సినీ రంగంలో ఉన్నారని చెప్పారు. ఆయన వద్ద షూటింగ్స్ సమయంలో వాడే టాయ్ కరెన్సీ ఉంటుందని వివరించారు. దీంతో ఆ కరెన్సీ తీసుకువచ్చి కథ నడపాలని భావించింది. ఈ ముగ్గురూ కిషోర్‌ను సంప్రదించడంతో ఆయన చిల్ట్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్న రూ.500, రూ.2 వేల నోట్లు రూ.2 కోట్ల విలువైనవి ఇచ్చారు. కొన్ని షార్ట్ ఫిల్ములు తీసిన కిషోర్ ఇటీవలే పెద్ద చిత్రం నిర్మించాలని భావిస్తున్నారు. నగదు ఉందని నమ్మించడానికే... ఈ టాయ్ కరెన్సీని తీసుకున్న సమీనా ఒక్కో బండిల్‌కు పైన, కింద అసలు నోట్ల కలర్ జిరాక్సు ప్రతులు ఉంచింది. వీటిని తన ఇంట్లో ఉంచి అప్పులు ఇచ్చిన వారికి నేరుగా, ఫొటోలు, వీడియో కాల్స్ ద్వారా చూపిస్తోంది. డబ్బు ఎక్కడకూ పోలేదని వారిని నమ్మించి ఒత్తిడి తగ్గించుకోవాలని ప్రయత్నించింది. షాహిద్‌నగర్‌కు చెందిన మహ్మద్ సోహెల్ నుంచి ఓ స్థిరాస్తి ఖరీదు చేస్తున్నట్లు సమీనా బిల్డప్ ఇచ్చింది. అతడికి ఫోన్ చేసి పిలిచిన ఆమె రూ.15 లక్షల టాయ్ కరెన్సీని ఓ పాలథీన్ బ్యాగ్‌లో వేసి చూపించాలని భావించింది. అయితే అతడు ఆ మొత్తం తీసుకుని వెళ్లిపోవడం, ఇంటికి వెళ్లాక తెరిచి చూడటంతో కథ అడ్డం తిరిగింది. నిందితులుగా మారిన నలుగురూ... సమీనా తనను మోసం చేసిందని భావించిన సోహైల్ దీనిపై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి సమీనాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సదరు టాయ్ కరెన్సీని అప్పులు ఇచ్చిన వారికి చూపించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో నిర్మాత కిషోర్ ఇచ్చాడని, దీనికి రాజ్, సుదర్శన్ సహకరించారని బయటపెట్టింది. దీంతో అధికారులు టాయ్ కరెన్సీ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆమెతో సహా నలుగురినీ అరెస్టు చేశారు. సమీనా ఈ టాయ్ కరెన్సీని చెలామణి చేయడా నికి ప్రయత్నించలేదని జేసీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. (చదవండి: Sahasra: బాల నటి భళా.. కుట్టి ) -
పుణె కరెన్సీ కేసులో హైదరాబాద్ లింకు !
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని పుణెలో వెలుగులోకి వచ్చిన భారీ టాయ్ కరెన్సీ కేసులో హైదరాబాద్ కోణం బయటపడింది. ఈ ముఠా టాయ్ అమెరికన్ డాలర్లను నగరం నుంచే ఖరీదు చేసినట్లు పుణె క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. దీంతో తదుపరి దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక బృందం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన సంస్థల్లో సిటీకి చెందినవీ ఉన్నాయా? అనే కోణంలోనూ ఆరా తీస్తోంది. పుణె పోలీసులతో పాటు మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ నెల 10న ఓ ఆపరేషన్ నిర్వహించారు. పుణెలోని విమంతల్ పోలీసుస్టేషన్ పరిధిలోని విమన్నగర్ సంజయ్ పార్క్ ఏరియాలో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్ షేక్ ఆలం గులాబ్ ఖాన్‌తో పాటు సునిల్ భద్రీనాథ్ శ్రద్ధ, రితేష్ రత్నాకర్, తుఫిల్ అహ్మద్ మహ్మద్ ఇషార్ ఖాన్, అబ్దుల్ ఘనీ రహ్మతుల్లా ఖాన్, అబ్దుల్ రెహ్మాన్ అబ్దుల్ ఘనీ ఖాన్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.87 కోట్ల విలువైన భారత్, అమెరికా టాయ్ కరెన్సీలు స్వాధీనం చేసుకున్నారు. పుణెలోని ఆర్మీ యూనిట్లో పని చేస్తున్న గులాబ్ ఖాన్ ఈ ముఠాకు సూత్రధారు అని మిలటరీ ఇంటెలిజెన్స్‌కు అందిన సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్లు పుణె క్రైమ్ బ్రాంచ్ ప్రకటించింది. ఈ టాయ్ కరెన్సీ కట్టలకు ముందు, వెనుక అసలు నోట్లను పొందుపరిచారు. ఇలా వివిధ డినామినేషన్స్‌లో ఉన్న రూ.2.09 లక్షలు కరెన్సీని వాడారు. ఈ కేసు దర్యాప్తు కోసం పుణె క్రైమ్ బ్రాంచ్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. న్యాయస్థానం అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే దేశవిదేశాల్లో ఉన్న అనేక సంస్థల నుంచి ఫండ్స్ ఇప్పిస్తామంటూ ట్రస్టీలను వీరు మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. భారీ స్థాయిలో నల్లధనం ఉన్న దాతలు, కంపెనీలు ఆ మొత్తాలను ఫండ్‌గా ఇస్తాయంటూ నమ్మబలికే వారనీ సమాచారం. ఈ కరెన్సీతో వీడియోలు చిత్రీకరించే వాళ్ళు. ప్రతి వీడియోలోనూ ఆ రోజు న్యూస్ పేపర్ కనిపించేలా చేసి తాజావని నమ్మించే వారు. పుణె క్రైమ్ బ్రాంచ్ పరిశీలించిన వీడియోల్లో కొన్ని ప్రైవేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీల పేర్లు ప్రస్తావించినట్లు తెలిసింది. రెండు బృందాలుగా.. తమకు కమీషన్ కావాలంటూ డిమాండ్ చేసి ఆ మొత్తం కాజేసేవారని, ఆపై ఎలాంటి ఫండ్ ఇప్పించకుండా మోసం చేసేవాళ్ళని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఈ గ్యాంగ్‌లోని సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి ఒకరి భారత్ కరెన్సీ, మరొకరు అమెరికన్ డాలర్లు ఫండ్స్‌గా ఇప్పిస్తామంటూ మోసం చేసేవారని క్రైమ్ బ్రాంచ్ తేల్చింది. గులాబ్ ఖాన్ ప్రధాన దళారీగా, మిగిలిన వారు డోనర్లుగా అవతారం ఎత్తి మోసాలకు పాల్పడేవాళ్లు. ఇలా కథలు చెప్పి, కరెన్సీ వీడియోలు చూపి ఇప్పటి వరకు 20–25 సంస్థల నుంచి అందినకాడికి దండుకున్నారని అనుమానిస్తోంది. దీనికోసం పుణేలోని సంజయ్ పార్క్ ఏరియాలో గత ఏడాది అక్టోబర్‌లో ఓ పాత బంగ్లాను అద్దెకు తీసుకున్నారు. ఇందులోనే ముఠాతో పాటు టాయ్ కరెన్సీ చిక్కింది. ఈ ముఠాను సోమవారం పుణే కోర్టులో హాజరుపరిచిన క్రైమ్ తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ నెల 20 వరకు కస్టడీలోకి తీసుకుంది. విచారణలో భాగంగా వీరికి ఈ టాయ్ కరెన్సీ ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టింది. ఫలితంగా ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ నుంచి భారత్ టాయ్ కరెన్సీ, హైదరాబాద్ నుంచి అమెరికన్ టాయ్ డాలర్లు ఖరీదు చేసినట్లు తేలింది. టాయ్ డాలర్లపై ఫోకస్ రూ.4.7 కోట్ల విలువైన ఈ టాయ్ డాలర్లను ఎందుకు తయారు చేశారనే దానిపై క్రైమ్ బ్రాంచ్ దృష్టి పెట్టింది. చిన్నారులు ఆడుకోవడానికి ఇలాంటి టాయ్ కరెన్సీ విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ స్థాయిలో ముద్రించరని క్రైమ్ బ్రాంచ్ అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ముద్రణ చేసిన వారికీ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయా? లేక డబ్బు కోసమే ఇలా చేశారా? అనే దానిపై దృష్టి పెట్టారు. ఈ సందేహాలు నివృతి చేసుకోవడానికి ఓ ప్రత్యేక బృందం మంగళవారం సిటీకి చేరుకుంది. మరోపక్క ఈ గ్యాంగ్ లీడర్ గులాబ్ ఖాన్ తాను హైదరాబాద్‌కు చెందిన నిజాం నవాబు వారసుడిని అంటూ అనేక మందికి చెప్పాడని, దానికి ఆధారంగా తమ బంగ్లా అంటూ కొన్ని ఫొటోలను చూపాడని క్రైమ్ బ్రాంచ్ తేల్చింది. -
బ్యాంకూ.. బొమ్మనోట్లు!
⇒ బొమ్మ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేయబోయిన ఓ వ్యక్తి ⇒ ఆర్బీఐ అని ఉండాల్సిన చోట చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ⇒ అనుమానంతో నోట్లను పరిశీలించిన బ్యాంకు అధికారులు ⇒ దేవదూత చెప్పిందంటూ నిందితుడి వాదన హైదరాబాద్: అక్కడా.. ఇక్కడా.. ఎందుకనుకున్నాడో ఏమో.. బొమ్మ కరెన్సీని మార్చడానికి బ్యాంకుకే వెళ్లాడో ఘనుడు. పెద్దమొత్తంలో డిపాజిట్ చేయబోయి.. బ్యాంకు అధికారులు అప్రమత్తమవ్వడంతో పోలీసులకి చిక్కాడు. అదేమంటే ‘దైవ దూత చెప్పింది.. తాను పాటించా’నంటూ పోలీసులకూ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. మల్కా జిగిరి అలహాబాద్ బ్యాంక్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన అలజడి రేపింది. బేగంబజార్‌లో కొని... బ్యాంకులో డిపాజిట్! మౌలాలీ ప్రగతినగర్‌కు చెందిన షేక్ యూసుఫ్ (40) ఎస్పీనగర్ ప్రాంతంలో స్టేషనరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరికి 5 దుకాణాలతో కూడిన ఇల్లు ఉన్న ప్పటికీ... భార్య, కుటుంబీకులకు దూరమయ్యాడు. ప్రతి నెలా అన్నదమ్ములు వచ్చి దుకాణాల అద్దెలు వసూలు చేసుకువెళతారు. ఇటీవల తీవ్ర ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్న యూసుఫ్ మానసిక స్థితి దెబ్బతింది. తన స్టేషనరీ దుకా ణంలో విక్రయించేందుకు బేగంబజార్ నుంచి బొమ్మ కరెన్సీ నోట్లను యూసుఫ్ కొనుగోలు చేశాడు. రూ.9.9 లక్షలకు సరిపోయే రూ.100, రూ.500, రూ.2 వేల బొమ్మ కరెన్సీ బండిల్స్‌ను యూసుఫ్ మంగళవారం గాయత్రీనగర్‌లోని అలహా బాద్ బ్యాంక్‌కు తీసుకెళ్లాడు. తన ఖాతాలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు ఓచర్ రాసి క్యాషియర్‌కు ఇచ్చాడు. సందేహం వచ్చిన క్యాషియర్ వాటిని పరిశీలిం చగా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండటం, నాణ్యత తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. డిపాజిట్ చేస్తే కష్టాలు తీరతాయని...: క్యాషియర్ ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్ రవికాంత్ గైక్వాడ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశా రు. టాయ్ కరెన్సీతో పాటు యూసుఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మల్కాజ్‌గిరిలో నకిలీ నోట్లు దొరికాయంటూ చానళ్లలో ప్రచారం జరగడం తో రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు రంగంలోకి దిగారు. యూసుఫ్ ను విచారించారు. తనకు దేవదూత కలలో కనిపించి, బొమ్మకరెన్సీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే తన కష్టాలు తీరతాయంటూ బోధ చేసిందని యూసుఫ్ చెప్పుకొచ్చాడు. దీంతో అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని భావిస్తున్న పోలీసులు కేసును ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంతో కంగుతిన్న స్టేషనరీ దుకాణ నిర్వాహకులు కొందరు టాయ్ కరెన్సీని పిల్లలకు అమ్మే ముందు దానిపై పెన్నుతో అడ్డంగా గీతగీసి ఇవ్వడం గమనార్హం.