Two women died
-
ఒకేరోజు జననం.. ఒకేరోజు మరణం
సాక్షి, ఉమ్మడి వరంగల్: వారిద్దరూ ఒకే రోజు జన్మించారు. బంధుత్వంలో ఆప్యాయంగా మెలిగారు. అయితే వారి మరణం కూడా ఒకేరోజు జరగడం విధి విచిత్రం. మహబూబాబాద్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఒకరి వెంట, మరొకరు మృతి చెందారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దుల బజారుకు చెందిన జానపాటి మల్లమ్మ (85) కుమార్తె అచ్చమ్మను, ఇదే గ్రామానికి చెందిన పంకు యాకమ్మ (85) కుమారుడైన యాకయ్యకు ఇచ్చి వివాహం చేశారు. మల్లమ్మ, యాకమ్మ ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉండడం విశేషం. బంధుత్వంలో వారిద్దరూ అప్యాయంగా ఉండేవారు. శనివారం తెల్లవారుజామున మల్లమ్మ గుండెపోటుతో మృతి చెందింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యాకమ్మ, మల్లమ్మ మృతదేహం వద్ద విలపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమె కూడా గుండెపోటుతో మృతి చెందింది. గంటల వ్యవధిలోనే వియ్యపురాళ్లు ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా మల్లమ్మ, యాకమ్మలు కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే రోజు జన్మించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు -
ఉసురు తీసిన ఆపరేషన్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోయాయని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. సిరిసిల్లలోని గణేష్‌నగర్‌కు చెందిన గాజుల కల్పన (24) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం చేరింది. డాక్టర్ ఆపరేషన్ చేయగా.. శుక్రవారం జ్వరం వచ్చి మతిస్థిమితం కోల్పోయింది. డాక్టర్ మళ్లీ వైద్యం చేస్తుండగానే అర్ధరాత్రి మరణించింది. కల్పనకు రెండేళ్ల బాబు శివాజీ, ఆరు నెలల పాప హిమశ్రీ ఉన్నారు. అలాగే.. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన మాలోతు శీల (34) పైల్స్ సమస్యతో బాధపడుతూ గురువారం అదే ఆసుపత్రిలో చేరింది. ఆమెకూ ఆపరేషన్ చేశారు. శీల కూడా అస్వస్థతకు గురవడంతో డాక్టర్ ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి శుక్రవారం అర్ధరాత్రి పంపించారు. కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే సరికి శీల మరణించింది. శీలకు ఇద్దరు కూతుళ్లు వాణీ (14), లావణ్య (10), కొడుకు లక్పతి (7) ఉన్నారు. ఒకే ఆసుపత్రిలో ఇద్దరు మరణించడం సిరిసిల్లలో చర్చనీయాంశమైంది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయని మృతుల బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు. -
టిప్పర్ ఢీకొని అత్తాకోడళ్లు మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చి అత్తాకోడళ్లను బలి తీసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ నరేందర్ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివసించే కొత్తపల్లి రమ (56) ఆంధ్రాబ్యాంకు క్యాషియర్. ఆమె కుమారుడు సంతోష్ కౌటిల్యకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బల్కాపురం గ్రామానికి చెందిన హిమజ (28)తో ఫిబ్రవరిలో వివాహం చేశారు. సంతోష్ హైదరాబాద్‌లోని డెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుండగా హిమజ గృహిణిగా ఉంటోంది. శనివారం లైసెన్స్ రెన్యువల్ కోసం కొత్తపేట నుంచి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయానికి అత్తాకోడళ్లు స్కూటీపై బయల్దేరారు. రమ హెల్మెట్ ధరించి స్కూటీ నడుపుతుండగా హిమజ వెనకాల కూర్చుంది. రాగన్నగూడ రైస్ మిల్లు వద్దకు రాగానే వెనకాలే ఇబ్రహీంపట్నం వస్తున్న టిప్పర్ (టీఎస్ 12 యూబీ 2673) వీరిని వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్ మీద నుంచి పడిపోయిన అత్తాకోడళ్లు టిప్పర్ వెనుక చక్రాల కింద పడి నలిగిపోయారు. టిప్పర్ ఇద్దరిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. రమ భర్త గతంలోనే మృతిచెందాడు. మృతదేహాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ నరేందర్, ఎస్ఐ సురేశ్ తెలిపారు. ప్రమాదంలో తల్లి, భార్య మృతితో సంతోష్ కన్నీరుమున్నీరయ్యాడు. -
