treatment failure
-
ముక్కు నొప్పితో ఆసుపత్రికి.. వైద్యం వికటించి వివాహిత మృతి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దాస్పత్రిలో ఓ మహిళ ముక్కుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించిన బంధువులు, అంతటితో ఆగకుండా మృతురాలిని ఉంచిన ఐసీయూ అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి బంధువుల కథనం ప్రకారం... ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోటకు చెందిన వెంకటలక్ష్మి, ముత్తయ్య భార్యాభర్తలు. వెంకటలక్ష్మి25)కి ముక్కులో గడ్డ ఏర్పడటంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రాగా పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో ఈనెల 6వ తేదీన ఆస్పత్రిలో చేర్పించగా మంగళవారం ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో ఆమె ముక్కుకు ఆపరేషన్ చేస్తుండగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడింది. అయితే, అంత వరకు బాగానే ఉన్న వెంకటలక్ష్మి మృతి చెందినట్లు తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వీరి స్వగ్రామమైన పుట్టకోటతో పాటు మృతురాలి స్వగ్రామమైన తిరుమలాయపాలెం నుండి పెద్దసంఖ్యలో బంధువులు చేరుకోగా, న్యూడెమెక్రసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన మృతురాలి బంధువులు, వివిధ పార్టీల నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుడు సరిగా పట్టించుకోలేదని, మత్తుమందు ఎక్కువగా ఇవ్వడం వల్లే వెంకటలక్ష్మి మృతి చెందిందని ఆరోపించారు. ఆందోళన ఉధృతం కావటంతో వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ల సిబ్బంది భారీగా మొహరించారు. అంతే కాకుండా ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు చేరుకుని మృతురాలి బంధువులకు నచ్చచెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నారు. చివరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ బి.శ్రీనివాసరావు, ఏసీపీ ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు వెంకటలక్ష్మి బంధువులతో చర్చించి కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడమే కాక ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాత్రి ఆందోళన విరమించారు. -
ఉసురు తీసిన ఆపరేషన్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోయాయని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. సిరిసిల్లలోని గణేష్నగర్కు చెందిన గాజుల కల్పన (24) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం చేరింది. డాక్టర్ ఆపరేషన్ చేయగా.. శుక్రవారం జ్వరం వచ్చి మతిస్థిమితం కోల్పోయింది. డాక్టర్ మళ్లీ వైద్యం చేస్తుండగానే అర్ధరాత్రి మరణించింది. కల్పనకు రెండేళ్ల బాబు శివాజీ, ఆరు నెలల పాప హిమశ్రీ ఉన్నారు. అలాగే.. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన మాలోతు శీల (34) పైల్స్ సమస్యతో బాధపడుతూ గురువారం అదే ఆసుపత్రిలో చేరింది. ఆమెకూ ఆపరేషన్ చేశారు. శీల కూడా అస్వస్థతకు గురవడంతో డాక్టర్ ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి శుక్రవారం అర్ధరాత్రి పంపించారు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే సరికి శీల మరణించింది. శీలకు ఇద్దరు కూతుళ్లు వాణీ (14), లావణ్య (10), కొడుకు లక్పతి (7) ఉన్నారు. ఒకే ఆసుపత్రిలో ఇద్దరు మరణించడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయని మృతుల బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు. -
ఆపరేషన్ వికటించి రోగి మృతి!
మహబూబాబాద్: వరంగల్ జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందాడు. ఆపరేషన్ వికటించడం వల్లే మృతి చెందాడని రోగి బంధువులు ఆరోపిస్తుండగా, గుండెపోటుతో మృతి చెందినట్టు చికిత్స అందించిన వైద్యుడు చెప్పుతున్నారు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల శివారు కొల్లగుంట తండాకు చెందిన భూక్యా సక్రు (60) శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికు వెళ్లాడు. ఆదివారం ఉదయం అతడికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. శస్త్రచికిత్స చేసేందుకు ముందు ముక్కుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అది వికటించి మృతి చెందినట్టు సక్రు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, వైద్యుడు మాత్రం... ఆపరేషన్ సమయంలో ఆకస్మికంగా గుండెపోటు వచ్చిందని, తమ వంతు ప్రయత్నం చేసిన తర్వాత ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా రోగి మృతి చెందినట్టు తెలిపారు.