ట్రాఫిక్ పోలీసుల కృషి అభినందనీయం - హీరో సందీప్‌కిషన్
అబిడ్స్ : సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమని సీని హీరో సందీప్ కిషన్ అన్నారు. శనివారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మీటర్ లేకుండా ఆటోలను నడుపుతున్న 300 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సందీప్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చొరవతో గతంలో కంటే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. నగరంలోని రోడ్లపై వాహనం నడిపే సమయంలో బ్రేక్ వే యాలంటేనే భయపడతానన్నారు. మద్యం తాగి వాహనం నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు అండగా తమవంతుగా వలంటీర్‌గా వాహనదారులకు అవగాహన కల్పిస్తానన్నారు. ప్రముఖ సినీ కెమెరామెన్ చోటా కె. నాయుడు మాట్లాడుతూ...
మనిషి ప్రాణం ఎంతో విలువైందని మద్యం తాగి వాహనం నడిపి తల్లిదండ్రులకు అప్రతిష్టపాలు చేయవద్దన్నారు. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషికి తనవంతుగా ట్రాఫిక్‌పై ఫిల్మ్ డాక్యుమెంటరీని తీస్తానన్నారు. ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ మాట్లాడుతూ...ప్రస్తుతం డ్రంకన్ డ్రైవ్, ఓవర్ లోడింగ్, స్పీడ్ డ్రైవ్ వంటివి పూర్తిగా తగ్గాయన్నారు. వాహనచోదకులలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టామన్నారు.
నగరంలో 48 లక్షల వాహనాలు ఉండగా అందులో 25 లక్షల వాహనదారులకే డ్రైవింగ్ లెసైన్స్‌లు ఉన్నాయన్నారు. ఇప్పటికే హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నందున లక్షా ముప్పైవేల కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటి వరకు 100 ఆటోలను సీజ్ చేశామన్నారు. వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుంకర సత్యనారాయణ, టీటీఐ రిజర్డ్వ్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.