ఇద్దరు మహిళలు దుర్మరణం | Two women died in Malikipuram | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళలు దుర్మరణం

Published Wed, Nov 19 2014 11:48 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Two women died in Malikipuram

 మలికిపురం : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. మండల పరిధిలోని విశ్వేశ్వరాయపురంలో బుధవారం ఆర్టీసీ బస్సు కిందపడి పడమటిపాలేనికి చెందిన ఓదూరి సూర్యకుమారి(35) అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు సతీష్‌ను పోలీసులు రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏఎస్సై భుజంగరావు కథనం ప్రకారం.. రాజోలు నుంచి మలికిపురం వైపు మోటార్ బైక్‌పై సతీష్, అతడి తల్లి సూర్యకుమారి వస్తున్నారు. అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఓవర్‌టేక్ చేసింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో తల్లీకుమారుడు బస్సు వెనుకచక్రం కిందపడ్డారు. సూర్యకుమారి తలపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సతీష్‌ను ఆస్పత్రికి తరలించగా, అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 లారీ కిందపడి..
 రాజోలు : బంధువుల పరామర్శకు వెళ్లి మోటార్ బైక్‌పై స్వగ్రామానికి తిరిగివస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో భార్య తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించగా, భర్తకు గాయాలయ్యాయి. ఎస్సై అప్పన్న కథనం ప్రకారం.. మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన గిడుగు సత్యనారాయణ, పద్మ దంపతులు బుధవారం మోటార్ బైక్‌పై పి.గన్నవరంలో బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లారు. కేశనపల్లికి తిరిగి వస్తుండగా రాజోలు మండలం కడలి గమళ్లపాలెం వద్దకు చేరుకునేసరికి.. ములికిపల్లి వైపు వెళ్తున్న సిమెంటు లోడు లారీని ఓవర్‌టేక్ చేసేందుకు సత్యనారాయణ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో పద్మ రోడ్డుపై పడిపోయింది. ఆమె తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోగా, రోడ్డు పక్కన పడిన సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. పద్మ తమ్ముడు బొలిశెట్టి సాయిరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement