జాత్యహంకారం ఆనవాళ్లు
ఏళ్లు గడుస్తున్నాయి...తరాలు మారుతున్నాయి. కానీ, అమెరికాలో నల్లజాతి పౌరుల వేదన ఉపశమించడంలేదు. వారి క్షతగాత్ర హృదయాలు సాధారణ స్థితికి చేరడం లేదు. రెండురోజుల వ్యవధిలో అక్కడ జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు ఆ గాయాలను మళ్లీ రేపాయి. వారిలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం మరోసారి భళ్లున బద్దలయింది. తొలి ఘటన ఒహాయోలోని క్లీవ్‌లాండ్ సిటీలో జరిగింది. అక్కడి పోలీసులు ఒక ఆటస్థలంలో బొమ్మ తుపాకితో ఆడుకుంటున్న పన్నెండేళ్ల ఆఫ్రికన్ అమెరికన్ బాలుడు టామిర్ రైస్‌ను కాల్చిచంపారు. మిస్సోరిలోని ఫెర్గ్యుసన్ సిటీలో మూడు నెలలక్రితం నిరాయుధుడైన పద్దెనిమిదేళ్ల నల్లజాతి యువకుడు మైకేల్ బ్రౌన్‌ను ఒక కానిస్టేబుల్ కాల్చిచంపిన ఘటనపై తీర్పు వెలువడే ముందురోజే ఇది చోటుచేసుకుంది. తీర్పు నల్లజాతి పౌరులకు ఆగ్రహం కలిగించే పక్షంలో హింసాత్మక ఘటనలు జరగవచ్చునన్న ఉద్దేశంతో పోలీసు బలగాలను మోహరించిన సమయంలోనే టామిర్ రైస్ అకారణంగా, అన్యాయంగా బలైపోయాడు. ఆ ఉదంతం ఆగ్రహావేశాలను రగిలిస్తున్న క్షణాల్లోనే ఫెర్గ్యుసన్ ఘటనలో కానిస్టేబుల్ నిర్దోషి అని తీర్పు వెలువడింది. ఫలితంగా షికాగో, లాస్ఏంజెలస్, న్యూయార్క్ నగరాల్లో, మిస్సోరి రాష్ట్రంలో నల్లజాతి పౌరులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపారు. పలుచోట్ల భవనాలకు, కార్లకు నిప్పంటించారు. అనేక దుకాణాల్లో లూటీలు జరిగాయి. ఒక సమాజాన్ని ఆధునికమైన, నాగరికమైన సమాజంగా పరిగణించడానికి అక్కడున్న ఆకాశాన్నంటే భవంతులు, వినియోగంలో ఉండే అత్యాధునిక ఉపకరణాలు గీటురాయి కాదు. తోటి మనిషిని గౌరవించేపాటి కనీస విలువను ఇంకా నేర్చుకోని సమాజం నాగరికమైనదని అనిపించుకోలేదు.
క్లీవ్‌లాండ్ ఉదంతంలో అక్కడి పోలీసుల తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడి ప్లేగ్రౌండ్‌లో ఒక బాలుడు తుపాకితో ఆడుకుంటున్నాడన్న ఫిర్యాదుతో పోలీసులు అక్కడికెళ్లారు. అతన్ని చేతులు పెకైత్తి లొంగిపొమ్మని హెచ్చరించారు. ఆ పిల్లవాడు పోలీసులను చూసి దూషించలేదు. బెదిరించలేదు. అప్పటికే తన జేబులో ఉన్న తుపాకిని బయటకు తీయబోయాడంతే! వెనువెంటనే ఒక కానిస్టేబుల్ బాలుడిపైకి గుళ్లవర్షం కురిపించాడు. బాలుడి ప్రాణం పోయాక సోదా చేస్తే అది బొమ్మ తుపాకి అని తేలింది. బాలుడిపై ఫోన్లో ఫిర్యాదు చేసినవారు అది బొమ్మ తుపాకి అయివుండొచ్చని కూడా పోలీసులకు చెప్పినట్టు ఇప్పుడు వెల్లడైంది. ఆ బాలుడు నల్లజాతికి చెందినవాడు కాకపోతే బహుశా ఆ కానిస్టేబుల్ వేరే పద్ధతిలో వ్యవహరించేవాడేమో! మూడు నెలలనాటి ఫెర్గ్యుసన్ ఘటన కూడా ఇంతే చిత్రమైనది. మైకేల్ బ్రౌన్ ఫుట్‌పాత్‌పైన కాక రోడ్డుమీద నడిచాడు. ఎలాంటి ఆయుధమూ లేకుండా సంచరిస్తున్న అతని గురించి ఫిర్యాదు వచ్చీరాగానే పోలీసులు తుపాకులు చుట్టుముట్టి