
Tollywood Movie Producer AS Kishore Arrested In Toy Currency Case Hyderabad
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన టాయ్ కరెన్సీ కేసులో చోటా నిర్మాత ఏఎస్ కిషోర్ బుక్కయ్యాడు. ప్రధాన నిందితురాలు సమీనా కోరిన మీదట ఈ నోట్లను ‘చూపించడానికి’ ఇచ్చినందుకు నిందితుడిగా మారాడు. ఇతడితో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన మరో ఇద్దరినీ నిందితులుగా చేర్చామని వెస్ట్‌జోన్ జేసీపీ ఏఆర్ శ్రీనివాస్ శనివారం ప్రకటించారు.
అప్పులు చేసి వ్యాపారం...
టోలిచౌకిలోని సెవెన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన సమీనా అలియాస్ రూహి 2019లో ఓ వ్యాపారం ప్రారంభించారు. దీనికోసం బంధువులు, స్నేహితులతో పాటు పరిచయస్తుల వద్దా కలిపి మొత్తం రూ.2 కోట్ల వరకు అప్పులు చేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. ఇటీవల అప్పులు ఇచ్చిన వారి నుంచి తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి పెరింగింది. దీని నుంచి బయటపడటానికి ఆమె తన వద్ద భారీగా డబ్బు ఉన్నట్లు ‘చూపించాలని’ పథకం వేశారు. అంత మొత్తం ఒక్క రోజుకు కూడా ఎవ్వరూ ఇవ్వరని తెలిసిన సమీనా టాయ్ కరెన్సీ వినియోగించాలని భావించింది.
(చదవండి: అభ్యర్థి ఎంపికే కొంపముంచింది!)
పరిచయస్తుల ద్వారా నిర్మాత నుంచి...
ఈ విషయాన్ని సమీనా తనకు పరిచయస్తులైన రియల్టర్ డి.ధనావత్ రాజు, క్యాట్రింగ్ వ్యాపారి జి.సుదర్శన్‌లకు చెప్పింది. దీంతో వాళ్లు తమకు పరిచయస్తుడైన ఏఎస్ కిషోర్ సినీ రంగంలో ఉన్నారని చెప్పారు. ఆయన వద్ద షూటింగ్స్ సమయంలో వాడే టాయ్ కరెన్సీ ఉంటుందని వివరించారు. దీంతో ఆ కరెన్సీ తీసుకువచ్చి కథ నడపాలని భావించింది. ఈ ముగ్గురూ కిషోర్‌ను సంప్రదించడంతో ఆయన చిల్ట్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్న రూ.500, రూ.2 వేల నోట్లు రూ.2 కోట్ల విలువైనవి ఇచ్చారు. కొన్ని షార్ట్ ఫిల్ములు తీసిన కిషోర్ ఇటీవలే పెద్ద చిత్రం నిర్మించాలని భావిస్తున్నారు.
నగదు ఉందని నమ్మించడానికే...
ఈ టాయ్ కరెన్సీని తీసుకున్న సమీనా ఒక్కో బండిల్‌కు పైన, కింద అసలు నోట్ల కలర్ జిరాక్సు ప్రతులు ఉంచింది. వీటిని తన ఇంట్లో ఉంచి అప్పులు ఇచ్చిన వారికి నేరుగా, ఫొటోలు, వీడియో కాల్స్ ద్వారా చూపిస్తోంది. డబ్బు ఎక్కడకూ పోలేదని వారిని నమ్మించి ఒత్తిడి తగ్గించుకోవాలని ప్రయత్నించింది. షాహిద్‌నగర్‌కు చెందిన మహ్మద్ సోహెల్ నుంచి ఓ స్థిరాస్తి ఖరీదు చేస్తున్నట్లు సమీనా బిల్డప్ ఇచ్చింది. అతడికి ఫోన్ చేసి పిలిచిన ఆమె రూ.15 లక్షల టాయ్ కరెన్సీని ఓ పాలథీన్ బ్యాగ్‌లో వేసి చూపించాలని భావించింది. అయితే అతడు ఆ మొత్తం తీసుకుని వెళ్లిపోవడం, ఇంటికి వెళ్లాక తెరిచి చూడటంతో కథ అడ్డం తిరిగింది.
నిందితులుగా మారిన నలుగురూ...
సమీనా తనను మోసం చేసిందని భావించిన సోహైల్ దీనిపై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి సమీనాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సదరు టాయ్ కరెన్సీని అప్పులు ఇచ్చిన వారికి చూపించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో నిర్మాత కిషోర్ ఇచ్చాడని, దీనికి రాజ్, సుదర్శన్ సహకరించారని బయటపెట్టింది. దీంతో అధికారులు టాయ్ కరెన్సీ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆమెతో సహా నలుగురినీ అరెస్టు చేశారు. సమీనా ఈ టాయ్ కరెన్సీని చెలామణి చేయడా నికి ప్రయత్నించలేదని జేసీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
(చదవండి: Sahasra: బాల నటి భళా.. కుట్టి )
Comments
Please login to add a commentAdd a comment