మట్టిమిద్దె కూలి ఇద్దరు మృతి
బండిఆత్మకూరు: పార్నపల్లె గ్రామంలో మట్టి మిద్దె కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. గ్రామానికి చెందిన దూదేకుల నడిపి హుసేన్ మట్టి మిద్దెలో నివసిస్తున్నాడు. సోమవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఇంట్లో ఉన్న అతని తల్లి కాశీంబీ(65)తో మాట్లాడేందుకు పక్క ఇంట్లో ఉంటున్న (ఆమెకు మనుమరాలి వరుస అయ్యే) సలీమాబీ(40) వచ్చింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కాశీంబీ పెద్ద కుమారుడైన పెద్ద హుసేని భార్య హుసేనమ్మ, మరొ కోడలు చిన్న హుసేనమ్మతో పాటు మనువళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కాశీంబీ మంచం మీద పడుకొని ఉండగా సలీమాబీ కింద బండ మీద పడుకొని ఉండగా మిగతా వారు పక్కనే ఉన్నారు. సాయంత్రం 4 గంటలు కావడంతో పాలు సేకరించే వ్యక్తి రావడంతో చిన్న హుసేనమ్మ, పెద్ద హుసేనమ్మ, చిన్నారులు అక్కడి నుంచి బయటకు వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది సేపటికే మట్టి మిద్దె వరండాలో వేసిన దంతెలు విరగడంతో పైకప్పు కుప్పకూలి పడింది. దీంతో కాశీంబీ, సలీమాబీ మట్టిలో కూరుకొని పోయారు. స్థానికులు శిథిలాలు తొలగించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇద్దరు తీవ్ర గాయాలై మృతి చెందారు. రెప్పపాటులో జేజమ్మ, మనువరాలు చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.