రోడ్డు ప్రమాదంలో మామా అల్లుళ్ల దుర్మరణం
మలికిపురం (రాజోలు): మండలంలోని గుడిమెళ్లంక గ్రామంలో ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కటికదల సుబ్రహ్మణ్యం (38), దుండి సురేష్(27) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ సొంత మామా అల్లుళ్లు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని సార్వా. మలికిపురంలోని బంధువుల ఇంటికి వీరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న వీరు ఎదురుగా వస్తున్న పంగిడికి చెందిన కంకర లారీని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మలికిపురంలోని బంధువుల ఇంట్లో సోమవారం ఓ కార్యక్రమం ఉండటంతో ఇప్పటికే సుబ్రహ్మణ్యం కుమార్తె రాణి, చిన్న కుమార్తె సుష్మ మలికిపురం చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం, సురేష్ శనివారం మలికిపురం వస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే మలికిపురంలోనే ఉన్న కుమార్తెలు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలపై పడి బోరున విలపించారు. ఒకే సారి తండ్రి, భర్తను కోల్పోయిన రాణి, తండ్రిని, బావను కోల్పోయిన సుష్మ విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. రాణికి ఏడాది పాప ఉంది. మలికిపురం, సఖినేటిపల్లి ఎస్సైలు పవన్‌కుమార్, చైతన్యకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాకాసి అల ఇద్దరిని మింగేసింది..
కాకినాడ రూరల్: పిల్లలకు వేసవి సెలవులు అయిపోతున్నాయి.. వారిని సంతోష పెట్టడానికి బీచ్‌కు తీసుకువచ్చిన ఆ ఇద్దరు తల్లులను రాకాసి అల మింగేసింది. దీంతో సంతోషంగా గడుపుదామని వచ్చిన వారి బంధువుల ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. కుటుంబ సభ్యులతో బీచ్‌కు వచ్చిన ముగ్గురు మహిళలు సముద్రంలో స్నానానికి దిగడంతో వారిని కెరటం ఒక్కసారిగా లాక్కొని వెళ్లిపోయింది. సముద్రంలో మునిగిన వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సామర్లకోట మండలం జి.మేడపాడు మెట్టకు చెందిన మేడిశెట్టి కృష్ణవేణి (27), జంపా సంగీత (23) సముద్రంలో మునిగిపోగా దుర్గాదేవి గాయాలతో బయటపడింది. మేడపాడు నుంచి కాకినాడ బీచ్‌కు ఒక ఆటోలో ఐదు కుటుంబాలకు చెందిన 14 మంది సభ్యులు సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ వచ్చారు. సాయంత్రం 3 గంటల సమయంలో తిరుగు ప్రయాణం అవుతూ స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. ముగ్గురు మహిళలను కెరటం సముద్రంలోకి లాక్కుంది. మునిగిన దుర్గాదేవి పైకితేలడంతో కుటుంబ సభ్యులు ఆమెను రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరు సముద్రం లోపలికి వెళ్లిపోయారు. కుటుంబ çసభ్యులు చూస్తుండగానే వీరిద్దరూ సముద్రంలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో సాగరతీరం దద్దరిల్లింది. అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే వలలతో గాలించారు. వలలో చిక్కుకున్న కృష్ణవేణి, సంగీతలను బయటకు తీసి మొత్తం ముగ్గురిని ఆటోలో తీసుకొని సర్పవరం జంక్షన్‌లోని ఓ ప్రైవేట్టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఇద్దరు మహిళలు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దుర్గాదేవికి మెరుగైన వైద్యం చేయడంతో ఆమె తేరుకుంది. వేసవి సెలవులు అయిపోతున్నందున పిల్లలతో ఒక్క రోజు ఆనందంగా గడపడానికి బీచ్‌కు వచ్చామని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనపై సర్పవరం సీఐ డీఎస్ చైతన్యకృష్ణ, తిమ్మాపురం ఎస్సై బి.తిరుపతిరావు ఆస్పత్రిని సందర్శించారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. బోరుమన్న జి. మేడపాడు మెట్ట సామర్లకోట (పెద్దాపురం): జి. మేడపాడు మెట్టపై సాయిబాబా గుడి వీధికి చెందిన ఇద్దరు మహిళలు కాకినాడ బీచ్‌లో మునిగి పొయి మృతి చెందారన్న విషయం తెలియగానే ఆ ప్రాంతంలో మహిళలు బోరున విలపించారు. బీచ్ అభివృద్ది చేశారన్న ప్రచారం నమ్మి తరచూ మహిళలు ఆటోలపై బీచ్‌కు వెళుతున్నారని వారు విలపిస్తూ చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆటోలో ఆరుగురు మహిళలు పిల్లలతో కాకినాడ బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో ముగ్గురు మహిళలు చేతులు పట్టుకుని సముద్రంలోకి దిగితే కృష్ణవేణి, సంగీత పెద్ద కెరటం రావడంతో మునిగిపోయారని వాపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన సంగీతకు జి. మేడపాడుకు చెందిన జంపా గాంధీతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు, మూడేళ్ల బాలలు, నాలుగేళ్ల బాలిక ఉన్నారు. గాంధీ తాపీ పని చేస్తుంటాడు. ఆదివారం సంగీత తల్లి వచ్చి ఉండిలో గృహ ప్రవేశం ఉందని సంగీత పెద్ద కుమారుడిని తీసుకువెళ్లింది. దీంతో మిగిలిన పిల్లలతో సంగీత బీచ్‌కు వెళ్లింది. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన కృష్ణవేణికి మేడపాడు గ్రామానికి చెందిన మేడిశెట్టి పురుషోత్తంతో వివాహమైంది. వీరికి ఆరేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలిక ఉన్నారు. పురుషోత్తం లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. అందరూ ఏడుస్తుండడంతో వారి తల్లులు చనిపోయారన్న విషయం తెలియని ఆ పిల్లలందరూ బిక్కుబిక్కున చూస్తుండిపోయారు. వారిని స్థానికులు హత్తుకొని రోదించడం అందరినీ కలిచివేసింది. చిన్న పిల్లలను ఒంటరిని చేసి తల్లులు మృతి చెందడంతో బంధువుల రోదనతో సాయిబాబా గుడి వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కరీంనగర్లో విషాదం
సాక్షి,కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కుతుర్లు మృతి చెందారు. తల్లి అనసూర్య(85), కూతురు విజయ (55) శనివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
శుభకార్యానికి వెళ్తూ... అనంతలోకాలకు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి భోగాపురం: మండలంలోని రాజాపులోవ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం కణపాకకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు విశాఖపట్నం భీమిలిలోని ఒక శుభకార్యానికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. సరిగ్గా రాజపులోవ సమీపంలోకి వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి విశాఖవైపు వెళ్తున్న లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సావిత్రి (49) అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూరమ్మ (45) మృతి చెందింది. మరో నలుగురికి గాయాలవ్వగా వారంతా చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు నంబర్ నోట్ చేసి ఎస్సై తారకేశ్వరరావుకు అందజేయగా, పెందుర్తి సమీపంలో లారీ పట్టుబడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టిమిద్దె కూలి ఇద్దరు మృతి
-
మట్టిమిద్దె కూలి ఇద్దరు మృతి
బండిఆత్మకూరు: పార్నపల్లె గ్రామంలో మట్టి మిద్దె కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. గ్రామానికి చెందిన దూదేకుల నడిపి హుసేన్ మట్టి మిద్దెలో నివసిస్తున్నాడు. సోమవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఇంట్లో ఉన్న అతని తల్లి కాశీంబీ(65)తో మాట్లాడేందుకు పక్క ఇంట్లో ఉంటున్న (ఆమెకు మనుమరాలి వరుస అయ్యే) సలీమాబీ(40) వచ్చింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కాశీంబీ పెద్ద కుమారుడైన పెద్ద హుసేని భార్య హుసేనమ్మ, మరొ కోడలు చిన్న హుసేనమ్మతో పాటు మనువళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కాశీంబీ మంచం మీద పడుకొని ఉండగా సలీమాబీ కింద బండ మీద పడుకొని ఉండగా మిగతా వారు పక్కనే ఉన్నారు. సాయంత్రం 4 గంటలు కావడంతో పాలు సేకరించే వ్యక్తి రావడంతో చిన్న హుసేనమ్మ, పెద్ద హుసేనమ్మ, చిన్నారులు అక్కడి నుంచి బయటకు వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది సేపటికే మట్టి మిద్దె వరండాలో వేసిన దంతెలు విరగడంతో పైకప్పు కుప్పకూలి పడింది. దీంతో కాశీంబీ, సలీమాబీ మట్టిలో కూరుకొని పోయారు. స్థానికులు శిథిలాలు తొలగించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇద్దరు తీవ్ర గాయాలై మృతి చెందారు. రెప్పపాటులో జేజమ్మ, మనువరాలు చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అపశ్రుతి
పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట: ఇద్దరి మహిళల మృతి పూరీ/భువనేశ్వర్: శ్రీజగన్నాథుని రథ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. శ్రీమందిరం నుంచి గుండిచా మందిరం మధ్య బొడొదండొలో తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తొక్కిసలాటలో 50 మంది పైగా గాయాల పాలయ్యారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారికి రూ.5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. బలభద్రుని రథం తాళధ్వజం లాగే సందర్భంగా మార్కెట్ ఛక్-బలొగండి ఛక్, మరీచ్కోట్ దగ్గర హిందీ విద్యాపీఠ్ ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. మహిళల మృతదేహాలను స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. వీరు తొక్కిసలాటలో మృతి చెందలేదని డీజీపీ సంజీబ్ మారిక్ ప్రకటించారు. బొడొదండొ ప్రాంతంలో డాబాపై నుంచి జారిపడి ఇద్దరు మహిళలు గాయాల పాలయ్యారు. వారిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన వారిలో అజయ్ప్రహరాజ్, సాగరిక మండల్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. సాగర తీరంలో మరో మహిళ మృతి చెందింది. సముద్రంలో స్నానం చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. రథయాత్ర చూసేందుకు అనుగుల్ నుంచి రైలులో వస్తున్న ముగ్గురు జారి పడ్డారు. వారు రౌర్కెలా-పూరీ ప్రత్యేక రైలులో వస్తున్నట్లు గుర్తించారు. వారిలో సురేష్ మాఝి, భగవాన్ మాఝి మృతి చెందారు. వారి మృతదేహాలను పూరీ రైల్వే స్టేషన్ పరిసరాల్లో పట్టాల వద్ద కనుగొన్నారు. మరో ప్రయాణికుడు మొక్క మాఝిని ఆస్పత్రికి తరలించారు. -
ఇద్దరు మహిళలు దుర్మరణం
మలికిపురం : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మండల పరిధిలోని విశ్వేశ్వరాయపురంలో బుధవారం ఆర్టీసీ బస్సు కిందపడి పడమటిపాలేనికి చెందిన ఓదూరి సూర్యకుమారి(35) అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు సతీష్‌ను పోలీసులు రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏఎస్సై భుజంగరావు కథనం ప్రకారం.. రాజోలు నుంచి మలికిపురం వైపు మోటార్ బైక్‌పై సతీష్, అతడి తల్లి సూర్యకుమారి వస్తున్నారు. అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఓవర్టేక్ చేసింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో తల్లీకుమారుడు బస్సు వెనుకచక్రం కిందపడ్డారు. సూర్యకుమారి తలపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సతీష్‌ను ఆస్పత్రికి తరలించగా, అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ కిందపడి.. రాజోలు : బంధువుల పరామర్శకు వెళ్లి మోటార్ బైక్‌పై స్వగ్రామానికి తిరిగివస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో భార్య తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించగా, భర్తకు గాయాలయ్యాయి. ఎస్సై అప్పన్న కథనం ప్రకారం.. మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన గిడుగు సత్యనారాయణ, పద్మ దంపతులు బుధవారం మోటార్ బైక్‌పై పి.గన్నవరంలో బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లారు. కేశనపల్లికి తిరిగి వస్తుండగా రాజోలు మండలం కడలి గమళ్లపాలెం వద్దకు చేరుకునేసరికి.. ములికిపల్లి వైపు వెళ్తున్న సిమెంటు లోడు లారీని ఓవర్టేక్ చేసేందుకు సత్యనారాయణ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో పద్మ రోడ్డుపై పడిపోయింది. ఆమె తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోగా, రోడ్డు పక్కన పడిన సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. పద్మ తమ్ముడు బొలిశెట్టి సాయిరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు.