హజ్ యాత్రకు ఏర్పాట్లు కట్టుదిట్టం చేయండి
అధికారులకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశం
హైదరాబాద్: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు సౌకర్యాలు కల్పించడానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. హజ్ యాత్ర ఏర్పాట్ల కోసం తెలంగాణ హజ్ కమిటీకి త్వరలో రూ.2 కోట్ల నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది యాత్రికుల నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను వసూలు చేయడం లేదన్నారు. యాత్రికులకు ఏ చిన్న అసౌకర్యం కలగడానికి తావులేదన్నారు. యాత్రకు బయలుదేరే యాత్రికుల బస కోసం నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో శుక్రవారం ప్రారంభమైన హజ్ క్యాంప్‌ను ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన హజ్ టర్మినల్‌ను సందర్శించారు.
రేపు బయలు దేరనున్న తొలి ఫ్లైట్: ఈ ఏడాది హజ్ తొలి ఫ్లైట్ 349 మంది యాత్రికులతో ఆదివారం ఉదయం 12 గంటలకు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మక్కాకు బయలుదేరి వెళ్లనుంది. అధికారుల సూచనల మేరకు యాత్రికులు యాత్రకు బయలుదేరడానికి 48 గంటల ముందు హజ్ క్యాంప్‌కు రిపోర్టు చేసేందుకు తరలివస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది యాత్రికులు తెలంగాణ హజ్ కమిటీ నేతృత్వంలో హజ్ యాత్రకు వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఈనెల 28న వెళ్లనున్న యాత్రికుల చివరి ఫ్లైట్‌తో క్యాంప్ ముగియనుంది.