పరిశోధనలపై మరింత దృష్టి
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో జీవీ ప్రసాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఖరీదైన ఔషధాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా పరిశోధన సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సహ-చైర్మన్, సీఈవో జీవీ ప్రసాద్ వెల్లడించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, బెంగళూరుతో పాటు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఆర్అండ్డీ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. గురువారం జరిగిన కంపెనీ 30వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రసాద్ ఈ విషయాలు వివరించారు.
ఔషధాలను చౌకగా అందించడంతో పాటు ఇప్పటిదాకా అంతగా ఎవరూ దృష్టి పెట్టని కొన్ని కీలకమైన ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నామని ప్రసాద్ తెలిపారు. హైపర్ టెన్షన్ చికిత్స కోసం ఈ మధ్యే భారత్లో ప్రవేశపెట్టిన ఆప్టిడోజ్ ఆ కోవకి చెందినదేనని వివరించారు. మరోవైపు, కార్పొరేట్ సామాజిక బాధ్యతని (సీఎస్ఆర్) ప్రభుత్వం తప్పనిసరి చేయడానికి చాలా ముందు నుంచే తాము పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రసాద్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ దాదాపు 7,500 మంది రైతులు ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయ వ్యయాలు తగ్గించుకునేందుకు తోడ్పాటు అందించినట్లు వివరించారు. ఇక అర్బన్ లైవ్లీహుడ్ ప్రోగ్రాం కింద ఈ ఏడాది 21,000 పైచిలుకు యువతకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు.