షేర్లపై రుణమా? వద్దులెండి..!
మీరో ఇన్వెస్టరు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. మీ పోర్టుఫోలియోలో చాలా కంపెనీల షేర్లున్నాయి. కాకపోతే మీకు అర్జెంటుగా డబ్బు అవసరమొచ్చింది. మీ దగ్గరున్న షేర్లను బ్యాంకు దగ్గరో, ఆర్థిక సంస్థ దగ్గరో తనఖా పెట్టి డబ్బు తీసుకుందామనుకున్నారు. అది లాభదాయకమేనా? అలా తీసుకోవటం మంచి నిర్ణయమేనా? మార్కెట్ నిపుణుల మాటల్లో చెప్పాలంటే మాత్రం... అది సరైన నిర్ణయం కాదు. దీనివల్ల లాభపడే అవకాశం తక్కువ కనక ఈమార్గాన్ని ఎంచుకోవటం సరికాదనేది వారి సూచన.
* షేర్ల విలువలో 50 శాతానికి మించి రుణమివ్వరు
* వడ్డీ, ప్రాసెసింగ్ చార్జీలు, పెనాల్టీలూ ఎక్కువే
* లార్జ్ క్యాప్ షేర్లకు మాత్రమే పలు బ్యాంకుల అనుమతి
* మార్కెట్ హెచ్చుతగ్గుల దృష్ట్యా వద్దంటున్న నిపుణులు
ఏ బ్యాంకు కూడా షేర్లను తనఖా పెడితే వాటి విలువలో 50 శాతం కన్నా ఎక్కువ రుణాన్నివ్వటం లేదు. దీనికితోడు ఈ రుణంపై వడ్డీ, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువే. పెపైచ్చు వాయిదా చెల్లింపులో ఆలస్యమైతే చెల్లించాల్సిన అపరాధ రుసుము కూడా అధికం.
దీనిపై ట్రాక్ టు ట్రేడ్ సీఈఓ రమణమూర్తి మాట్లాడుతూ... ‘‘మేమైతే ఎవరైనా వ్యక్తులు షేర్లపై రుణం తీసుకుంటామని వస్తే వద్దనే సలహా ఇస్తాం. ఒకవేళ తన అవసరం గురించి తనకు బాగా తెలిసి... దీన్లోని రిస్కులపై కూడా అవగాహన ఉంటే సరేనంటాం. రుణం తీసుకున్న వ్యక్తికి అనుకున్న సమయంలోగా తిరిగి చెల్లించే సామర్థ్యం కచ్చితంగా ఉంటే తప్ప ఇలా రుణం తీసుకోవటాన్ని ప్రోత్సహించం. అధిక వడ్డీలకు తోడు... మంచి విలువలున్న ప్రధాన కంపెనీల షేర్లపై... అదీ తక్కువ మొత్తంలోనే రుణం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని వివరించారు. షేర్లపై రుణం తీసుకోవద్దని చెప్పేవారు... అందుకు చూపిస్తున్న కారణాలు చూస్తే...
50 శాతం కన్నా తక్కువ రుణం...
షేర్ల ధరలు తరచూ మారుతాయి. హెచ్చుతగ్గులు అధికం. ఒక్కరోజులో దారుణంగా పడిపోయే సందర్భాలూ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని... బ్యాంకులు మీ షేర్ల విలువలో 50%కి మించి రుణమివ్వవు. దీనర్థం మీకు గనక రూ.2 లక్షల రుణం కావాలనుకుంటే... మీ దగ్గర రూ.4 లక్షలకు మించిన షేర్లుండాలి. ‘‘సాధారణంగా బ్యాంకులు తాము అనుమతించిన జాబితాలో ఉన్న షేర్లకే రుణాన్నిస్తాయి.
బ్యాంకు పేర్కొన్న షేర్లు మీ పోర్టుఫోలియోలో లేకుంటే బ్యాంకులు మీ రుణాన్ని తిరస్కరించే అవకాశమూ ఉంది. ఎందుకంటే బ్యాంకులు ఆ షేర్లను త గిన హామీగా పరిగణించలేవు. కాని పక్షంలో రుణ మొత్తాన్ని మరింత తగ్గించే అవకాశం కూడా ఉంటుంది’’ అని రమణమూర్తి వివరించారు.
ఖరీదైన వ్యవహారం...
షేర్లను తనఖా పెట్టి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువే. దీంతో పాటు ప్రాసెసింగ్ చార్జీలు, వాయిదాలు సకాలంలో చెల్లించకపోతే వేసే అపరాధ రుసుం... ఇవన్నీ ఎక్కువే. ‘‘కొన్ని సందర్భాల్లో రుణ వాయిదాలు ఆలస్యమైతే చెల్లించాల్సిన అపరాధ రుసుం వార్షిక రేటు 24 శాతం వరకూ ఉండొచ్చు. అంటే నెలకు 2 శాతం. అధిక చార్జీలు, తక్కువ రుణ మొత్తం... ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ రుణం చాలా ఖరీదైనదని, దీనిబదులు పర్సనల్ లోన్ నయమని అనిపించకమానదు’’ అని మూర్తి వివరించారు.
కొన్ని సందర్భాల్లో షేరు ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది కనక రుణ మొత్తం కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. వారాంతంలో గనక మీ షేర్ల ధరలు బాగా పడిపోయి, మీ రుణ మొత్తం దానికన్నా ఎక్కువగా ఉంటే... తేడాను మీరు సెటిల్ చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు రూ.10 లక్షల విలువైన షేర్లు తనఖా పెట్టి రూ.5 లక్షల రుణం తీసుకున్నారు. మీరు రుణం తీసుకున్నాక ఆ షేర్ల విలువ 20 శాతం పడిపోయింది. అంటే రూ.8 లక్షలకు చేరింది. అప్పుడు మీ రుణ అర్హత రూ.4 లక్షలే కనక... మీరు అప్పటికే రూ.5 లక్షలు తీసుకున్నారు కనక ఆ తేడా మొత్తం రూ.లక్షను బ్యాంకుతో సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ మేరకు మరిన్ని షేర్లు తనఖా పెట్టడ మో, లేక కొంత రుణాన్ని తీర్చేయటమో చేయాలి. ‘‘మార్కెట్లు బాగా పెరుగుతున్న తరుణంలో షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకోవటమనేది మంచి వ్యూహంగానే కనిపిస్తుంది. కానీ తగ్గుతున్న మార్కెట్లో ఇలాంటివి కలిసిరావు. ఎందుకంటే షేర్ల ధరలు తగ్గినపుడు మార్జిన్ మొత్తాన్ని చెల్లించాల్సి రావటం, కొన్ని సందర్భాల్లో తనఖా పెట్టిన షేర్లను కోల్పోవటం వంటివి కూడా జరుగుతాయి’’ అని మూర్తి వివరించారు.
- సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
పలు రకాల షేర్లు తనఖా పెడితే...
కొన్ని బ్యాంకులు తప్ప చాలా బ్యాంకులు... ఒకే కంపెనీకి చెందినవి కాకుండా వివిధ రకాల షేర్లు తనఖా పెడితేనే రుణాన్నిస్తాయి. ఎందుకంటే ఒకటో రెండో కంపెనీల షేర్లయితే రిస్కు ఎక్కువ. ఆ రిస్కును తగ్గించుకోవటానికి ఈ వ్యూహాన్ని అనుసరిస్తాయి. అందుకని ఈ రుణానికి దరఖాస్తు చేసే ముందు కింది అంశాలను సమీక్షించుకోవాలి...
* మీ పోర్టుఫోలియోలో వివిధ రకాల షేర్లుండాలి
* అవి ఆర్థికంగా బాగున్న కంపెనీలవి అయి ఉండాలి.
* మిడ్క్యాప్లలో రిస్కు ఎక్కువ కనక అధిక షేర్లు లార్జ్క్యాప్వి అయి ఉండాలి. అంటే పెద్ద కంపెనీలవి.
* రుణాలివ్వటానికి బ్యాంకులు షేర్లకన్నా భౌతిక ఆస్తులకే ప్రాధాన్యమిస్తాయి. రియల్ ఎస్టేట్ ఆస్తుల విషయంలో వాటి విలువలో 65 శాతం వరకూ రుణమిస్తాయి. ఎందుకంటే షేర్ల మాదిరి వాటి ధరల్లో అధిక హెచ్చుతగ్గులుండవు. మెల్లగా పెరుగుతూనే ఉంటాయి.
ఎన్బీఎఫ్సీ అనుబంధ సంస్థలున్న కొందరు స్టాక్ బ్రోకర్లు మాత్రం షేర్లపై తక్కువ వడ్డీకి రుణాలిస్తారు. అయితే పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేసే ప్రీమియం క్లయింట్లకే దీన్ని వర్తింపజేస్తారు. ఎందుకంటే వీరి ద్వారా సదరు కంపెనీలకు వచ్చే బ్రోకరేజీ ఎక్కువ కనక. అందుకే తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. కాకపోతే ఆ షేర్ల ధరలు తగ్గుతున్నపుడు క్లయింట్లను హెచ్చరించటం.. అయినా వారు రుణం తీర్చకపోతే మార్కెట్లో విక్రయించటం చేస్తుంటారు.