ఇక ‘యాక్సిడెంట్ ఫ్రీ’ రహదారులు!
ప్రయోగాత్మకంగా బీజాపూర్ హైవే ఎంపిక
హైదరాబాద్: ప్రమాదాలను గణనీయంగా తగ్గించే తరహాలో రహదారుల నిర్మాణం.. వాటిపై నిరంతరం పోలీస్ పెట్రోలింగ్.. ప్రమాదం జరిగితే నిమిషాల్లో ఘటనాస్థలికి అంబులెన్సులు.. మెరుగైన ప్రాథమిక చికిత్స కోసం అక్కడక్కడా అత్యవసర వైద్యం అందించే ట్రామాకేర్ సెంటర్లు.. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపించే రహదారుల నిర్వహణ వ్యవస్థ ఇది. ఇప్పుడు ప్రయోగాత్మకంగా తెలంగాణలో ఓ ప్రధాన రహదారిని ఈ తరహాలో అభివృద్ధి చేసే పని మొదలైంది.
124 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్-బీజాపూర్ హైవేని ఇదే విధంగా రూపొందించే పనికి రోడ్లు, భవనాల విభాగం శ్రీకారం చుట్టింది. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ రహదారికి ఆధునిక హంగులు అద్దనున్నారు. ఏడాదిన్నరలో దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా మరిన్ని ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తారు.