పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట: ఇద్దరి మహిళల మృతి
పూరీ/భువనేశ్వర్: శ్రీజగన్నాథుని రథ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. శ్రీమందిరం నుంచి గుండిచా మందిరం మధ్య బొడొదండొలో తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తొక్కిసలాటలో 50 మంది పైగా గాయాల పాలయ్యారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారికి రూ.5 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. బలభద్రుని రథం తాళధ్వజం లాగే సందర్భంగా మార్కెట్ ఛక్-బలొగండి ఛక్, మరీచ్‌కోట్ దగ్గర హిందీ విద్యాపీఠ్ ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.
మహిళల మృతదేహాలను స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. వీరు తొక్కిసలాటలో మృతి చెందలేదని డీజీపీ సంజీబ్ మారిక్ ప్రకటించారు. బొడొదండొ ప్రాంతంలో డాబాపై నుంచి జారిపడి ఇద్దరు మహిళలు గాయాల పాలయ్యారు. వారిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన వారిలో అజయ్‌ప్రహరాజ్, సాగరిక మండల్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. సాగర తీరంలో మరో మహిళ మృతి చెందింది. సముద్రంలో స్నానం చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. రథయాత్ర చూసేందుకు అనుగుల్ నుంచి రైలులో వస్తున్న ముగ్గురు జారి పడ్డారు. వారు రౌర్కెలా-పూరీ ప్రత్యేక రైలులో వస్తున్నట్లు గుర్తించారు. వారిలో సురేష్ మాఝి, భగవాన్ మాఝి మృతి చెందారు. వారి మృతదేహాలను పూరీ రైల్వే స్టేషన్ పరిసరాల్లో పట్టాల వద్ద కనుగొన్నారు. మరో ప్రయాణికుడు మొక్క మాఝిని ఆస్పత్రికి తరలించారు.
అపశ్రుతి
Published Sun, Jul 19 2015 12:21 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
Advertisement
Advertisement