హడావుడి చేశారు. మైకేల్ బ్రౌన్ కాసేపు వాదనకు దిగాడుగానీ చివరకు చేతులు రెండూ తలపై పెట్టుకుని లొంగుబాటును ప్రకటించబోయాడు. ఈలోగానే కానిస్టేబుల్ అతన్ని కాల్చిచంపేశాడు. ఈ విషయంలో కానిస్టేబుల్‌పై ఎలాంటి నేరారోపణ చేయకుండా విడిచిపెడుతున్నట్టు సెయింట్ లూయీ కౌంటీ కోర్టు తీర్పు వెలువరించింది. ‘నిరాశకు గురైనవారెవరైనా, ఏమైనా అనొచ్చు. కానీ, నేర న్యాయవ్యవస్థలో నిర్ణయాలు శాస్త్రీయమైన, విశ్వసనీయమైన సాక్ష్యాల ఆధారంగానే ఉంటాయి’ అని ప్రాసిక్యూటర్ మెకాలక్ అంటున్నాడు. నిరాయుధుడిగా, ఆ క్షణం వరకూ ఎవరికీ హాని తలపెట్టకుండా ఉన్న యువకుణ్ణి కాల్చిచంపడంలో తప్పేమీ లేదన్న నిర్ణయానికి కారణమైన ఆ సాక్ష్యాల్లోని శాస్త్రీయత, విశ్వసనీయత ఏపాటి? జరిగిన హత్య నేరం కాదని చెప్పడానికి వందరోజులు పట్టిందన్నమాట!
అమెరికా సమాజంలో ఇంకా అంతర్గతంగా, బాహాటంగా కొనసాగుతున్న జాత్యహంకారానికి ఈ రెండు ఘటనలూ ఆనవాళ్లు. అప్పుడు బ్రౌన్ అయినా, ఇప్పుడు టామిర్ రైస్ అయినా ఆ అహంకారానికి బలైపోయారు. నల్లవాళ్లంతా నేరస్తులే కావొచ్చునని, వారిపై చిన్నపాటి అనుమానం కలిగినా ప్రాణాలు తీయడంతో సహా ఏమైనా చేయొచ్చునని పోలీసుల శిక్షణలో నేరుగా ఉండకపోవచ్చు. కానీ, పోలీసు వ్యవస్థలో, న్యాయవ్యవస్థలో ఉండే శ్వేతజాతీయుల్లో నల్లజాతీయులపై నరనరానా వ్యతిరేకత జీర్ణించుకొని ఉన్నదని పదే పదే రుజువవుతున్నది. దీన్ని సరిదిద్దలేని అక్కడి వ్యవస్థ ఈ నేరం కొనసాగడానికి తోడ్పడుతున్నది. నల్లజాతీయులు ప్రతి ముగ్గురిలో ఒకరు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారయినా జైలు కెళ్లడమో, పోలీస్‌స్టేషన్ మెట్లెక్కడమో, కేసుల్లో చిక్కుకోవడమో తప్పడం లేదని ఒక సర్వే చెబుతున్నది. బ్రౌన్కూ, టామిర్ రైస్‌కూ మధ్య ఈ మూడు నెలలకాలంలో పోలీసుల చేతుల్లో మరణించిన నల్లజాతి పౌరులు 20కి మించి ఉన్నారని నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడే సంస్థ అంటున్నది. తమ కుమారుడి మరణానికి తల్లడిల్లుతున్న నల్లజాతి హృదయావేదనను అర్ధం చేసుకోగలం గానీ హింసాకాండకు పాల్పడి అతని స్మృతికి కళంకం తేవొద్దని బ్రౌన్ తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. దేశంపట్లా, సమాజంపట్లా వారికున్నపాటి బాధ్యతనైనా అధికార యంత్రాంగం చూపలేకపోతే భవిష్యత్తరాలకు అది అన్యాయం చేసినట్టే అవుతుంది. అమెరికాలో సమాన హక్కుల కోసం ఉద్యమించిన మార్టిన్ లూధర్‌కింగ్ జూనియర్ తన చారిత్రక ప్రసంగంలో ‘నాకున్న నలుగురు చిన్నారుల్నీ వారి శరీరం రంగును బట్టికాక...వారి ప్రవర్తన సరళినిబట్టి నిర్ణయించే రోజొకటి వస్తుందన్నది నా స్వప్నం. అది నిజమయ్యే రోజొకటి వస్తుందని నా ఆశ’ అన్నాడు. 1963 నాటి మార్టిన్ లూధర్‌కింగ్ కలలుగన్న స్వప్నానికి తాను ఎంత దూరంలో ఉన్నదీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది ఇప్పుడు అమెరికా సమాజమే.