బస్సుల్లో ప్యానిక్ బటన్ తప్పనిసరి
న్యూఢిల్లీ: మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రజా రవాణా బస్సుల్లో ప్యానిక్ బటన్, సీసీ కెమెరా, వెహికల్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ బుధవారం చెప్పారు. వీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే నిబంధనలతో జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ‘నిర్భయ’ ఉదంతం తర్వాత మహిళ రక్షణ కోసం బస్సుల్లో ప్యానిక్ బటన్, సీసీ కెమెరా, జీపీఎస్ పరిజ్ఞానం కలిగిన వెహికల్ ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
రాజస్తాన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన పది లగ్జరీ, పది ఆర్డినరీ బస్సుల్లో ప్యానిక్ బటన్లు, సీసీ కెమెరాల వినియోగానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. తాజాగా నోటిఫికేషన్ ప్రకారం 23 సీట్ల కంటే ఎక్కువ సామర్థ్యమున్న ప్రజారవాణా బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను జీపీఎస్‌తో అనుసంధానిస్తారు. వీటిని స్థానికపోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు. బస్సులో అనుకోని సంఘటన జరిగినట్లయితే అందులోని మహిళలు వెంటనే ఈ ప్యానిక్ బట్‌ను నొక్కొచ్చు. జీపీఎస్ ద్వారా సమాచారం దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు చేరుతుంది. ఒకసారి ఎమర్జెన్సీ సిగ్నల్ వెళ్లిన తర్వాత సీసీ కెమెరాలు బస్సులోని సంఘటనను సెంట్రల్ కంట్రోల్ రూమ్‌కు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేరవేస్తాయి.