సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోయాయని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. సిరిసిల్లలోని గణేష్‌నగర్‌కు చెందిన గాజుల కల్పన (24) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం చేరింది. డాక్టర్ ఆపరేషన్ చేయగా.. శుక్రవారం జ్వరం వచ్చి మతిస్థిమితం కోల్పోయింది. డాక్టర్ మళ్లీ వైద్యం చేస్తుండగానే అర్ధరాత్రి మరణించింది. కల్పనకు రెండేళ్ల బాబు శివాజీ, ఆరు నెలల పాప హిమశ్రీ ఉన్నారు.
అలాగే.. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన మాలోతు శీల (34) పైల్స్ సమస్యతో బాధపడుతూ గురువారం అదే ఆసుపత్రిలో చేరింది. ఆమెకూ ఆపరేషన్ చేశారు. శీల కూడా అస్వస్థతకు గురవడంతో డాక్టర్ ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి శుక్రవారం అర్ధరాత్రి పంపించారు. కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే సరికి శీల మరణించింది. శీలకు ఇద్దరు కూతుళ్లు వాణీ (14), లావణ్య (10), కొడుకు లక్‌పతి (7) ఉన్నారు. ఒకే ఆసుపత్రిలో ఇద్దరు మరణించడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయని మృతుల బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment